Fake News, Telugu
 

ఈ ఫొటోలో గాంధీ కుటుంబంతో ఉన్నది కంగనా రనౌత్‌పై దాడి చేసిన మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ కాదు

0

ఇటీవల చండీగఢ్ ఎయిర్‌పోర్టులో తనపై అక్కడే విధులు నిర్వర్తిస్తున్న మహిళా CISF కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ దాడి చేసిందని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ తరవాత MPని కొట్టినందుకు ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేసినట్టు కూడా వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి. ఐతే ఈ క్రమంలోనే ఒక ఫోటో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. రాహుల్, ప్రియాంక, సోనియా గాంధీలతో పాటు ఒక మహిళ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఆ మహిళ కంగనాపై దాడి చేసిన కుల్విందర్ కౌర్ అని, ఆమెకు గాంధీ కుటుంబం అండ ఉందని, అందుకే ఆమె కంగనాపై దాడి చేసిందంటూ అర్ధం వచ్చేలా షేర్ చేస్తున్నారు (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ ఫొటోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఎయిర్‌పోర్టులో కంగనా రనౌత్‌పై దాడి చేసిన CISF కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ గాంధీ కుటుంబంతో ఉన్న ఫోటో.

ఫాక్ట్(నిజం): ఈ ఫొటోలో గాంధీ కుటుంబంతో ఉన్నది రాజస్థాన్ కాంగ్రెస్‌కు చెందిన మాజీ MLA దివ్య మహిపాల్ మదెర్నా. ఫిబ్రవరి 2024లో రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి సోనియా గాంధీ రాజస్థాన్ వచ్చినప్పుడు వారిని కలిసినప్పటిది ఈ ఫోటో. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

చండీగఢ్ ఎయిర్‌పోర్టులో కంగనా రనౌత్‌పై మహిళా కానిస్టేబుల్ దాడి చేసినట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసిన విషయం నిజమే అయినప్పటికీ ప్రస్తుతం షేర్ అవుతన్న ఫొటోలో గాంధీలతో ఉన్నది దాడి చేసిన కుల్విందర్ కౌర్ కాదు, రాజస్థాన్ కాంగ్రెస్‌కు చెందిన మాజీ MLA దివ్య మహిపాల్ మదెర్నా.

ఈ ఫోటోకు సంబంధించి మరింత సమాచారం కోసం రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోను దివ్య మహిపాల్ ఫిబ్రవరి 2024లో షేర్ చేసిన ట్వీట్ మాకు కనిపించింది. రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి సోనియా గాంధీ రాజస్థాన్ వచ్చినప్పుడు వారిని కలిసినట్టు చెప్తూ దివ్య మహిపాల్ ఈ ఫోటోను షేర్ చేసింది. ఇదే ఫోటీని దివ్య మహిపాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లో కూడా పోస్ట్ చేసింది.

కంగనాపై దాడిచేసిన కుల్విందర్ కౌర్, దివ్య మహిపాల్ ఫోటోలను పోల్చి చూసినా కూడా వైరల్ ఫోటోలో ఉన్నది కుల్విందర్ కౌర్  కాదన్న విషయం స్పష్టమవుతుంది.

చివరగా, ఈ ఫొటోలో గాంధీ కుటుంబంతో ఉన్నది కంగనా రనౌత్‌పై దాడి చేసిన మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ కాదు.

Share.

About Author

Comments are closed.

scroll