Fake News, Telugu
 

రష్యన్ కంపెనీ 120 వందే భారత్ రైళ్లను లాతూర్‌లోని మరాఠ్వాడ రైల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేయనుంది

0

మేకిన్ ఇండియాకు తూట్లు పొడుస్తూ వందే భారత్ రైళ్లను రష్యాలో తయారు చేయబోతున్నారని చెప్తున్న పోస్ట్ (ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం 120 వందే భారత్ రైళ్ల కాంట్రాక్టును ఏకపక్షంగా రష్యా కంపెనీకి అప్పగించిందని కూడా పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 120 వందే భారత్ రైళ్ల తయారీ రష్యాలో చేయబోతున్నారు.

ఫాక్ట్(నిజం): రష్యాకు చెందిన JSC Metrowagonmash-Mytischi (TransMashHolding అనుబంధ సంస్థ) అనే కంపెనీ 120 వందే భారత్ రైళ్ళ తయారీ కాంట్రాక్టును గెలుచుకుంది. ఈ కంపెనీ ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL)తో కలిసి సంయుక్తంగా ఈ రైళ్ళ నిర్మాణం మహారాష్ట్రలోని లాతూర్‌లో  చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ రైళ్ళ తయారీ చెన్నై మరియు లాతూర్‌లో జరుగుతుందని స్పష్టం చేసింది. పైగా కేంద్ర ప్రభుఇత్వం ఈ కాంట్రాక్టును ఏకపక్షంగా రష్యా కంపెనీకి అందించలేదు. బిడ్డింగ్‌లో ఐదు కంపెనీలు పాల్గొనగా, రష్యా కంపెనీ ఈ కాంట్రాక్టు గెలుచుకుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇటీవల 120 వందే భారత్ రైళ్ల తయారీ కాంట్రాక్టును రష్యాకు చెందిన JSC Metrowagonmash-Mytischi అనే కంపెనీ సొంతం చేసుకున్నట్టు వార్తా కథనాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఈ సంఖ్యను 200 చేసే వెసలుబాటును కల్పిస్తూ ఈ ఆర్డర్ రష్యా కంపెనీకి అందించినట్టు కథనాలు పేర్కొన్నాయి.

ఈ వందే భారత్ రైళ్ళ నిర్మాణం భారత్‌లోనే జరుగనుంది:

ఐతే పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్టు ఈ రైళ్ల తయారీ రష్యాలో కాకుండా భారత్‌లోనే జరుగుతుంది. అంతకు ముందు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు అందించిన సమాచారం ప్రకారం ఈ రైళ్ళ తయారీ చెన్నైలోని ఇంటీగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) మరియు లాతూర్‌లోని మరాఠ్వాడ రైల్ కోచ్ ఫ్యాక్టరీ (MRCF)లో జరుగనున్నాయి. ఇందుకుగాను 30 నవంబర్ 2022 నాడు టెండర్లను ఆహ్వానించింది.

రష్యా కంపెనీకి ఏకపక్షంగా టెండర్ కేటాయించలేదు:

కేంద్ర ప్రభుత్వం ఈ కాంట్రాక్టును ఏకపక్షంగా రష్యన్ కంపెనీకి అందించలేదు. పార్లమెంట్‌కు అందించిన సమాచారం ప్రకారం ఈ కాంట్రాక్టు కోసం మొత్తం ఐదు కంపెనీలు బిడ్స్ వేసాయి. ఇందులో భారతీయ ప్రైవేటు/ప్రభుత్వ రంగ కంపెనీలతో పాటు విదేశే కంపెనీలు కూడా ఉన్నాయి.

తాజా వార్తా కథనాల ప్రకారం రష్యాకు చెందిన JSC Metrowagonmash-Mytischi కంపెనీ ఈ టెండర్ గెలుచుకుంది. ఈ కంపెనీ ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL)తో కలిసి ఈ రైళ్ళ నిర్మాణం మహారాష్ట్రలోని లాతూర్‌లో  చేయనున్నారు.

చివరగా, రష్యన్ కంపెనీ 120 వందే భారత్ రైళ్లను లాతూర్‌లోని మరాఠ్వాడ రైల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేయనుంది.

Share.

About Author

Comments are closed.

scroll