ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన తల్లి హీరాబెన్ మోదీతో దిగిన చిన్ననాటి ఫోటో అని చెప్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ పోస్టు చేస్తున్న క్లెయిమ్ వెనుక అసలు నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొందాం.
క్లెయిమ్: తన అమ్మ హీరాబెన్ మోదీతో ప్రధాని మోదీ చిన్ననాటి ఫోటో.
ఫాక్ట్ (నిజం): ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తులు ప్రధాని మోదీ, తన తల్లి దివంగత హీరాబెన్ కాదు. మర్యాల శ్రీనివాస్ అనే ఫేస్‌బుక్ యూసర్ 2011లో తన చిన్ననాటి ఫామిలీ ఫోటో పోస్టు చేసారు. ఆ ఫోటోలో తన సహోదరుడు మర్యాల శ్రీధర్ మరియు తన తల్లితో పాటు మిగతా కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ ఫోటోని క్రాప్ చేసి ప్రధాని మోదీ తన తల్లి హీరాబెన్ తో దిగిన ఫోటో అని షేర్ చేస్తున్నారు. కావున పోస్టులోని క్లెయిమ్ తప్పు.
ఈ పోస్టు గురించి ఇంటర్నెట్లో వెతకగా, ఓపెన్ మైండ్ అనే ఫేస్‌బుక్ పేజీలో ఇదే ఫోటో ఒక పోస్టులో కనిపించింది. ఈ ఫోటో తెలంగాణ వాసి అయిన మర్యాల శ్రీనివాస్ అనే వ్యక్తివి అని ఆ పోస్టులో పేర్కొన్నారు. మర్యాల శ్రీనివాస్ ఫేస్‌బుక్ పేజీలో 2011లో తాను అప్లోడ్ చేసిన పోస్టులో ఉన్న ఫోటో యొక్క అసలు వెర్షన్ కనిపించింది. ఇందులో చిన్న పిల్లవాడు, మహిళతో పాటు ఇంకో ముగ్గురు కూడా ఉన్నారు.
ఈ ఫోటో తన కుటుంబానిది అని మర్యాల శ్రీనివాస్ ఒక పోస్టు ద్వారా స్పష్టం చేసారు. ఆ ఫొటోలో ఉన్నది ప్రధాని మోదీ కాదని, తన సహోదరుడు మర్యాల శ్రీధర్ అని పేర్కొన్నారు.
చివరిగా, ఈ ఫొటోలో ఉన్న వ్యక్తులు ప్రధాని మోదీ, తన తల్లి హీరాబెన్ మోదీ కాదు.