Fake News, Telugu
 

గ్యాస్ సిలిండర్‌పై రాష్ట్ర, కేంద్ర వాటాలకు సంబంధించి షేర్ చేస్తున్న ఈ కథనాలు మార్ఫ్ చేయబడ్డాయి

0

గ్యాస్ సిలిండర్ మీద వసూలు చేసే పన్నులలో రాష్ట్ర వాటాపై జరుగుతున్న ప్రచారం వాస్తవమే అని తెలంగాణ బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఒప్పుకున్నట్టు సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. ‘గ్యాస్ సిలిండర్‌పై రాష్ట్ర వాటా వాస్తవమే’ అనే టైటిల్‌తో ప్రచురించిన ఒక వార్తా కథనం ఫోటోని ఈ పోస్టులో షేర్ చేసారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ పన్నులు వసూలు చేయకుండా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయడం అసాధ్యమని గంగుల కమలాకర్ వ్యాఖ్యానించినట్టు ఈ వార్తా కథనంలో రిపోర్ట్ చేసారు. అంతేకాదు, ఈటల రాజేందర్‌ హుజురాబాద్ ఉప ఎన్నికలలో గెలిచినా తమ పార్టీకి నష్టమేమిలేదని గంగుల కమలాకర్ పేర్కొన్నట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టుల యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్లని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: గ్యాస్, పెట్రోల్, డీజిల్ పన్నుల డబ్బులతోనే సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నట్టు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ మీడియాకు తెలిపారు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వార్త కథనం ఫోటో మార్ఫ్ చేయబడినది. గంగుల కమలాకర్ ఇటీవల పెట్టిన సోషల్ మీడియా పోస్టులలో, దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడానికి కేంద్రంలోని బీజేపి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. అంతేకాదు, ఈ వార్తా కథనం యొక్క మరొక ఎడిటెడ్ వెర్షన్లో, ‘గ్యాస్ సిలిండర్‌పై కేంద్ర వాటా వాస్తవమే’ అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నట్టు రూపొందించారు. ఈ రెండూ మార్ఫ్ చేసినవే. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

పోస్టులో షేర్ చేసిన వార్తా కథనం కోసం గుగూల్‌లో వెతికితే, ‘గ్యాస్ సిలిండర్‌పై రాష్ట్ర వాటా వాస్తవమే’ అనే టైటిల్‌తో ఏ ఒక్క న్యూస్ సంస్థ వార్తా కథనం పబ్లిష్ చేయలేదని తెలిసింది. ఒకవేళ తెలంగాణ బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, గ్యాస్, పెట్రోల్, డీజిల్ పన్నుల ద్వారానే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నట్టు మీడియాతో పేర్కొని వుంటే, ఆ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు కథనాలు పబ్లిష్ చేసేవి.

అంతేకాదు, పోస్టులో షేర్ చేసిన వార్తా కథనం యొక్క మరొక వెర్షన్ (ఆర్కైవ్డ్) సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ వెర్షన్‌లో, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫోటోని ప్రచురించి, ‘గ్యాస్ సిలిండర్‌పై కేంద్ర వాటా వాస్తవమే’ అని బండి సంజయ్ పేర్కొన్నట్టు క్లెయిమ్ చేస్తున్నారు. కాని, బండి సంజయ్ గ్యాస్ సిలిండర్‌ పన్నుల వాటా పై ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు ఎక్కడా రిపోర్ట్ అవలేదు. ఈ రెండు వార్తా కథనాలు మార్ఫ్ చేయబడినవని మనం సులభంగా చెప్పొచ్చు.

గంగుల కమలాకర్ ఇటీవల హుజురాబాద్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పలు సార్లు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగాడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. దీనికి సంబంధించి గంగుల కమలాకర్ పెట్టిన ట్వీట్లు మరియు ఫేస్బుక్ పోస్టులని క్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. గంగుల కమలాకర్ గ్యాస్ సిలిండర్ పన్నులలో రాష్ట్ర వాటాకు సంబంధించి ఇటీవల ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అలాగే, హుజురాబాద్ ఎన్నికలలో ఈటల రాజేందర్ గెలిచినా నష్టమేమి లేదని గంగుల కమలాకర్ ఎప్పుడు పేర్కొనలేదు.

పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల పన్నులలో రాష్ట్ర మరియు కేంద్ర వాటాలకు సంబంధించి సోషల్ మీడియాలో షేర్ అయిన వదంతులను తప్పని తెలుపుతూ FACTLY ఫాక్ట్-చెక్ ఆర్టికల్స్ పబ్లిష్ చేసింది. ఆ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చదవొచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే పెట్రోల్ మరియు డీజిల్‌పై నికరంగా పన్నుల రూపంలో రాష్ట్రాల కన్నా కేంద్రానికే ఎక్కువ మొత్తం వెళ్తాయి. అలాగే LPG గ్యాస్ సిలిండర్‌పై ఐదు శాతం జీఎస్‌టీ ఉంటుంది [CGST (కేంద్ర జీఎస్‌టీ) – 2.5 శాతం + SGST (రాష్ట్ర జీఎస్‌టీ) – 2.5 శాతం].

చివరగా, మార్ఫ్ చేసిన వార్తా కథనాల ఫోటోలని షేర్ చేస్తూ గంగుల కమలాకర్, బండి సంజయ్ గ్యాస్ సిలిండర్‌పై రాష్ట్ర మరియు కేంద్ర వాటాలను ఒప్పుకున్నట్టుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll