Fake News, Telugu
 

PUC పరీక్షలో స్టేట్ ఫస్ట్‌ ర్యాంక్ సాధించిన అమ్మాయి, హిజాబ్ వివాదంలో నిలబడిన అమ్మాయి ఇద్దరూ వేరు

0

హిజాబ్ అల్లర్లలో ధైర్యంగా తన గొంతెత్తి నిలబడిన తబస్సుమ్ షేక్, పీయూసీ 2వ సంవత్సర పరీక్షల్లో 593/600 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్‌గా నిలిచింది అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ పోస్టులో తన ఫోటోను కూడా షేర్ చేసారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: హిజాబ్ అల్లర్లలో ధైర్యంగా తన గొంతెత్తి నిలబడిన తబస్సుమ్ షేక్, పీయూసీ 2వ సంవత్సర పరీక్షల్లో 593/600 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్‌గా నిలిచింది.

ఫాక్ట్(నిజం): హిజాబ్ అల్లర్లలో నిలబడింది, PUC పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించింది ఒక్కరు కాదు.  ‘అల్లా-హు-అక్బర్’ అంటూ నిలబడిన అమ్మాయి ముస్కాన్ ఖాన్ కాగా, ఇప్పుడు 2nd PUCలో మొదటి ర్యాంకు సాధించింది తబస్సుమ్ షేక్.  వీరిద్దరికీ సంబంధంలేదు. ముస్కాన్ ఖాన్ మాండ్యాలోని ప్రీ-యూనివర్శిటీ కాలేజీలో బీకాం రెండో సంవత్సరం చదువుతుంది. కాగా మొదటి ర్యాంకు సాధించిన తబస్సుమ్ షేక్ బెంగుళూరులో చదువుకుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టిస్తుంది.

గత నెలలో కర్ణాటకలో 2nd ప్రీ-యూనివర్శిటీ కోర్సు (పీయూసీ, ఇంటర్‌తో సమానమైనది) పరీక్ష ఫలితాలు విడుదలైయ్యాయి. ఈ ఫలితాలలో 18 ఏళ్ల తబస్సుమ్ షేక్ ఆర్ట్స్ స్ట్రీమ్‌లో టాపర్‌గా నిలిచింది. బెంగలూరులోని N.M.K.R.V PU కాలేజీలో చదివిన తబస్సుమ్ షేక్ ఈ పరీక్షలో 600కి మార్కులకు గాను 593 సాధించింది.

అంతకు ముందు హిజాబ్ వివాదం చెలరేగడం, కోర్టు హిజాబ్ బ్యాన్‌ను సమర్ధించడంతో తాను రెండు వారాలు కాలేజీకి వెళ్లలేదని, ఆ తరవాత హిజాబ్ లేకుండానే కాలేజీకి వెళ్లినట్టు తబస్సుమ్ షేక్ మీడియాతో చెప్పింది.

ఐతే తబస్సుమ్ షేక్ ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో హిజాబ్ వివాదం సమయంలో  ‘అల్లా-హు-అక్బర్’ అంటూ ధైర్యంగా తన గొంతెత్తి నిలబడిన అమ్మాయి తనే అని సోషల్ మీడియాలో వార్తలు షేర్ అయ్యాయి.  తబస్సుమ్ షేక్ మొదటి ర్యాంకు సాధించిన వార్తను రిపోర్ట్ చేసిన చాలావరకు వార్తా కథనాలలో ‘అల్లా-హు-అక్బర్’ అంటూ నినాదాలు చేసిన అమ్మాయి ఫోటోను పబ్లిష్ చేయడంతో ఈ కన్ఫ్యూషన్ మొదలైంది (ఇక్కడ మరియు ఇక్కడ).

హిజాబ్ అల్లర్లలో ధైర్యంగా గొంతెత్తి నిలబడింది తబస్సుమ్ షేక్ కాదు:

కానీ నిజానికి ఆ వివాదంలో ‘అల్లా-హు-అక్బర్’ అంటూ నినాదాలు చేసింది తబస్సుమ్ షేక్ కాదు. పైగా ఆ ఘటన జరిగింది మాండ్యాలోని ప్రీ-యూనివర్శిటీ కాలేజీలో, తబస్సుమ్ షేక్ చదువుకున్నది బెంగుళూరులో.

మాండ్యాలోని ప్రీ-యూనివర్శిటీ కాలేజీలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్న ముస్కాన్ ఖాన్ హిజాబ్ ధరించి కాలేజీకి రావడాన్ని వ్యతిరేకించిన కొందరు కాషాయ కండువాలు ధరించిన యువకులు ‘జై శ్రీరాం’ నినాదాలు చేస్తూ ఆమె వైపు రావడంతో,  అప్పుడు ఆమె ‘అల్లా-హు-అక్బర్’ అంటూ వారికీ బదులు చెప్పింది.

అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యి, ముస్కాన్ ఖాన్ హిజాబ్ వివాదానికి సంబంధించి పోస్టర్ గర్ల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఈ పోస్టులో షేర్ చేసింది ఆ ఘటన సమయంలో తీసిన ముస్కాన్ ఖాన్ ఫొటోనే. ఐతే హిజాబ్ వివాదం నేపథ్యంలో ముస్కాన్ ఖాన్ పరీక్షలు రాయలేదని మీడియా రిపోర్ట్ చేసింది.

హిజాబ్ వివాదంలో నిలబడిన అమ్మయికి, ఇప్పుడు మొదటి ర్యాంకు సాధించిన అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు. ‘అల్లా-హు-అక్బర్’ అంటూ నిలబడిన అమ్మాయి ముస్కాన్ ఖాన్ కాగా, ఇప్పుడు 2nd PUCలో మొదటి ర్యాంకు సాధించింది తబస్సుమ్ షేక్.  ముస్కాన్ ఖాన్ మాండ్యాలోని ప్రీ-యూనివర్శిటీ కాలేజీలో బీకాం రెండో సంవత్సరం చదువుతుంది. కాగా మొదటి ర్యాంకు సాధించిన తబస్సుమ్ షేక్ బెంగుళూరులో చదువుకుంది.

చివరగా, పీయూసీ పరీక్షలో స్టేట్ ఫస్ట్‌గా సాధించిన అమ్మాయి, హిజాబ్ వివాదంలో నిలబడిన అమ్మాయి ఇద్దరూ వేరు.

Share.

About Author

Comments are closed.

scroll