Fake News, Telugu
 

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి పోల్ అయిన ఓట్లు 4,50,929 మాత్రమే, 22 లక్షలు కాదు.

0

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ‘ఈ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఎంఐఎం పార్టీకి 100  స్థానాలకు పోటీ చేయగా, 22.3 లక్షల ఓట్లు వచ్చాయని’ చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. అదే విధంగా ఇదే పోస్టులో ‘సమాజ్‌వాదీ పార్టీ 82 అసెంబ్లీ స్థానాల్లో 500 లోపు ఓట్లతో, 81 అసెంబ్లీ స్థానాల్లో 1000 లోపు ఓట్లతో  ఓడిపోయిందని’  మరొక క్లెయిమ్ కూడా చేస్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా పోస్టులో చేస్తున్న వాదనలకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ‘ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి 22.3 లక్షల ఓట్లు వచ్చాయి’ ; ‘సమాజ్‌వాదీ పార్టీ 82 అసెంబ్లీ స్థానాల్లో 500 లోపు ఓట్లతో, 81 అసెంబ్లీ స్థానాల్లో 1000 లోపు ఓట్లతో  ఓడిపోయింది.’

ఫాక్ట్: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎంఐఎం పార్టీకి ఈ ఎన్నికల్లో మొత్తం మీద 4,50,929 పోల్ అయ్యాయి. అంటే మొత్తం పోల్ అయిన ఓట్లలో 0.49% ఓట్లు ఎంఐఎం పార్టీకి  పోల్ అయ్యాయి. ఇకపోతే ఓట్ల తేడాకు సంబంధించి మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 15 స్థానాలలో మాత్రమే అభ్యర్థులు వెయ్యిలోపు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ 15 స్థానాలలో కూడా కేవలం 7 స్థానాల్లో మాత్రమే సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు వెయ్యి లోపు ఓట్ల తేడాతో ఓడిపోయారు. సమాజ్‌వాదీ పార్టీ మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ అభ్యర్థులు 2 స్థానాల్లో వెయ్యి లోపు ఓట్ల తేడాతో ఓడిపోగా, మిగిలిన 6 స్థానాలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు వెయ్యి లోపు ఓట్ల తేడాతో ఓడిపోయారు. వీటన్నిటి బట్టి పోస్టులో చేస్తున్న వాదనలు కరెక్ట్ కాదని స్పష్టమవుతుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఎంఐఎం పార్టీకి 22.3 లక్షల ఓట్లు ?

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ 41.3% ఓట్లతో మొదటి స్థానంలో ఉండగా, సమాజ్‌వాదీపార్టీ 32.1% ఓట్లతో రెండో స్థానంలో ఉంది. ఐతే పోస్టులో చెప్తునట్టు ఎంఐఎం పార్టీకి ఈ ఎన్నికల్లో 22 లక్షల ఓట్లు పోల్ అవ్వలేదు. 

ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా విడుదల చేసిన సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఎంఐఎం పోటీ చేసిన అన్ని స్థానాలు కలిపి ఆ పార్టీకి మొత్తం మీద 4,50,929 పోల్ అయ్యాయి. అంటే మొత్తం పోల్ అయిన ఓట్లలో 0.49% ఓట్లు.

సమాజ్‌వాదీ పార్టీ 82 అసెంబ్లీ స్థానాల్లో 500 లోపు ఓట్లతో, 81 అసెంబ్లీ స్థానాల్లో 1000 లోపు ఓట్లతో  ఓడిపోయింది ?

ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా సమాచారం ప్రకారం మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 15 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులు వెయ్యి లోపు ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఐతే ఈ 15 స్థానాలలో కూడా కేవలం 7 స్థానాల్లో మాత్రమే సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు వెయ్యి లోపు ఓట్ల తేడాతో ఓడిపోయారు. సమాజ్‌వాదీ పార్టీ మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ అభ్యర్థులు 2 స్థానాల్లో వెయ్యి లోపు ఓట్ల తేడాతో ఓడిపోగా, మిగిలిన 6 స్థానాలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు వెయ్యి లోపు ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఐతే ఈ 15 స్థానాలలో ఓట్ల తేడాను పరిశీలిస్తే ఇందులో 11 స్థానాలలో అభ్యర్థులు 500 లోపు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ 11 స్థానాలలో కూడా కేవలం 5స్థానాల్లో మాత్రమే సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు 500 లోపు ఓట్ల తేడాతో ఓడిపోయారు. సమాజ్‌వాదీ పార్టీ మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ అభ్యర్థులు 2 స్థానాల్లో వెయ్యి లోపు ఓట్ల తేడాతో ఓడిపోగా, మిగిలిన 4 స్థానాలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 500 లోపు ఓట్ల తేడాతో ఓడిపోయారు. వీటన్నిటి బట్టి పోస్టులో చేస్తున్న వాదన కరెక్ట్ కాదని స్పష్టమవుతుంది.

చివరగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి పోల్ అయిన ఓట్లు 4,50,929 మాత్రమే, 22 లక్షలు కాదు.

Share.

About Author

Comments are closed.

scroll