పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇంట్లో పూజ చేస్తూ గంట మోగించాడని ఒక హిందూ పూజారిని ముస్లింలు బహిరంగంగా బట్టలూడదీసి కొట్టిన దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. 2017లో ఈ వీడియోని షేర్ చేస్తూ పెట్టిన ఒక పోస్టుని ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: పశ్చిమ బెంగాల్‌లో ఇంట్లో పూజ చేస్తూ గంట మోగించాడని ఒక హిందూ పూజారిని ముస్లింలు దారుణంగా కొట్టిన దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలోని ఘటన 2017 ఆగస్టు నెలలో చోటుచేసుకుంది. గృహ పూజ వేడుకలో ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించి, ఆమెను వేధించాడని ఆరోపిస్తూ భాదితురాలి కుటుంభికులు ఆ పూజారిని రోడ్డుపై ఇలా కొట్టారు. ఈ ఘటనలో మతపరమైన కోణమేమి లేదని కోల్‌కతా పోలీస్ వారు కూడా స్పష్టం చేశారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, వీడియోలోని అదే వ్యక్తిని ఒక గుంపు కొట్టుకుంటూ తీసుకెళ్తున్న వీడియోని ఒక లోకల్ న్యూస్ ఛానెల్ 3 సెప్టెంబర్ 2017 నాడు పోస్ట్ చేసినట్టు తెలిసింది. మహిళను వేధించాడని ఆరోపిస్తూ బాధితురాలి బంధువులు రాజేంద్ర పండిట్ అనే పూజారిని ఇలా రోడ్డుపై బట్టలూడదీసి కొట్టుకుంటూ తీసుకెళ్లారని ఈ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలని మరికొన్ని వార్తా సంస్థలు కూడా 2017 సెప్టెంబర్ నెలలో షేర్ చేశాయి.
ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, ఈ ఘటనకు సంబంధించి కోల్‌కతా పోలీస్ వారు 23 సెప్టెంబర్ 2021 నాడు ఒక ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టినట్టు తెలిసింది. గృహ పూజ వేడుకలో ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించి, ఆమెను వేధించాడని ఆరోపిస్తూ భాదితురాలి బంధువులు వీడియోలోని పూజారిని కొట్టారని కోల్‌కతా పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఫైల్ చేసిన కేసుకి సంబంధించిన వివరాలను తెలుపుతూ, ఈ ఘటనలో మతపరమైన కోణమేమి లేదని, సోషల్ మీడియాలో ఈ వీడియోకి సంబంధించి తప్పుగా ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోల్‌కతా పోలీస్ వారు హెచ్చరించారు.
చివరగా, పశ్చిమ బెంగాల్‌లో మహిళను వేధించాడని ఒక పూజారిని బట్టలూడదీసి బహిరంగంగా కొట్టిన పాత వీడియోని ఇప్పుడు మతపరమైన కోణంతో షేర్ చేస్తున్నారు.