రాజస్తాన్ లో తక్కువ కులానికి చెందిన వ్యక్తి తప్పు చేసాడని అగ్ర కులానికి చెందిన వ్యక్తులు అతన్ని చెట్టుకు కట్టేసి తమ మూత్రం తాగిస్తున్న వీడియో, అంటూ షేర్ చేస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: రాజస్తాన్ లో తక్కువ కులానికి చెందిన వ్యక్తిని అగ్ర కులానికి చెందిన వ్యక్తులు చెట్టుకి కట్టేసి మూత్రం తాగిపిస్తున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసింది, రాజస్తాన్ లోని కోన్ర గ్రామంలో జరిగిన ఒక కుటుంబ ఘర్షణకి సంబంధించిన వీడియో. అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న ఆరోపణ మీద ఆ వ్యక్తిని అలా శిక్షించారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వీడియోలో కనిపిస్తున్న అదే వ్యక్తి ఫోటోని షేర్ చేస్తూ ‘Hindustan Times’ వారు ‘31 July 2020’ నాడు పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్ దొరికింది. రాజస్తాన్ లోని కోన్ర గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న ఆరోపణ మీద ఇలా చెట్టుకి కట్టేసి శిక్షించినట్టు అందులో తెలిపారు. ఒకే కులానికి చెందిన వ్యక్తులు అవ్వడం వలన, ఆ బాధితుడు పోలీసులని ఆశ్రయించలేదు అని పోలీసులు మీడియాకి తెలిపారు.
ఈ వీడియోని ఒక ట్విట్టర్ యూసర్ ‘ రాజస్తాన్ లో దళితులని హింసిస్తున్న అగ్ర కులానికి చెందిన వ్యక్తులు’, అని క్లెయిమ్ చేస్తూ పోస్ట్ పెట్టగా, బార్మేర్ పోలీస్ వారు పోస్టులోని ఆ వీడియో ఒక కుటుంబ ఘర్షణకి సంబంధించినది అని స్పష్టం చేస్తూ ట్వీట్ పెట్టారు. అలాగే, ఈ ఘటనకి సంబంధించి ఆరుగురు అనుమానితులని అరెస్ట్ చేసామని ఆ ట్వీట్లో తెలిపారు.
ఈ ఘటనకి సంబంధించి చోహ్తాన్ పోలీస్ స్టేషన్ లో ఫైల్ చేసిన FIR కాపీ Factly కి లభించింది. FIR కాపీలో ఎక్కడ కూడా ఈ ఘటన కులాల అసమానత్వానికి సంబంధించినది అని తెలుపలేదు.
చివరగా, రాజస్తాన్ లో జరిగిన ఒక కుటుంబ ఘర్షణకి సంబంధించిన వీడియోని చూపిస్తూ తక్కువ కులానికి చెందిన వ్యక్తిని హింసిస్తున్న అగ్ర కులానికి చెందిన వ్యక్తులు అని షేర్ చేస్తున్నారు.
Did you watch our new video?