Fake News, Telugu
 

వీడియోలో ఉన్న వ్యక్తి యోగి కాదు, తమిళనాడులో 300 ఏళ్లుగా సమాధి చేయబడలేదు

0

ఈ వీడియోలోని  వ్యక్తి ‘300 ఏళ్ల క్రితం తమిళనాడులోని వల్లియూర్‌లో జీవసమాధిలోకి వెళ్లిన యోగి’ అంటూ సోషల్ మీడియాలో  షేర్ చేస్తున్నారు. వల్లియూర్ ఆలయాన్ని పునరుద్ధరించేందుకు మట్టిని తవ్వుతుండగా అతడు సజీవంగా కనిపించాడు అని, అతను దొరికినప్పుడు యోగాసనంలో కూర్చొని ఉన్నాడని పోస్ట్‌లో రాసి ఉంది. ఇందులోని నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: తమిళనాడులో 300 సంవత్సరాల పాటు జీవసమాధిలో ఉన్న తర్వాత సజీవంగా కనుగొనబడిన యోగి యొక్క వీడియో.

ఫ్యాక్ట్ (నిజం): వీడియోలో ఉన్న వ్యక్తి యోగి కాదు. అంతే కాదు, అతను తమిళనాడులో 300 ఏళ్లుగా సమాధి చేయబడలేదు. అతని పేరు అలెగ్జాండర్, కజకిస్తాన్ నివాసి. అతను ‘సోరియాసిస్’ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. అందువల్ల పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.

వీడియోలోని స్క్రీన్‌షాట్స్‌ని ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా పొస్ట్‌లో ఉన్న ఫోటో కలిగిన అనేక వార్తా కథనాలు లభించాయి. ‘డైలీ మెయిల్’ కథనంలో, వీడియోలో ఉన్న వ్యక్తి కజకిస్థాన్‌లోని అక్టోబ్ నగర నివాసి అలెగ్జాండర్ అని పేర్కొన్నారు. ఈ కథనం ప్రకారం, వీడియోలోని వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసిందనే వాదనతో గతంలో ఇదే వీడియో వైరల్ అయినట్లు తెలిసింది. కానీ ఆ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేయలేదని, ‘సోరియాసిస్’ అనే వ్యాధితో తాను బాధపడుతున్నాడని తేలింది.

‘డైలీ మెయిల్’తో డాక్టర్ (వ్యక్తికి చికిత్స చేసిన) మాట్లాడుతూ, ‘అతను మెడికల్ అసెస్‌మెంట్‌లో ఉన్నప్పుడు ఎవరో చిత్రీకరించారు మరియు దీనిని యూట్యూబ్‌లో లీక్ చేశారు. అతను సోరియాసిస్‌తో బాధపడుతున్నాడు కానీ వైద్య చికిత్స పొందడంలో ఆలస్యం చెయ్యడం వల్ల అతని పరిస్థితి మరింత దిగజారింది.’  అని అన్నారు.  వేరే మీడియా కథనాల ప్రకారం ఆ వ్యక్తి సోరియాసిస్ గాయాలకు ఇన్ఫెక్షన్ అవ్వటం వల్ల, సెప్సిస్తో మరణించాడు అని తెలిసింది. అలెగ్జాండర్‌కి సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, వీడియోలో ఉన్న వ్యక్తి యోగి కాదు, మరియు తమిళనాడులో 300 ఏళ్లుగా సమాధి చేయబడలేదు.

Share.

About Author

Comments are closed.

scroll