Fake News, Telugu
 

వీడియోలోని రైలు ఫ్రాన్స్‌కు చెందిన ప్రయోగాత్మక V150(TGV) రైలు; జర్మన్ బుల్లెట్ ట్రైన్ కాదు

0

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన జర్మనీ బుల్లెట్ ట్రైన్ విమానాన్నే తలదన్నేలా గంటకు 574.8 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని చెప్తూ ఒకే వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: 574.8 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న జర్మన్ బుల్లెట్ ట్రైన్ యొక్క దృశ్యాలు.

ఫాక్ట్: 2007లో ఫ్రాన్స్‌కు చెందిన V150 అనే పేరు గల రైలు గంటకు 574.8 కిలో మీటర్ల రికార్డు వేగాన్ని అందుకున్న సమయంలో ఈ వీడియోని చిత్రీకరించారు. ఈ రైలు పరిశోధనలకు మాత్రమే ప్రత్యేకంగా నిర్మించబడినది. జపాన్‌కు చెందిన L0 (A07) రైలు 2015లో ప్రయోగాత్మక ట్రాక్‌పై గంటకు 603 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించి అత్యంత వేగంగా ప్రయాణించిన రైలుగా గిన్నీస్ వరల్డ్ రికార్డు నమోదు చేసింది. అయితే, ప్రస్తుతం వివిధ దేశాలలో నడిచే హై స్పీడ్ రైళ్లు అత్యధికంగా గంటకు 300- 380 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, దీనికి సంబంధించిన పూర్తి వీడియోని 2013లో యూట్యూబ్‌లో అప్‌లోడు చేసినట్లు గుర్తించాం. అయితే ఈ వీడియోలో ఉన్న సమాచారం ప్రకారం, 2007లో ఫ్రాన్స్‌కు చెందిన TGV రైలు గంటకు 574.8 కిలో మీటర్ల రికార్డు వేగాన్ని అందుకున్న సమయంలో ఈ వీడియోని చిత్రీకరించారు.

దీనిపై మరింత పరిశోధన చేయగా, ఈ విషయంపై 2007లో రాయిటర్స్, న్యూయార్క్ టైమ్స్, DW వార్తాసంస్ధలు ప్రచురించిన కథనాల లభించాయి. ఈ కథనాల ప్రకారం 03 ఏప్రిల్ 2007న ఫ్రాన్స్ దేశంలో V 150 అనే పేరు గల ఒక ఫ్రెంచ్ హై స్పీడ్ రైలు(TGV) గంటకు 574.8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి చక్రాలపై నడిచే రైళ్లలో అత్యధిక వేగంతో ప్రయాణించిన రైలుగా రికార్డు సృష్టించింది.

ఈ రైలుని ఫ్రాన్స్‌కు చెందిన అల్స్టోమ్ సంస్థ నిర్మించింది. అయితే ఈ రైలు పరిశోధనలకు మాత్రమే ప్రత్యేకంగా నిర్మించబడినది. ప్రయాణికుల భద్రత, రైలు పనితీరు వంటి అంశాలను మెరుగుపరచటానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

అయితే మాగ్ లెవ్ (Magnetic Levitation) టెక్నాలజీని ఉపయోగించి జపాన్‌కు చెందిన L0 (A07) రైలు 2015లో ప్రయోగాత్మక ట్రాక్‌పై గంటకు 603 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించి అత్యంత వేగంగా ప్రయాణించిన రైలుగా గిన్నీస్ వరల్డ్ రికార్డు నమోదు చేసింది. ఈ టెక్నాలజీ ద్వారా చక్రాల లేకుండానే విద్యుదయస్కాంతాల సహాయం రైలు ప్రయాణిస్తుంది.

అయితే ప్రస్తుతం, సాధారణంగా ప్రయాణికులు ప్రయాణించే హై స్పీడ్ రైళ్లు ఇంత వేగంతో ప్రయాణించవు. జపాన్, చైనా, జర్మనీ మొదలగు దేశాలలో నడిచే హై స్పీడ్ రైళ్లు అత్యధికంగా గంటకు 300- 380 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. మరియు, నాసా వెబ్‌సైట్లో ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఉన్న విమానాలు గంటకు సుమారు 560 నుంచి 1200 కిలోమీటర్ల (350 – 750 మైళ్ళు) వేగంతో ప్రయాణించగలవు.

చివరిగా, వీడియోలని దృశ్యాలు ఫ్రాన్స్‌ హై స్పీడ్ రైలును చూపిస్తాయి, జర్మని బుల్లెట్ ట్రైన్‌ని కాదు.

Share.

About Author

Comments are closed.

scroll