Fake News, Telugu
 

హైదరాబాద్ బోరబండలో రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవ దృశ్యాలను మతపరమైన దాడిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు

0

హైదరాబాద్‍లోని బోరబండ హరినగర్  పరిధిలో 15 జనవరి 2024న ముస్లిం మతానికి చెందిన కొందరు వ్యక్తులు వచ్చి సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్న హిందువులపై విచక్షణారహితంగా దాడి చేశారు అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. దీనికి మద్దతుగా దాడికి సంబంధిచిన వీడియో ఒకటి జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఇందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్:  హైదరాబాద్ బోరబండ పరిధిలోని హరినగర్‌లో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్న హిందువులపై ముస్లిములు దాడి చేసిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోలీసుల నమోదు చేసిన FIR పరిశీలించగా ఫిర్యాదుదారుడు ఎక్కడా తనపై మతపరమైన కోణంలో దాడి జరిగిందని ఫిర్యాదు చేయలేదు. అంతే కాదు, FIRలో నిందితులగా పేర్కొన్న వారిలో ముస్లింలతో (అబ్బాస్, ఇమ్రాన్) పాటు హిందువులు (రాహుల్, జై, నిఖిల్, ఇతరులు) కూడా ఉన్నారు. దీన్ని బట్టి ఇది కేవలం రెండు గ్రూపులకు చెందిన యువకుల మధ్య జరిగిన గొడవ అని అర్థమవుతుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది

తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ETV భారత్ రిపోర్ట్ చేసిన ఒక వార్తా కథనం లభించింది. ఈ కథనం ప్రకారం “హైదరాబాద్​లోని సనత్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని బోరబండ బస్టాండ్​ దగ్గరలో హరినగర్​, రామానగర్​లో అర్ధరాత్రి యువకుల మధ్య గొడవ జరిగింది. వారందరూ మద్యం మత్తులో ఉన్నారని గమనించిన స్థానికులు వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. వారు వినిపించుకోకుండా కర్రలు, రాళ్లతో చెలరేగిపోయారు. దీంతో కొంతమంది యువకులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే బస్తీవాసులు చూసి 100 నంబర్​కు ఫోన్​ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కొంత మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువత గొడవ పడుతున్న వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి”.

తదనంతరం, యూట్యూబ్‌లో దాడికి సంబంధిచిన వీడియోల కోసం సంబంధిత కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, వైరల్ వీడియోతో కూడిన వార్తాకథనం TV11 NEWS 15 జనవరి 2024న పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ కథనం ప్రకారం “కొందరు యువకులు గాలిపటాలు ఎగురవేస్తు భవనం పైనుండి ఉమ్మివేయగా కింద బండిపై వెళ్తున్న యువకుల మీద పడింది, ఇదే విషయంపై యువకుల మధ్య వాగ్వాదం జరిగింది, తర్వాత ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు”.

ఇదే విషయంపై సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని సంప్రదించగా, హరినగర్‌లో 14 జనవరి 2024న రాత్రి సమయంలో రెండు గ్రూపులకి చెందిన యువకుల మధ్య గొడవ జరిగిన మాట వాస్తవమే కానీ ఇది మతపరమైన కోణంలో జరిగిన దాడి కాదని స్పష్టం చేశారు.అలాగే ఈ దాడిలో పలువురికి గాయాలు అయినట్టు, ఈ ఘటనకు సంబంధించి FIR నమోదు చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు, ఇంకా ఈ సంఘటన గురించి దర్యాప్తు కొనసాగుతుంది అని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర పోలీస్ వెబ్‌సైట్‌లో వెతకగా ఈ ఘటనకు సంబంధించిన FIR లభించింది. FIR ప్రకారం, ఫిర్యాదుదారు (జయంత్ ధర్మ తేజ) తన స్నేహితుడు రాబిన్‌తో కలిసి గాలిపటాలు కొనడానికి ‘ఈగిల్ కైట్ షాప్’ బబ్బుగూడకు వెళ్లాడు, అక్కడ అతను తన బైక్‌ను పార్క్ చేసి గాలిపటాలు కొనడానికి వెళ్ళాడు, తిరిగి వచ్చేసరికి బైక్ దగ్గర నిలబడి ఉన్న రాబిన్‌తో తమ బైక్ ప్రక్కన ఉమ్మివేసాడు అంటూ రాహుల్, అబ్బాస్ గొడవ పడటం గమనించాడు. గొడవను శాంతింపజేయడానికి ప్రయత్నించినా రాహుల్ & అబ్బాస్ అలాగే గొడవ పడుతున్న నేపథ్యంలో రాబిన్&తేజ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత సాయంత్రం 05.15 నిమషాలకు భవనంపై ఫిర్యాదుదారు (తేజ) గాలిపటాలు ఎగురవేస్తుండగా, అతని స్నేహితులు రాబిన్, ప్రశాంత్, విశాల్ బయటికి వెళ్తున్నారు. ఇంతలో జై, రాహుల్ మరియు ఇతరులు మూడు బైక్‌ల ద్వారా వచ్చి వారిని అసభ్య పదజాలంతో దూషించారు మరియు దాడి చేశారు. ఇది గమనించిన ఫిర్యాదుదారుడు, ఇతరులు కిందకు రావడంతో సదరు వ్యక్తులు అక్కడి నుంచి పరుగులు తీశారు. కొంత సమయం తరువాత సదరు వ్యక్తులు మళ్ళీ తిరిగి వచ్చి కొత్తగా నిర్మిస్తున్న భవనంలోని ఇటుకలు, రాళ్లు, కర్రలు తీసుకుని వారిపై దాడికి పాల్పడ్డారు, ఫిర్యాదుదారుడు మరియు రాబిన్, పృథ్వీ , ఇతరులకు గాయాలయ్యాయి. రాహుల్, అబ్బాస్, జై, ఇమ్రాన్, నిఖిల్ తదితరులు ఉద్దేశపూర్వకంగానే తమ పై దాడి చేశారు అని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. FIR పరిశీలించగా ఫిర్యాదుదారుడు ఎక్కడా తనపై మతపరమైన దాడి జరిగిందని ఫిర్యాదు చేయలేదు, FIRలో నిందితులగా పేర్కొన్న వారిలో ముస్లింలతో (అబ్బాస్, ఇమ్రాన్) పాటు హిందువులు (రాహుల్, జై, నిఖిల్, తదితరులు) కూడా ఉన్నారు. దీన్ని బట్టి ఇది కేవలం రెండు గ్రూపులకు చెందిన యువకుల మధ్య జరిగిన గొడవ అని అర్థమవుతుంది”.

చివరగా, హైదరాబాద్ బోరబండ హరినగర్‌లో రెండు గ్రూపుల యువకుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన దాడి దృశ్యాలను మతపరమైన దాడిగా దాడిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll