వేల సంవత్సరాల క్రితమే భూమి గుండ్రంగా ఉంటుందని రుజువు చేస్తూ భారతీయులు శిల్పాలు చెక్కారని చెప్తూ, గుండ్రని ఆకారంలో ఉన్న భూమిని మోస్తున్న వరాహ స్వామి శిల్పం యొక్క ఫోటో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: వేల సంవత్సరాల క్రితమే భూమి గుండ్రంగా ఉంటుందని రుజువు చేస్తూ భారతీయులు చెక్కిన భూమిని మోసే వరాహ స్వామి శిల్పం.
ఫాక్ట్: పోస్ట్‌లో షేర్ చేసిన ఫోటో వేల సంవత్సరాల నాటి వరాహ స్వామి శిల్పం కాదు. ఈ శిల్పం ఒడిశాలోని బాలాసోర్‌లో ఉన్న ఇమామి జగన్నాథ మందిరం గోడలపై చెక్కబడింది. ఈ ఆలయ నిర్మాణం 2009లో ప్రారంభించగా 2015లో పూర్తయ్యింది. ప్రఖ్యాత వాస్తుశిల్పి మరియు పద్మవిభూషణ్ రఘునాథ్ మోహపాత్ర ఈ ఆలయానికి ప్రధాన వాస్తుశిల్పి. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ఫొటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే ఫొటోని ప్రస్తావిస్తూ, ఈ ఫొటోలోని శిల్పం ఒదిశాలోని బాలాసోర్‌లో ఉన్న ఇమామి జగన్నాధ్ మందిరంలో ఉందని కొందరు సోషల్ మీడియా ఖాతాదారులు చెప్పడం గుర్తించాం.
ఈ సమాచారం ఆధారంగా ఈ మందిరానికి సంబంధించిన మరిన్ని వివరాలను వెతకగా, గూగుల్ మ్యాప్స్ లో మందిరం బయట గోడలపై ఉన్న ఈ శిల్పం యొక్క మరిన్ని ఫొటోలు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) లభించాయి. అలాగే, ఈ మందిరానికి వచ్చే యాత్రికులు చిత్రీకరించిన వీడియోలో కూడా ఈ వరాహ స్వామి శిల్పం ఉండటం చూడవచ్చు.
అయితే ఈ మందిరం యొక్క వెబ్‌సైట్లో ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ ఆలయాన్ని బాలాసోర్‌లోని ఇమామి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నిర్మించింది. ఈ ఆలయ నిర్మాణం 2009లో ప్రారంభించగా 2015లో పూర్తయింది. ప్రఖ్యాత వాస్తుశిల్పి మరియు పద్మవిభూషణ్ రఘునాథ్ మోహపాత్ర ఈ ఆలయ నిర్మాణానికి ప్రధాన వాస్తుశిల్పిగా వ్యవహరించారు.
చివరిగా, 2015లో ప్రారంభించబడిన ఒడిశాలోని జగన్నాథ ఆలయంలో వరాహ శిల్పాన్ని చూపించే ఫోటో వేల సంవత్సరాల నాటి శిల్పం యొక్క చిత్రంగా షేర్ చేయబడింది.