Fake News, Telugu
 

బంగ్లాదేశ్‌కి సంబంధించిన వీడియోని తక్కువ కులానికి చెందిన బాడీ బిల్డర్‌కి జరిగిన అవమానం అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు

0

తక్కువ కులానికి చెందిన ఒక బాడీ బిల్డర్‌ని అవమానించారు అని చెప్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ‘టాలెంట్ ఎంత ఉన్నా కులాన్ని బట్టే గుర్తింపు ఉంటుంది…’ అని పోస్టు యొక్క వివరణలో రాసారు. అసలు ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఫాక్ట్ చెక్ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: తక్కువ కులానికి చెంది ఒక బాడీ బిల్డర్‌ని పోటీల బహుమతులు ప్రధానం చేసేటప్పుడు అవమాన పరిచారు.

ఫాక్ట్ (నిజం): పోస్టులోని దృశ్యాలు బంగ్లాదేశ్ నేషనల్ బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్ 2022 విజేతలకు మెడల్స్ మరియు బహుమతులు ఇస్తున్నప్పుడు చిత్రించినవి. వీడియోలో బహుమతి అందుకొని స్టేజీ కిందకు వచ్చి దాన్ని కాలితో తన్నివేసిన బాడీ బిల్డర్ పేరు జాహిద్ హాసన్ షువో. మీడియాకి తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో అవార్డుల ఎన్నికలో అవినీతి జరిగిందని షువో ఆరోపించారు. తన ఈ ప్రవర్తనకు శిక్షగా బంగ్లాదేశ్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ (BABBF) వారు తనని జీవితకాలం పాటు బ్యాన్ చేసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

బాడీ బిల్డింగ్ పోటీల్లో జరిగిన గొడవ గురించి తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, మాకు ఒక యూట్యూబ్ వీడియో లభించింది.

26 డిసెంబర్ 2022వ తారీఖున బాడీ బిల్డింగ్ ఇన్సైడర్ అనే ఛానెల్లో వైరల్ వీడియోలో దృశ్యాలు కనిపించాయి. వీడియో యొక్క వివరణలో ఈ సంఘటన బంగ్లాదేశ్‌లో జరిగిందని రాసి ఉంది. దీన్ని క్లూగా తీస్కొని మరింత సమాచారం గురించి ఇంటర్నెట్లో వెతకగా ఈ సంఘటనకు సంబంధించిన అనేక వార్త కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). 

వార్తా కథనాల ప్రకారం ఈ సంఘటన బంగ్లాదేశ్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ (BABBF) వారి నేషనల్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్ 2022 పోటీల అవార్డు బహుకరణ అప్పుడు జరిగింది. పోటీల్లో రెండవ బహుమతి వచ్చిన జాహిద్ హాసన్ షువో అనే బంగ్లాదేశీ బాడీ బిల్డర్ స్టేజీ పైనుండి కిందకి దిగి వచ్చి తన బహుమతిని కాలితో తన్నాడు. దీనికి ముందు స్టేజిపై ఉన్నప్పుడు తాను భానుమతులు ఇస్తున్న వారితో ఎదో మాట్లాడి తర్వాత తనని పక్కకి నిల్చోమని ఒకరు చెవుతున్న దృశ్యాలు మనకి వైరల్ వీడియోలో కనిపిస్తాయి. మీడియాతో మాట్లాడుతూ (ఇక్కడ మరియు ఇక్కడ) షువో, తను ఆలా చెయ్యడానికి కారణం నిర్వాహకుల పట్ల తాను నిరసన వ్యక్త పరచటం అని చెప్పారు.

తన ప్రవర్తనకు శిక్షగా బాంగ్లాదేశ్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ షువోని జీవిత కలం పాటు బాడీ బిల్డింగ్ నుండి బాన్ చేసింది. వారు విడుదల చేసిన సర్కులర్ ఇక్కడ చూడవచ్చు. ఈ వార్త కథనాల్లో ఎక్కడా కూడా తాను తక్కువ కులానికి చెందిన వాడని, అందుచేతే అన్యాయానికి వ్యతిరేకంగా ఇలా తాను ప్రవర్తించాడని కానీ ఎక్కడా ప్రస్తావించలేదు.

చివరిగా, బంగ్లాదేశ్ బాడీ బిల్డర్ జాహిద్ హాసన్ తన బహుమతిని కాలితో తన్నిన దృశ్యాలను తక్కువ కులానికి చెందిన వ్యక్తికి జరిగిన అవమానం అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll