Fake News, Telugu
 

ఉగ్రదాడి అనుమానితులను రష్యన్ ఆర్మీ చిత్రహింసలు పెడుతుందంటూ ఒక పాత వీడియోను షేర్ చేస్తున్నారు

0

ఇటీవల రష్యాలోని ఒక మాల్‌లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో నగ్నంగా ఉన్న ఒక వ్యక్తిని బాత్రూమ్ కమోడ్లో బలవంతంగా తల పట్టించి హింసిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను రష్యా పోలీసులు పట్టుకొని ఇలా చిత్రహింసలు పెడుతున్నారంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.

క్లెయిమ్: మార్చ్ 2024లో రష్యాలో జరిగిన దాడిలో పాల్గొన్న ఉగ్రవాదిను పోలీసులు హింసిస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): మార్చ్ 2024లో జరిగిన ఉగ్రదాడికు సంబంధించిన అనుమానితులను ఆర్మీ చిత్రహింసలు పెట్టినట్టు కథనాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో మాత్రం పాతది. ఈ వీడియోలోని ఘటన 2016లో రష్యాలోని స్వెర్డ్లోవ్స్క్ ప్రాంతంలో రిపోర్ట్ అయినట్టు రష్యన్ వార్తా కథనాలు ఉన్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

మార్చ్ 2024లో రష్యాలో జరిగిన ఉగ్రదాడిలో వందకు పైగా ప్రజలు చనిపోయారు. కాగా ఈ దాడికి సంబంధించి ఇప్పటివరకు తొమ్మిది మందిని తజికిస్తాన్‌లో అదుపులోకి తీసుకున్నట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి. ఇదిలా ఉండగా పోలీసులు అనుమానితులను టార్చర్ చేసి, వీడియోలను సర్క్యులేట్ చేసినట్టు కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. ఐతే ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోకు మాత్రం ఇటీవల జరిగిన పరిణామాలకు ఎటువంటి సంబంధం లేదు, ఇది ఒక పాత ఘటనకు సంబంధించిన వీడియో.

 ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోకు సంబంధించిన సమాచారం కోసం వెతకగా 2019లో ఇదే వీడియోను రిపోర్ట్ చేసిన ఒక రష్యన్ వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం ఈ వీడియోను 2016లో రష్యాలోని  స్వెర్డ్లోవ్స్క్ ప్రాంతంలో చిత్రీకరించినట్టు తెలిసింది. కాగా ఇదే వీడియో తిరిగి 2019లో రష్యన్ ఆర్మీ క్యాంపులలో సైనికులను హింసిస్తున్నట్టు షేర్ కావడంతో రష్యన్ ఆర్మీ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు కూడా తెలిసింది.

దీన్నిబట్టి ఈ వీడియోకు ఇటీవల జరిగిన ఉగ్రదాడికు ఎటువంటి సంబంధం లేదని స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన ఉగ్రదాడి అనుమానితులను ఆర్మీ చిత్రహింసలు పెట్టినట్టు పలు స్వచంధ సంస్థలు ఆరోపణలు చేసాయి. వీడియోలు తీసి వాటిని టెలిగ్రామ్‌లో సర్క్యులేట్ చేసినట్టు హ్యూమన్ రైట్స్ వాచ్ ఆరోపించింది.

చివరగా, ఉగ్రదాడికు అనుమానితులను రష్యన్ ఆర్మీ చిత్రహింసలు పెడుతుందంటూ ఒక పాత వీడియోను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll