Fake News, Telugu
 

10వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షలు రద్దు చేయాలని జాతీయ నూతన విద్యా విధానం, 2020 ప్రతిపాదించలేదు

0

కేంద్ర మంత్రివర్గం నూతన విద్యా విధానానికి ఆమోదం తెలిపిందని చెప్తూ ఈ నూతన విద్యా విధానానికి సంబంధించి పలు ప్రతిపాదనలను వివరిస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ విధానంలో ప్రాథమిక విద్య నుండి సాంకేతిక విద్య వరకు చేసిన ప్రతిపాదనల గురించి వివరించే క్రమంలో 10వ తరగతికి పబ్లిక్ పరీక్షలు ఉండవని చెప్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా పోస్టులో చెప్తున్న విషయాలకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: నూతన విద్యా విధానం, 2020 ప్రకారం 10వ తరగతికి పబ్లిక్ పరీక్షలు ఉండవు.

ఫాక్ట్(నిజం):  జాతీయ నూతన విద్యా విధానంలో 10వ తరగతికి బోర్డు పరీక్షలు రద్దు చేయాలనే ప్రతిపాదన ఏది లేదు. ఈ నూతన విధానం ప్రకారం 10 మరియు 12వ తరగతిలో బోర్డు పరీక్షలు కొనసాగుతూనే ఉంటాయి. పైగా విద్యార్థులపై ఒత్తిడి తగ్గేలా ఒక విద్యా సంవత్సరంలో రెండుసార్లు బోర్డు పరీక్షలను నిర్వహించాలని నూతన విద్యా విధానం ప్రతిపాదించింది. ఒకటి మెయిన్ పరీక్ష కాగా మరొకటి ఇంప్రూవ్‌మెంట్ పరీక్ష. మార్కులు మెరుగు పరుచుకోవడానికి విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్ పరీక్ష రాసుకోవచ్చు. ఐతే వెసులుబాటు వచ్చే విద్యా సంవత్సరం (2024-25) నుండి అమలులోకి వస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల స్పష్టం చేసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పాఠశాల మరియు ఉన్నత విద్యలో విస్తృతమైన సంస్కరణలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జూలై 2020లో నూతన విద్యా విధానాన్ని ఆమోదించింది. 1986లో రూపొందించిన 34 ఏళ్ల జాతీయ విద్యా విధానం స్థానంలో ఈ కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టంది. కాగా ఈ నూతన విధానం ఈ విద్యా సంవత్సరం (2023-24) నుండి అమలులోకి వచ్చింది.

ఐతే పోస్టులో చెప్తున్నట్టు 5వ తరగతి వరకు విద్యార్థులకు మాతృభాష బోధన, 9 నుండి 12వ తరగతి వరకు సెమిస్టర్ విధానం, MA విద్యార్థులు ఇప్పుడు నేరుగా PhD చేయగలుగడం, నేషనల్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ ఫోరమ్ (NETF), మొదలైన ప్రతిపాదనలు నూతన విద్యా విధానంలో ప్రతిపాదించారు. ఐతే 10వ తరగతికి పబ్లిక్ పరీక్షలు రద్దు ప్రతిపాదన మాత్రం ఇందులో చేయలేదు.

10 మరియు 12వ తరగతిలో బోర్డు పరీక్షలు కొనసాగిస్తూనే, విద్యార్థులు కోచింగ్ క్లాసులకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేయడానికి ఒక విద్యా సంవత్సరంలో రెండుసార్లు బోర్డు పరీక్షలను నిర్వహించాలని నూతన విద్యా విధానం ప్రతిపాదించింది. ఒకటి మెయిన్ పరీక్ష కాగా మరొకటి ఇంప్రూవ్‌మెంట్ పరీక్ష. మార్కులు మెరుగు పరుచుకోవడానికి విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్ పరీక్ష రాసుకోవచ్చు. ఐతే వెసులుబాటు వచ్చే విద్యా సంవత్సరం (2024-25) నుండి అమలులోకి వస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల స్పష్టం చేసారు. ఇది 10 మరియు 12వ తరగతులకు వర్తిస్తుంది.

పలు ప్రధాన వార్తా కథనాలు 10వ తరగతికి పబ్లిక్ పరీక్షలు రద్దు అంటూ వార్తా కథనాలు ప్రచురించడంతో సోషల్ మీడియాలో ఈ వార్త విస్తృతంగా గతంలో కూడా షేర్ అయింది. ఐతే గతంలో కూడా ఇలాంటి వార్తలే వచ్చినప్పుడు PIB 2022లోనే ఈ వార్తను ఖండించింది. నూతన విద్యా విధానంలో ఇలాంటి ప్రతిపాదన లేదని స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా 9-12 తరగతులను సెమిస్టర్ వారిగా నిర్వహించే ప్రతిపాదనను రెండో ఫేస్‌లో అమలు చేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. నూతన విద్యా విధానం 2020లో చేసిన పూర్తి ప్రతిపాదనలు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, జాతీయ నూతన విద్యా విధానం 2020లో 10వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షలు రద్దు చేయాలన్న ప్రతిపాదనేదీ లేదు.

Share.

About Author

Comments are closed.

scroll