లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ఉద్దేశంతో జమిలి ఎన్నికలకు (One Nation, One Election) సంబంధించి రెండు బిల్లులను ‘129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024’ మరియు ‘కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024’ లను కేంద్ర న్యాయ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ 17 డిసెంబర్ 2024న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులను ప్రవేశపెట్టే తీర్మానంపై ఓటింగ్ జరిగిన తర్వాత ఈ రెండు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ ఓటింగ్ ప్రక్రియలో, 269 మంది ఎంపీలు బిల్లులను ప్రవేశపెట్టేందుకు అనుకూలంగా ఓటు వేయగా, 198 మంది ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేశారు (ఇక్కడ , ఇక్కడ). నిబంధనల ప్రకారం సాధారణ మెజారిటీతో ఈ బిల్లులను లోక్‌సభలో అధికారికంగా ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో, “లోక్‌సభలో ‘ఒక దేశం, ఒకే ఎన్నికల (జమిలి ఎన్నికల)’బిల్లు ఆమోదం, బిల్లుకు అనుకూలంగా 269 ఓట్లు, వ్యతిరేకంగా 198 ఓట్లు పోలయ్యాయి” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: 17 డిసెంబర్ 2024న లోక్‌సభ ‘ఒక దేశం, ఒకే ఎన్నికల (జమిలి ఎన్నికల)’ బిల్లుకు ఆమోదం తెలిపింది, బిల్లుకు అనుకూలంగా 269 ఓట్లు, వ్యతిరేకంగా 198 ఓట్లు పోలయ్యాయి.
ఫాక్ట్(నిజం): 17 డిసెంబర్ 2024న జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లులను లోక్‌సభ ఆమోదించలేదు. కేవలం జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ‘129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024’, ‘కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024’ రెండిటినీ న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లులను ప్రవేశపెట్టే తీర్మానంపై ఓటింగ్ జరపగా ఈ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు 269 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేయగా, 198 మంది ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ఈ బిల్లులను సాధారణ మెజారిటీతో లోక్‌సభలో అధికారికంగా ప్రవేశపెట్టారు. భారత రాజ్యాంగంలోని పలు నిబంధనలను/ఆర్టికల్స్‌ని సవరించడానికి ప్రత్యేక మెజారిటీ అవసరం, ప్రత్యేక మెజారిటీ అంటే సభలో ఉన్న సభ్యులలో కనీసం 2/3 వంతు మంది రాజ్యాంగ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా 17 డిసెంబర్ 2024న లోక్‌సభ ‘ఒక దేశం, ఒకే ఎన్నికల (జమిలి ఎన్నికల)’ బిల్లుకు ఆమోదం తెలిపలేదు, కేవలం జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ‘129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024’ మరియు ‘కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024’ అను రెండు బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లులను ప్రవేశపెట్టే తీర్మానంపై ఓటింగ్ జరపగా ఈ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు 269 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేయగా, 198 మంది ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేశారు.
ఇదే విషయం మనకు 17 డిసెంబర్ 2024న జరిగిన లోక్‌సభ సమావేశానికి సంబంధించిన పార్లమెంటరీ ప్రొసీడింగ్‌లను పరిశీలిస్తే తెలుస్తుంది (ఇక్కడ , ఇక్కడ). ఈ ప్రొసీడింగ్‌ల ప్రకారం, ‘రాజ్యాంగం 129వ సవరణ బిల్లు 2024’ మరియు ‘కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024’ అనే రెండు బిల్లులను ప్రవేశపెట్టే తీర్మానాన్ని లోక్‌సభ సాధారణ మెజారిటీతో ఆమోదించినట్లు స్పష్టమవుతుంది. ఈ బిల్లులను ప్రవేశపెట్టే తీర్మానానికి అనుకూలంగా 269 మంది ఎంపీలు ఓటు వేయగా, వ్యతిరేకంగా 198 మంది ఎంపీలు ఓటు వేశారు. దీన్ని బట్టి 17 డిసెంబర్ 2024న, లోక్‌సభ జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లుకు ఆమోదం తెలిపలేదు, కేవలం జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లులను ప్రవేశపెట్టే తీర్మానాన్ని మాత్రమే ఆమోదించింది అని స్పష్టమవుతుంది. లోక్‌సభలో ప్రవేశపెట్టిన ‘‘The Constitution 129th Amendment Bill 2024 (129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024)’ మరియు ‘ The Union Territories Laws Amendment Bill 2024 (కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024)’ ముసాయిదా బిల్లులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, భారత రాజ్యాంగంలోని పలు నిబంధనలను/ఆర్టికల్స్‌ని సవరించడానికి ప్రత్యేక మెజారిటీ అవసరం, ప్రత్యేక మెజారిటీ అంటే సభలో ఉన్న సభ్యులలో కనీసం 2/3 వంతు మంది రాజ్యాంగ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. అయితే, పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టే తీర్మానాలు సాధారణ మెజారిటీతో ఆమోదించవచ్చు. అనగా, సభలో ఉన్న సభ్యులలో సగం కంటే ఎక్కువ మంది పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టడానికి అనుకూలంగా ఓటు వేస్తే రాజ్యాంగ సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టవచ్చు (ఇక్కడ).
రాజ్యాంగ సవరణ బిల్లులు:
భారత రాజ్యాంగంలోని 20వ భాగంలో ఆర్టికల్ 368లో భారత రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని వివరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 368(2) నిబంధన కింద రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంటు ఉభయ సభల్లో ఎక్కడైనా ప్రవేశపెట్టవచ్చు. వాటిని ఆమోదించే క్రమంలో లోకసభ, రాజ్యసభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఆ బిల్లులు వీగిపోతాయి. రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంటు ఆమోదిస్తే, అనంతరం రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టాలుగా అమల్లోకి వస్తాయి. రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం లేదు. రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంటు ఉభయ సభలు విడివిడిగా ఆమోదించాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 భారత రాజ్యాంగాన్ని సవరించే రెండు విధానాలను వివరిస్తుంది ప్రత్యేక మెజార్టీ పద్ధతి: ఉభయ సభలు వేర్వేరుగా సమావేశమై, ఓటు వేసిన వారిలో 2/3వ వంతు ఆమోదిస్తే రాజ్యాంగ సమాఖ్య లక్షణాలను సవరించవచ్చు. అలాగే భారత రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలను సవరించాలంటే పార్లమెంటు ఉభయ సభలు వేర్వేరుగా 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతో తీర్మానం ఆమోదించడంతో పాటు దేశంలోని సగానికంటే ఎక్కువ రాష్ట్ర శాసనసభలు కూడా ఆమోదించాలి (ఇక్కడ , ఇక్కడ).
ఉదాహరణకు, మహిళా రిజర్వేషన్ బిల్లు 2023 (128వ రాజ్యాంగ సవరణ బిల్లు 2023) ప్రత్యేక మెజారిటీతో పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదించబడింది. లోక్‌సభలో 453 మంది ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా, 2 మంది ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేశారు. రాజ్యసభలో 214 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేయగా, ఎవరూ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయలేదు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023 ఆమోదానికి సంబంధించి లోక్‌సభ మరియు రాజ్యసభ కార్యకలాపాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
‘One Nation, One Election (జమిలి ఎన్నికలు)’ అంటే ఏంటి?
దేశంలో MP, MLA ఎన్నికల్లో ఒకే దఫాలో నిర్వహించడాన్ని జమిలి ఎన్నికలు అంటారు. జమిలి ఎన్నికలు MP, MLA ఎన్నికలు ఒకే సారి నిర్వహించడం కుదరకపోతే, ఒకే సంవత్సరంలోపే ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిస్తుంది. 1999లో జస్టిస్ జీవన్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ జమిలి ఎన్నికలు నిర్వహించాలని సూచించింది.
సెప్టెంబర్ 2023లో, భారత ప్రభుత్వం జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలోని ఇతర సభ్యులలగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, మాజీ ఫైనాన్స్ కమిషన్ చైర్‌పర్సన్ NK సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ C. కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే మరియు మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠార ఉన్నారు. అలాగే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ ప్రత్యేక ఆహ్వానితునిగా మరియు డాక్టర్ నితేన్ చంద్ర ఈ ఉన్నత స్థాయి కమిటీకి కార్యదర్శిగా ఉన్నారు. కోవింద్ నేతృత్వంలోని ఈ కమిటీ, సుమారు 190 రోజుల పాటు ఈ అంశంపై అధ్యయనం చేసి పలు రంగాల నిపుణులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. 47 రాజకీయ పార్టీలు దీనిపై తమ అభిప్రాయాలు తెలిపాయి. ఇందులో 32 జమిలికి మద్దతిచ్చాయి, ప్రజల నుంచి కూడా కమిటీ సలహాలు, సూచనలు కోరగా.. 21,558 అభిప్రాయాలు వచ్చాయి. వీరిలో 81శాతం మంది జమిలి ఎన్నికలను సమర్థించారు. ఇవన్నీ చేసిన అనంతరం కమిటీ నివేదిక రూపొందించింది. 14 మార్చి 2024న, ఈ కమిటీ తన 18,626 పేజీల నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది, ఇది లోక్‌సభ మరియు అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని సిఫార్సు చేసింది. ఈ నివేదికలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని కమిటీ ఏకగ్రీవంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించింది. జమిలి ఎన్నికలకు కమిటీ.. రెండంచెల విధానాన్ని సూచించింది. తొలుత లోకసభ, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించాలని పేర్కొన్నది. ఆ తర్వాత 100 రోజులకు మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికలు జరపాలని నివేదికలో తెలిపింది. ఇందుకోసం రాజ్యాంగంలో కనీసం ఐదు ఆర్టికల్స్‌ని సవరించాలని కమిటీ సూచించింది. ఈ ఉన్నత స్థాయి కమిటీ నివేదికను ఇక్కడ చూడవచ్చు . జమిలి ఎన్నికలకు గురించి మరింత సమాచారం ఇక్కడ చూడవచ్చు.
చివరగా, 17 డిసెంబర్ 2024న లోక్‌సభ ‘జమిలి ఎన్నికల’ బిల్లుకు ఆమోదం తెలిపలేదు, కేవలం జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన రెండు బిల్లులను ప్రవేశపెట్టే తీర్మానాన్ని మాత్రమే ఆమోదించింది.