2024 పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో, దేశంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావడానికి ఎంఐఎం పార్టీ సహాయపడిందని, అందుకు ఉదాహరణగా ఉత్తర ప్రదేశ్‌లో ఎంఐఎం పార్టీ పోటీ చేసిన స్థానాల్లో సమాజ్‌వాది పార్టీ ఓట్లను చీల్చి బీజేపీ విజయానికి సహకరించిందని చెప్తూ ఒక పోస్టు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఈ విధంగా 200 ఓట్ల తేడాతో 7 స్థానాల్లో, 500 ఓట్ల తేడాతో 23 స్థానాల్లో, 1000 ఓట్ల తేడాతో 49 స్థానాల్లో, 2000 ఓట్ల తేడాతో 86 స్థానాల్లో బీజేపీ గెలిచిందని ఈ పోస్టులో పేర్కొన్నారు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: ఉత్తర ప్రదేశ్‌లో 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఓట్లు చీల్చడం ద్వారా బీజేపీ 165 సీట్లలో 2000 లేదా అంతకంటే తక్కువ మెజారిటీతో గెలిచింది.
ఫాక్ట్: 2024 పార్లమెంటు ఎన్నికలలో ఎంఐఎం పార్టీ ఉత్తర ప్రదేశ్‌లో నేరుగా పోటీ చెయ్యలేదు. PDM అనే కూటమిలో భాగంగా ఉంది. ఈ కూటమి బిజెపి గెలిచిన 33 స్థానాల్లో 5 చోట్ల పోటీ చేయగా బీజేపీకి వచ్చిన మెజారిటీ కంటే చాలా తక్కువ ఓట్లు పొందింది. పైగా, దేశవ్యాప్తంగా బీజేపీ 2000 ఓట్ల కంటే తక్కువ మెజారిటీతో గెలిచిన మూడు స్థానాల్లో ఎంఐఎం పోటీ కూడా చెయ్యలేదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా వైరల్ పోస్టులో గమనించగా, బీజేపీ 165 (7+23+49+86) సీట్లలో 2000 లేదా అంతకంటే తక్కువ మెజారిటీతో గెలిచిందని చెప్పబడింది. అయితే అసలు ఉత్తర ప్రదేశ్‌లో మొత్తం పార్లమెంటు సీట్లు 80, కాబట్టి బీజేపీ 165 సీట్లలో గెలవడానికి అవకాశమే లేదు. పైగా వైరల్ పోస్టులో చెప్పబడిన వాటిలో బిజ్నోర్, సుల్తాన్ పూర్, ఫిరోజాబాద్ మాత్రమే పార్లమెంటు నియోజకవర్గాలు. నాకూర్, కుర్సీ, , ఔరాయ్, షాహ్ గంజ్ ఉత్తర ప్రదేశ్‌లోని అసెంబ్లీ స్థానాలు. బిజ్నోర్‌లో NDA కూటమి పార్టీ RLD గెలవగా సుల్తాన్ పూర్, ఫిరోజాబాద్ స్థానాల్లో I.N.D.I.A కూటమిలో ఉన్న సమాజ్‌వాది పార్టీ అభ్యర్ధులు గెలిచారు. ఇదిలా ఉండగా, ఇదే తరహా పోస్టులు 2022లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముడిపెడుతూ వైరల్ అయినప్పుడు మేము రాసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్‌ని ఇక్కడ చూడవచ్చు.
ఇక 2024 పార్లమెంటు ఎన్నికల విషయానికి వస్తే, ఎన్నికల సంఘం అధికారిక గణాంకాల ప్రకారం, ఉత్తర ప్రదేశ్‌లోని 80 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ 33 స్థానాల్లో గెలవగా, మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ మరియు ఇతర పార్టీలు గెలిచాయి. అయితే ఎంఐఎం 2024లో ఉత్తర ప్రదేశ్‌లో ప్రత్యక్షంగా పోటీ చేయనప్పటికీ PDM అనే కూటమిలో భాగంగా ఉంది. బిజెపి గెలిచిన 33 స్థానాల్లో PDM కూటమి పార్టీలు 5 చోట్ల పోటీ చేయగా బీజేపీకి వచ్చిన మెజారిటీ కంటే ఈ కూటమికి వచ్చిన ఓట్లు చాలా తక్కువగా ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి.
పైగా, బీజేపీకి ఉత్తర ప్రదేశ్‌లో 2000 ఓట్లకు తక్కువ మెజారిటీ ఒక్క చోట కూడా రాలేదు. ఆ పార్టీకి వచ్చిన అత్యల్ప మెజారిటీ ఫరుక్కాబాద్‌లో 2678గా నమోదైంది. అంతేకాకుండా, దేశవ్యాప్తంగా 2000 ఓట్ల కంటే తక్కువ మెజారిటీతో బీజేపీ గెలిచిన స్థానాలు మూడు మాత్రమే. అవి రాజస్థాన్‌లోని జైపూర్ రూరల్, ఒడిశాలోని జాజపూర్ మరియు ఛత్తీస్‌ఘడ్‌లోని కంకెర్ పార్లమెంటు స్థానాలు. వీటిలో కూడా ఎంఐఎం పోటీ చెయ్యలేదు.
చివరిగా, 2024 ఉత్తర ప్రదేశ్ పార్లమెంటు ఎన్నికలలో ఎంఐఎం ఓట్లు చీల్చడం వల్ల బీజేపీ భారీగా లబ్ధి పొందిందని చేస్తున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.