Fake News, Telugu
 

ఎండుద్రాక్ష తయారీలో ద్రాక్షలను డిప్పింగ్ ఆయిల్‌లో ముంచడం సాధారణంగా జరిగేదే

0

ద్రాక్ష పండ్లను తాజాగా ఉంచటం కోసం వాటిని ఒక రకమైన కెమికల్‌లో ముంచుతున్నారని, దాని వలన జ్వరం, గొంతు సంబంధిత  వ్యాధులు వస్తున్నాయని క్లెయిమ్ చేస్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ క్లెయిమ్‌లో ఎంతవరకు నిజం ఉందో ఈ కథనం ద్వారా పరిశీలిద్దాం. 

క్లెయిమ్: ద్రాక్ష పండ్లను తాజాగా ఉంచటం కోసం కెమికల్ లో ముంచుతున్న వీడియో. 

ఫాక్ట్ (నిజం): వీడియోలో ద్రాక్షలను ముంచుతున్న తెల్లని ద్రవం పురుగుల మందా లేక ఇతర రసాయనమా అని కచ్చితంగా తెలియనప్పటికీ, ఎండుద్రాక్షల తయారీ ప్రక్రియలో ద్రాక్షలలో ఉన్న నీటిని తీయడానికి వాటిని డిప్పింగ్ ఆయిల్‌లో (ఈథైల్ ఒలియేట్,  పొటాషియం కార్బోనేట్ కలిపిన ద్రవం) ముంచుతారు. వైరల్ వీడియోలో చూపించేది ఎండుద్రాక్ష తయారీ ప్రక్రియ అయ్యే అవకాశం ఉంది. కావున, ఈ పోస్ట్ తప్పుదోవ పట్టిస్తుంది. 

పోస్టులోని వీడియోలో ద్రాక్షలని ముంచుతున్న తెల్లటి ద్రవం ఏంటో తెలుసుకోవడానికి ఇంటర్నెట్లో వెతికితే ఎలాంటి సమాచారం లభించలేదు. అలాగే ఆ ద్రాక్షలని ఆ ద్రవంలో ఎందుకు ముంచుతున్నారు అని కూడా కచ్చితంగా తెలియలేదు.

వీడియోకి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే విజుయల్స్ తో ఉన్న ఒక వీడియో ఇన్‌స్టాగ్రామ్‌ లో లభించింది. ఈ వీడియోలో ఆ తెల్లని ద్రవం పెస్టిసైడ్ కాదని, అది ద్రాక్షలను ఎండు ద్రాక్షలుగా మార్చడానికి ఉపయోగిస్తారని తెలిపారు.  

పైన లభించిన సమాచారంతో YouTubeలో ఎండుద్రాక్షల తయారీ ప్రక్రియకి సంబందించిన కీ వర్డ్స్ తో వెతకగా కొన్ని వీడియోలు (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) లభించాయి. వైరల్ వీడియోలో చూపించినట్టే ఈ వీడియోల్లో కూడా ద్రాక్షలని ఒక తెల్లటి ద్రవంలో ముంచడం గమనించవచ్చు. ఈ వీడియోల్లో ఎండుద్రాక్ష తయారీ ప్రక్రియను వివరిస్తూ మొదట ద్రాక్షలను నీళ్లలో కడిగి ఆ తరువాత ఈథైల్ ఒలియేట్, పొటాషియం కార్బోనేట్ కలిపిన ద్రవంలో ముంచి ఆరబెట్టినట్టు తెలిపారు. 

అంతేకాక, ఎండుద్రాక్షల తయారీ ప్రక్రియకు డిప్పింగ్ ఆయిల్ వాడుతారని పలు రీసెర్చ్ ఆర్టికల్స్, జర్నల్స్ కూడా ధ్రువీకరించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). వీటి ద్వారా, ఇది ఒక సాధారణమైన ప్రక్రియ అని, ద్రాక్షలను ఈథైల్ ఒలియేట్ (1.5%) మరియు పొటాషియం కార్బోనేట్ (2.5%) కలిపిన ద్రవంలో ముంచుతారని, దీని వలన ద్రాక్షలు త్వరగా ఎండుతాయి అని తెలుస్తుంది.

పైన లభించిన సమాచారం ప్రకారం వైరల్ వీడియోలో ద్రాక్షలను ముంచుతున్న తెల్లని ద్రవం ఎండు ద్రాక్షల తయారీ ప్రక్రియలో ద్రాక్షలలో ఉన్న నీటిని తీయడానికి ఉపయోగించే డిప్పింగ్ ఆయిల్ (ఈథైల్ ఒలియేట్ , పొటాషియం కార్బోనేట్ కలిపిన ద్రవం) అయ్యే అవకాశం ఉంది. అలాగే, పురుగుమందు చల్లిన ద్రాక్షలను తినడం వలన వచ్చే ప్రమాదాల గురించి ఇక్కడ మరియు ఇక్కడ చదవవచ్చు. 

చివరగా, ఎండుద్రాక్ష తయారీలో ద్రాక్షలను డిప్పింగ్ ఆయిల్‌లో ముంచడం సాధారణంగా చేసేదే.  

Share.

About Author

Comments are closed.

scroll