వేరే ఏ ఆధారం లేకుండా ఒక చెట్టు గాలిలో వేలాడుతున్నట్టు కనిపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉంది. ఈ వీడియోలో కనిపిస్తున్నది నిజమే అన్నట్టు ‘ఇలాంటి అద్భుతాలు కేవలం సనాతన ధర్మంలోనే జరుగుతాయి హర హర మహాదేవ’ అనే కాప్షన్‌తో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: వేరే ఏ ఆధారం లేకుండా ఒక చెట్టు గాలిలో వేలాడుతున్నట్టు కనిపిస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో చెట్టును పూర్తిగా చూపించలేదు. ఈ చెట్టు వేలాడుతున్నప్పటికీ అది పక్కనే ఉన్న ఇంకో చెట్టు కొమ్మలపై వాలింది. పక్కనున్న వేరే చెట్టుపై పడి దాని నుండి కావాల్సిన పోషకాలు, నీరు తీసుకొని ఒక కొత్త చెట్టులా పెరుగుతోంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఈ వీడియోకు సంబంధించి మరింత సమాచారం కోసం వెతకగా ఈ చెట్టు హర్యానా రాష్ట్రంలో హిసార్ జిల్లాలోని హన్సి నగరంలో ఉన్నట్టు చెప్తూ ఉన్న చాలా ట్రావెల్ వ్లాగ్స్ మాకు కనిపించాయి. హన్సిలోని బాబా జగన్నాథపురి సమాధ ఆలయంలో ఈ చెట్టు ఉంది. దీనిని ‘అక్షయ వట వృక్షం’ అని అంటారు. ఐతే ఈ వీడియోలో ఈ చెట్టుని వివిధ కోణాల్లో చూపించారు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ).
ఈ వీడియోల్లో చూపించిన దాని ప్రకారం ఈ చెట్టు వేలాడుతున్నప్పటికీ అది పక్కనే ఉన్న ఇంకో చెట్టు కొమ్మలపై వాలినట్టు కనిపిస్తుంది. దీన్నిబట్టి వైరల్ వీడియోలో కనిపిస్తున్నది పూర్తి చెట్టు కాదని, కేవలం వేళ్ళాడడం ఒక్కటే చూపించారని స్పష్టమవుతుంది.
ఈ సమాచారం ఆధారంగా వెతకగా దీనికి సంబంధించి ఒక న్యూస్ వీడియో రిపోర్ట్ మాకు కనిపించింది. ఈ రిపోర్ట్ లో సంబంధిత శాస్త్రవేత్తలతో మాట్లాడగా ఈ చెట్టు విరిగిన సమయంలో అది పక్కనున్న వేరే చెట్టుపై పడి దాని నుండి కావాల్సిన పోషకాలు, నీరు తీసుకొని ఒక కొత్త చెట్టులా పెరుగుతుంది. సాధారణంగా ఒక మొక్క/కొమ్మ మరో మొక్క ఉపరితలం నుండి కావాల్సిన పోషకాలు తీసుకొని పెరిగిన దాన్ని ‘ఎపిఫైట్’ అంటారు. ఇది సహజ పరిణామమే, పైన తెలిపిన ఉదాహారణ ఇలాంటిదే. ఎపిఫైట్ల గురుంచి మరింత సమాచారం ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
చివరగా, ఈ వీడియోలో వేలాడుతున్నట్టు కనిపిస్తున్న ఈ చెట్టు, నిజానికి పక్కనే ఉన్న మరోక చెట్టుపై వాలి, దాని ఆధారంగా పెరుగుతుంది.