ఏషియన్ గేమ్స్ మహిళల 100 మీటర్స్ హర్డిల్స్ రేసులో భారత్‌కు బంగారు పతకం తెచ్చిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి యర్రాజి అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. హర్డిల్స్ రేసులో జ్యోతి యర్రాజి మొదటి స్థానం సాధించిన వీడియోతో పాటు ఈ వార్తను షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ వార్తకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: 2023 ఏషియన్ గేమ్స్ మహిళల 100 మీటర్స్ హర్డిల్స్ రేసులో భారత్‌కు బంగారు పతకం తెచ్చిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి యర్రాజి.
ఫాక్ట్(నిజం): ప్రస్తుతం జరుగుతున్న 2023 ఏషియన్ క్రీడల్లో జ్యోతి యర్రాజి పాల్గొనాల్సిన మహిళల 100 మీటర్స్ హర్డిల్స్ రేసు ఇంకా ప్రారంభం కాలేదు. ఆమె మొదటి రేస్ 30 సెప్టెంబర్ 2023న జరుగనుంది. కాగా ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో జులై 2023లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2023లో జ్యోతి యర్రాజి బంగారు పతకం సాధించినప్పటిది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
చైనాలోని హ్యాంగ్జౌ పట్టణంలో 23 సెప్టెంబర్ నుండి 08 అక్టోబర్ 2023 మధ్య కాలంలో ఆసియా క్రీడలు జరుగనున్నాయి. కాగా ఈ ఆసియా క్రీడల్లో ఇంకా మహిళల 100 మీటర్స్ హర్డిల్స్ రేసు ఇంకా మొదలు కాలేదు. ప్రస్తుతం వైరల్ అవుతున్నది ఈ సంవత్సరం జులైలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జ్యోతి యర్రాజి బంగారు పథకం సాధించిన వీడియో.
వైరల్ అవుతున్న వార్తకు సంబంధించి ఆసియా గేమ్స్ షెడ్యూల్ పరిశీలించగా యర్రాజీ ఈవెంట్ పాల్గొనే మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్ 30 సెప్టెంబర్ 2023న జరుగనుండగా, ఫైనల్ 01 అక్టోబర్ 2023న జరగనుందని తెలిసింది. కాబట్టి ఆమె ఆసియా క్రీడల్లో బంగారు పథకం సాధించిందని ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తలో నిజం లేదని స్పష్టమవుతుంది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఆమె జులై 2023లో జరిగిన జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించినప్పటిది. ఈ వీడియోలో క్రీడాకారుల వెనక ఉన్న బోర్డుపై ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2023 అని స్పష్టంగా రాసి ఉండడం గమనించొచ్చు. అలాగే ఇదే వీడియో SAI మరియు పలు స్పోర్ట్స్ ఫౌండేషన్స్ ఆమె ఆ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ గెలిచినప్పుడు షేర్ కూడా చేసాయి (ఇక్కడ).
ఈ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జ్యోతి యర్రాజి 13.09 సెకండ్లలో రేస్ పూర్తి చేసి బంగారు పతకం సాధించింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కూడా ఆమె రేస్ పూర్తి చేసిన టైం ఇదే కావడం గమనించొచ్చు. వీటన్నిటిబట్టి ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జ్యోతి యర్రాజి గోల్డ్ సాధించిన రేస్ వీడియోను ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రీడలదంటూ షేర్ చేస్తున్నట్టు స్పష్టమవుతుంది.
చివరగా, ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జ్యోతి యర్రాజి గోల్డ్ సాధించిన వీడియోను ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రీడల్లో గోల్డ్ సాధించినట్టు షేర్ చేస్తున్నారు.