Fake News, Telugu
 

‘Omicron-XBB’ సబ్-వేరియంట్‌, డెల్టా వేరియంట్ కంటే 5 రేట్లు ప్రమాదకరం అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు

0

ఇటీవల అనేక దేశాలలో COVID-19 కేసులు పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో, Omicron-XBB వేరియంట్ తీవ్రత, మరణాల రేటు, వ్యాధి లక్షణాలు మరియు వైరస్‌ను గుర్తించడం గురించి ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.   

క్లెయిమ్: Omicron XBB వేరియంట్‌ను గుర్తించడం సులభం కాదు. ఈ వేరియంట్ వలన దగ్గు మరియు జలుబు లక్షణాలు ఉండవు. డెల్టా వేరియంట్ కంటే 5 రేట్లు ప్రమాదకరం మరియు మరణాల రేటు ఎక్కువ.

ఫాక్ట్: WHO ప్రకారం, వివిధ దేశాల నుంచి వచ్చిన రిపోర్టులను పరీక్షించగా, Omicron – XBB తీవ్రత గతంలో వచ్చిన వేరియంట్ ల లంటే ఎక్కువ ఉంది అని చెప్పడానికి ఆధారాలు లేవు. అయితే, ప్రాధమిక  సమాచారం ప్రకారం, ఇతర ‘Omicron’ వేరియంట్ ల కంటే XBB వలన రీ-ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంది అని తెలుస్తుంది. దీని పైన ఇంకా పూర్తి పరిశోధనలు జరగాల్సి ఉంది. ఇతర వేరియంట్ల లాగానే దీనిని కూడా సాధారణ టెస్టులతో గుర్తించవచ్చు. భారత్, సింగపుర్ లలో ఈ వైరస్ సోకిన వారిలో ఎక్కువ మందికి జ్వరం, గొంతు నొప్పి వంటి స్వల్ప లక్షణాలు కనిపించాయి. ఎక్కువ మంది ఆసుపత్రి చికిత్స అవసరం లేకుండానే కోలుకున్నారు. భారత్, సింగపూర్ మరియు మలేషియా ప్రభుత్వాలు ఇటువంటి పోస్టులని నమ్మవద్దు అని, కేవలం అధికారిక వెబ్‌సైటులను అనుసరించండి అని విజ్ఞప్తి చేశాయి. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధికారిక వెబ్‌సైటు ప్రకారం, XBB అనేది కరోనా వైరస్ వేరియంట్ అయిన ‘Omicron’ కు సబ్-వేరియంట్. దీనిని ఆగస్టు 2022 లో గుర్తించారు. WHO రిపోర్ట్ ప్రకారం, వివిధ దేశాల నుంచి వచ్చిన రిపోర్టులను పరీక్షించగా, Omicron – XBB తీవ్రత గతంలో వచ్చిన వేరియంట్ల కంటే ఎక్కువ ఉంది అని చెప్పడానికి ఆధారాలు లేవు. అయితే, ప్రాధమిక  సమాచారం ప్రకారం, ఇతర ‘Omicron’ వేరియంట్ల కంటే XBB వలన రీ-ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంది అని తెలుస్తుంది. దీని పైన ఇంకా పూర్తి పరిశోధనలు జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు అయితే, ఈ సబ్-వేరియంట్, వ్యాధి నిరోధక వ్యవస్థను తప్పించుకొని శరీరం పైన దాడి చేస్తుంది అని ఎక్కడా రుజువు కాలేదు. అయితే ఈ వైరస్ వ్యాప్తి పైన ఎప్పటికప్పుడు WHO సమీక్షిస్తూ ఉంటుందని మరియు ప్రజలు ఎప్పటి లాగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించింది.

ఇక ఇతర వేరియంట్ల లాగానే ‘Omicron’ని కూడా సాధారణ టెస్టులతో గుర్తించవచ్చు. దీనికోసం ప్రత్యేకమైన టెస్టులు ఏమీ లేవు. ఇక ఈ వైరస్ ఇది వరకే భారత్ మరియు సింగపూర్ లో వ్యాప్తి చెందగా, కేవలం జ్వరం, గొంతు నొప్పి వంటి స్వల్ప లక్షణాలను గుర్తించారు మరియు ఎక్కువ మంది ఆసుపత్రి చికిత్స అవసరం లేకుండానే కోలుకున్నారు.

ఇదే పోస్టు భారత్ తో పాటు సింగపూర్, మలేషియా వంటి ఇతర దేశాలలో కూడా వైరల్ అవుతుండటంతో ఆయా ప్రభుత్వాలు దీనిని తప్పుడు పోస్టుగా నిర్ధారించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.  

మొత్తంగా, Omicron-XBB సబ్-వేరియంట్‌ డెల్టా వేరియంట్ కంటే 5 రేట్లు ప్రమాదకరం అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll