సఫియా ఫిరోజి అనే అఫ్గాన్ ఎయిర్ ఫోర్స్ మహిళా పైలట్‌ని తాజగా అఫ్గానిస్తాన్‌లో రాళ్లతో కొట్టి చంపేసారని చెప్తూ, ఒక ఫోటోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: తాజగా అఫ్గానిస్తాన్‌లో రాళ్లతో కొట్టి చంపేసిన సఫియా ఫిరోజి అనే అఫ్గాన్ ఎయిర్ ఫోర్స్ మహిళా పైలట్ ఫోటో.
ఫాక్ట్: పోస్ట్ చేసిన ఫోటోలో ఉన్నది ఫర్ఖుండా మాలిక్జాదా అనే మహిళ; అఫ్గాన్ పైలట్ సఫియా ఫిరోజి కాదు. 2015లో ఖురాన్‌ని కాల్చేసిందనే తప్పుడు ఆరోపణతో అఫ్గానిస్తాన్‌లోని కాబుల్ ప్రాంతానికి చెందిన కొంత మంది ఫర్ఖుండా మాలిక్జాదాను కొట్టి చంపేసారు. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.
పోస్ట్‌లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, ఆ ఫోటోతో ఉన్న చాలా వెబ్‌సైట్లు సెర్చ్ రిజల్ట్స్‌లో వచ్చాయి. ఆ ఫోటోలో ఉన్న మహిళ పేరు ‘ఫర్ఖుండా మాలిక్జాదా’ అని వివిధ వెబ్‌సైట్లలో రాసి ఉన్నట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.
ఆ పేరుతో ఇంటర్నెట్‌లో వెతకగా, తనకు సంబంధించిన చాలా వివరాలు సెర్చ్ రిజల్ట్స్‌లో వచ్చాయి. ఫోటోలోని ఘటన 2015లో జరిగినట్టు తెలిసింది. ఖురాన్‌ని కాల్చేసిందనే తప్పుడు ఆరోపణతో అఫ్గానిస్తాన్‌లోని కాబుల్ ప్రాంతానికి చెందిన కొంత మంది తనను కొట్టి చంపేశారని ‘ది న్యూయార్క్ టైమ్స్’ అర్టికల్‌లో చదవొచ్చు. ఆ ఘటనకి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవొచ్చు. తను ఒక అఫ్గాన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అని ఎక్కడా కూడా రాసి లేదు.
పైలట్ సఫియా ఫిరోజి ఎవరు?
పైలట్ సఫియా ఫిరోజి గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, తను నిజంగానే అఫ్గాన్ ఎయిర్ ఫోర్స్ మహిళా పైలట్ అని తెలిసింది. గతంలో తనపై వివిధ వార్తాసంస్థలు రాసిన న్యూస్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ,మరియు ఇక్కడ చూడవొచ్చు.
అయితే, సఫియా ఫిరోజిని తాజగా అఫ్గానిస్తాన్‌లో రాళ్లతో కొట్టి చంపేసినట్టు మాకు ఎక్కడా ఎటువంటి సమాచారం లభించలేదు. గత కొన్ని నెలల్లో కొంత మంది అఫ్గాన్ పైలట్లను తాలిబాన్లు చంపేసినట్టు మాత్రం న్యూస్ ఆర్టికల్స్ లభించాయి.
చివరగా, ఫోటోలో ఉన్నది ఫర్ఖుండా మాలిక్జాదా; అఫ్గాన్ పైలట్ సఫియా ఫిరోజి కాదు. 2015లో ఖురాన్‌ని కాల్చేసిందనే ఆరోపణతో అఫ్గానిస్తాన్‌లో కొంత మంది తనను చంపేసారు.