ప్రపంచంలోని మొట్టమొదటి కోవిడ్-19 వాక్సిన్ ని రష్యా ఆమోదించిందని, ఈ వాక్సిన్ ని తన కూతురిపై ప్రయోగించాము అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన నేపధ్యంలో ఒక అమ్మయికి వాక్సిన్ ఇస్తున్న వీడియోను చూపిస్తూ ఆ వీడియోలో ఉన్నది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూతురని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూతురికి కోవిడ్-19 వాక్సిన్ ఇస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): వీడియోలో ఉన్న అమ్మాయి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూతురు కాదు. ఆ అమ్మాయి పేరు నటల్య, రష్యా లో వాక్సిన్ ట్రయల్స్ లో భాగంగా వాక్సిన్ తీసుకున్న ఒక వాలంటీర్. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
పోస్టులోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని Yandex ద్వారా రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ వీడియోను పోలిన చాలా వీడియోలు మాకు కనిపించాయి. ఇలాంటిదే ఒక వీడియో జూలై 2020లో ఒక రష్యన్ యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసారు. బుర్దేన్కో మెయిన్ మిలిటరీ క్లినికల్ హాస్పిటల్ లో వాక్సిన్ ట్రయల్స్ ముగిశాక వాలంటీర్లను డిశ్చార్జ్ చేసారు అని ఆ వీడియోకి సంబంధించిన వివరణలో ఉంది.
‘Zvezda’ (రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ ద్వారా నడపబడుతున్న ప్రభుత్వ యాజమాన్య టీవీ ఛానల్) జూన్ 2020లో ప్రచురించిన ఒక కథనంలో పోస్టులో ఉన్న అమ్మయిని పోలిన (ఒకే రకమైన చెవి పోగులు ధరించిన) ఫోటోని చూడొచ్చు. రష్యాలో క్లినికల్ ట్రయల్స్ కి సంబంధించి 13 జూలై 2020న Zvezda యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియోలో ఈ అమ్మాయి మాట్లాడుతూ కనిపిస్తుంది. ఐతే ఈ వీడియో ప్రకారం ఈ అమ్మాయి పేరు నటల్య, మిలిటరీ మెడికల్ అకాడమీ క్యాడెట్. దీనికి సంబంధించిన కథనం ఇక్కడ చదవొచ్చు. దీన్నిబట్టి ఆ అమ్మాయి పుతిన్ కూతురు కాదని చెప్పొచ్చు. ఎందుకంటే, వార్తా కథనాల ప్రకారం పుతిన్ కూతుర్ల పేర్లు Maria Vorontsova మరియు Katerina Tikhonova.
‘Zvezda’ ప్రచురించిన మరొక కథనంలో మాస్కు లేకుండా ఉన్న ఈ అమ్మాయి ముఖాన్ని చూడొచ్చు. దీన్నిబట్టి పోస్టులో ఉన్న వీడియోలో ఉన్నది పుతిన్ కూతురు కాదని కచ్చితంగా చెప్పొచ్చు.
చివరగా, పోస్టులో ఉన్న వీడియోలో వాక్సిన్ తీసుకుంటున్నట్టుగా ఉన్న అమ్మాయి పుతిన్ కూతురు కాదు.