Fake News, Telugu
 

ఈ వైరల్ వీడియోకు ఆంధ్రప్రదేశ్‌కు ఎటువంటి సంబంధం లేదు, ఈ వీడియో 2017లో చెన్నైలో ఓ యువకుడు పోలీస్ మీద దాడి చేస్తున్న దృశ్యాలను చూపిస్తున్నది

0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఒక వైసీపీ కార్యకర్త పోలీస్ అధికారి మీద చెయ్యి చేసుకున్నాడు అని చెప్తూ వీడియో (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే వీడియోను షేర్ చేస్తూ మద్యం మత్తులో జనసేన కార్యకర్త పోలీస్ అధికారి మీద చెయ్యి చేసుకున్నాడు అని రాసుకొచ్చారు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజాలేమిటో తెలుసుకుందాం.

ఇలాంటి మరిన్ని పోస్టుల యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ వైసీపీ కార్యకర్త పోలీస్ అధికారిపై దాడి చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదు. డిసెంబర్ 2017లో చెన్నైలోని జాఫర్‌ఖాన్‌ పేట్‌లో వద్ద ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు మణికందన్ అనే కాలేజీ విద్యార్థితో పాటు మరో ఇద్దరు బైక్ పై వెళ్తుండగా పోలీసు కానిస్టేబుల్ మగేశ్వరన్ ఆపాడు. దీంతో ఆగ్రహించిన మణికందన్ పోలీసు కానిస్టేబుల్‌ మగేశ్వరన్ ను దుర్భాషలాడుతూ అతనిపై చేయి కూడా చేసుకున్నాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకి సంబంధించిన సమాచారం కోసం ఈ వీడియో యొక్క కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే, 2017లో ప్రచురించిన పలు వార్తా కథనాలు మాకు లభించాయి. ‘Mirror Now’ 25 డిసెంబర్ 2017న తమ యూట్యూబ్ ఛానెల్‌లో ‘Chennai: Students Slap Cop When He Caught Three Of Them Riding On A Motorbike‘ అనే శీర్షికతో ఇవే దృశ్యాలు కలిగిన వీడియోను పబ్లిష్ చేసింది. ఇదే వీడియోను ‘Oneindia news’ తమ యూట్యూబ్ ఛానెల్‌లో 25 డిసెంబర్ 2017న పబ్లిష్ చేసింది. అలాగే  ఈ ఘటనను రిపోర్ట్ చేస్తూ ది హిందూ, టైమ్స్ అఫ్ ఇండియా పబ్లిష్ చేసిన కథనాలు ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

ఈ వార్త కథనాల ప్రకారం, వీడియోలో పోలీసు కానిస్టేబుల్‌ పై దాడి చేస్తున్న వ్యక్తి 21 సంవత్సరాల మణికందన్ అనే కాలేజీ విద్యార్థి. బైకు పై మణికందన్‌తో పాటు మరో ఇద్దరు వెళ్తుండగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు పోలీసు కానిస్టేబుల్ మగేశ్వరన్ వారిని ఆపాడు. దీంతో ఆగ్రహించిన మణికందన్ పోలీసు కానిస్టేబుల్‌ మగేశ్వరన్ ను దుర్భాషలాడుతూ అతనిపై చేయి కూడా చేసుకున్నాడు. ఇదంతా ఆ సమయంలో అక్కడున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఈ ఘటన 24 డిసెంబర్ 2017న చెన్నైలోని జాఫర్‌ఖాన్‌ పేట్‌లో చోటుచేసుకుంది. దీన్ని బట్టి వైరల్ వీడియో 2017లో చెన్నైలో ఓ యువకుడు పోలీస్  కానిస్టేబుల్‌ పై చేయి చేసుకుంటున్న దృశ్యాలను చూపిస్తున్నది అని నిర్థారించవచ్చు.

చివరగా, ఈ వైరల్ వీడియోకు ఆంధ్రప్రదేశ్‌కు ఎటువంటి సంబంధం లేదు, ఈ వీడియో 2017లో చెన్నైలో ఓ యువకుడు పోలీస్ మీద దాడి చేస్తున్న దృశ్యాలను చూపిస్తున్నది.

Share.

About Author

Comments are closed.

scroll