Fake News, Telugu
 

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హిందూ దేవాలయాలని సందర్శిస్తున్న ప్రియాంక గాంధీ అని షేర్ చేస్తున్న వీడియో పాతది

0

2022లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఇటీవల హిందూ దేవాలయాలని సందర్శించడం మొదలుపెట్టారని సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రియాంక గాంధీ ఇటీవల ఒక హిందూ దేవాలయాన్ని సందర్శించిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో, ప్రియాంక గాంధీ సహరాన్‌పుర్‌లోని శాకాంబరి అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకుంటున్న దృశ్యాలని చూపిస్తుంది. 2021 ఫిబ్రవరి నెలలో కిసాన్ పంచాయత్ కార్యక్రమం కోసం సహరాన్పూర్ వచ్చిన ప్రియాంక గాంధీ, ఆ కార్యక్రమానికి వెళ్లేముందు మహా శాకాంబరి అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే, ప్రియాంక గాంధీ ఇటీవల రాయ్ బరేలి లోని హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకొని, ఉత్తరప్రదేశ్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని భగవంతుడిని వేడుకునట్టు మీడియాకి తెలిపారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.    

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఈ వీడియోని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ 10 ఫిబ్రవరి 2021 నాడు తన ఫేస్ బుక్ పేజీలో షేర్ చేసినట్టు తెలిసింది.  సహరాన్పూర్ లోని శాకాంబరి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నట్టు ప్రియాంక గాంధీ ఈ వీడియో వివరణలో తెలిపారు.  

ప్రియాంక గాంధీ శాకాంబరి దేవాలయాన్ని సందర్శించిన విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ ఆర్టికల్స్‌లో తెలిపిన సమాచారం ప్రకారం, 10 ఫిబ్రవరి 2021 నాడు ప్రియాంక గాంధీ  సహరాన్పూర్ జిల్లా చిల్కాన గ్రామంలో నిర్వహించిన కిసాన్ మహా పంచాయత్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వెళ్లేముందు ప్రియాంక గాంధీ సహరాన్‌పుర్‌లోని శాకాంబరి అమ్మవారిని దర్శించుకున్నట్టు ఈ ఆర్టికల్స్ రిపోర్ట్ చేసాయి. సహరాన్పూర్ జిల్లాలో 10 ఫిబ్రవరి 2021 నాడు జరిగిన కిసాన్ మహాపంచాయత్ కార్యక్రమానికి సంబంధించి పబ్లిష్ అయిన న్యూస్ రిపొర్ట్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

అయితే, ప్రియాంక గాంధీ ఈ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పలు దేవాలయాలని సందర్శించారు. ప్రియాంక గాంధీ ఇటీవల రాయ్ బరేలిలోని హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకొని, ఉత్తరప్రదేశ్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని భగవంతుడిని వేడుకున్నట్టు మీడియాకి తెలిపారు. కాని, పోస్టులో షేర్ చేసిన వీడియో పాతదని పై వివరాల ఆధారంగా ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, పాత వీడియోని షేర్ చేస్తూ ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హిందూ దేవాలయాలని సందర్శిస్తున్న దృశ్యాలంటున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll