Fake News, Telugu
 

తెలంగాణ పాత సెక్రటేరియట్‌లో మసీదు కుల్చేయడాన్ని నిరసిస్తూ రోడ్డుపై నమాజ్ చేసిన పాత వీడియోను ఇప్పుడు సందర్భ రహితంగా షేర్ చేస్తున్నారు

0

తెలంగాణలో సెక్రటేరియట్ రోడ్డు కబ్జా చేసి ముస్లిములు నమాజ్ చేస్తున్నారని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. వీడియోలో జర్నలిస్టుల సమక్షంలో కొందరు రోడ్డుపై నమాజ్ చేస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ఈ వీడియోపై వివరణ కోరుతూ మా వాట్సాప్ టిప్‌లైన్‌కు ఒక అభ్యర్ధన కూడా వచ్చింది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: తెలంగాణలో సెక్రటేరియట్ రోడ్డు కబ్జా చేసి ముస్లిములు నమాజ్ చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోలోని ఘటన 2021లో జరిగింది. పాత సెక్రటేరియట్ ప్రాంగణంలోని మసీదుని కూల్చేయడానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్ ఇలా రోడ్డుపై నమాజ్ చేసి తమ నిరసన తెలిపారు. పోలీసులు వీరిని అరెస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇలా రోడ్డుపై సామూహిక ప్రార్ధనలు జరిగినట్టు ఎటువంటి న్యూస్ రిపోర్ట్స్ లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వీడియోలో కొందరు వ్యక్తులు రోడ్డుపై నమాజ్ చేస్తున్న ఈ దృశ్యాలు నిజంగా తెలంగాణలో సెక్రటేరియట్ ప్రాంతంలో జరిగినవే అయినప్పటికీ, ఇది ప్రస్తుతం జరిగిన ఘటన కాదు. పైగా కేవలం నిరసన తెలిపే క్రమంలో ఇలా రోడ్డుపై నమాజ్ చేసారు.

ఈ దృశ్యాలకు సంబంధించి మరింత సమాచారం కోసం వెతకగా ఈ ఘటనను 2021లో రిపోర్ట్ చేసిన ఒక వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం పాత సెక్రటేరియట్ ప్రాంగణంలో ఉన్న మసీదుని కూల్చేయడానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ JAC చలో సెక్రటేరియట్ మార్చ్ నిర్వహించింది.

ఈ నిరసనలో భాగంగా ఇలా రోడ్డుపై నమాజ్ చేసారు. వీడియోలో కనిపిస్తున్నది కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్. సెక్రటేరియట్ ప్రాంతంలో రోడ్డుపై నమాజ్ చేస్తూ నిరసన తెలిపారు. వైరల్ వీడియోలోని దృశ్యాలు కూడా ఈ ఘటనకు సంబంధించినవే. ఐతే పోలీసులు వీరిని అరెస్ట్ చేసారు.

ప్రభుత్వం సెక్రటేరియట్ ప్రాంగణంలోని మసీదుని కూల్చేయడాన్ని నిరసిస్తూ గతంలో ముస్లిం సంఘాలు అనేక సార్లు నిరసన తెలిపాయి. వీటికి సంబంధించిన వార్తా కథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఐతే తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త సెక్రటేరియట్ ప్రాంగణంలో కొత్త మసీదుని కూడా నిర్మిస్తున్నది. అలాగే, మసీదు మాత్రమే కాకుండా గుడి మరియు చర్చిను కూడా నిర్మిస్తున్నది. ఈ విషయానికి సంబంధించిన వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

దీన్నిబట్టి, వీడియోలోని దృశ్యాలు గతంలో నిరసన తెలిపే క్రమంలో భాగంగా జరిగినవని స్పష్టమవుతుంది. పైగా ఈ మధ్య కాలంలో ఈ ప్రాంతంలో ముస్లింలు రోడ్డుపై సాముహిక నమాజ్ నిర్వహించినట్టు ఎటువంటి వార్తా కథనాలు కూడా లేవు.

చివరగా, తెలంగాణ సెక్రటేరియట్‌లో మసీదు కుల్చేయడాన్ని నిరసిస్తూ రోడ్డుపై నమాజ్ చేసిన పాత వీడియోను ఇప్పుడు సందర్భ రహితంగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll