“దేశంలో మొట్టమొదటిసారిగా మహారాష్ట్ర కోర్టు ఆవరణలోనే ఒక మహిళా జడ్జి, ఒక మహిళా లాయర్ కొట్టుకున్నారు” అంటూ సోషల్ మీడియాలో ఇద్దరు మహిళలు కొట్టుకుంటున్న వీడియో ఒకటి షేర్ చెయ్యబడుతోంది. దీని వెనుక ఉన్న నిజమేంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
క్లెయిమ్: మహారాష్ట్ర కోర్టు ఆవరణలోనే ఒక మహిళా జడ్జి, ఒక మహిళా లాయర్ కొట్టుకున్న వీడియో ఇది.
ఫాక్ట్ (నిజం): ఈ ఘటన మహారాష్ట్రలో కోర్టులో చోటు చేసుకోలేదు. ఇది 2022లో ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లోని జిల్లా సెషన్స్ కోర్టులో ఇద్దరు న్యాయవాదుల మధ్య గొడవకు సంబంధించిన వీడియో. కాస్‌గంజ్ పోలీసులు కూడా ఈ వీడియో గురించి, ఫిర్యాదు ఆధారంగా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని 28 అక్టోబర్ 2022న ట్వీట్ చేశారు. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
వీడియో చూపిస్తున్న సంఘటన గురించి ఏవైనా నివేదికలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి మేము తగిన కీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, ఇది అక్టోబర్ 2022లో ప్రచురించబడ్డ వివిధ మీడియా కథనాలకు దారితీసింది (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, ఇది ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లోని జిల్లా సెషన్స్ కోర్టులో ఇద్దరు న్యాయవాదుల మధ్య గొడవకు సంబంధించిన వీడియో.
దైనిక్ భాస్కర్ నివేదిక ప్రకారం “ఈ వివాదంలో కనిపిస్తున్న ఇద్దరు న్యాయవాదులు కాస్‌గంజ్‌కు చెందిన యోగ్యత సక్సేనా మరియు అలీగఢ్కు చెందిన సునీత కౌశిక్. వీరిద్దరూ పారుల్ సక్సేనా మరియు రాహుల్ దంపతుల కేసును వాదించటానికి కాస్‌గంజ్ జిల్లా సెషన్స్ కోర్టులోని ఫ్యామిలీ కోర్టుకు వెళ్లారు. కోర్టు విచారణ సందర్భంగా ఇద్దరు లాయర్ల మధ్య చిన్నపాటి వాదన పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. ఈ వివాదాన్ని అక్కడ ఉన్న ఒక లాయర్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసారు. వివాదం తరువాత సునీత కౌశిక్, రాహుల్ మరియు అతని సహచరులపై ఓగ్యత సక్సేనా కేసు నమోదు చేశారు (అనువదించబడింది).”
కాస్‌గంజ్ పోలీసులు కూడా ఈ వీడియో గురించి, ఫిర్యాదు ఆధారంగా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని 28 అక్టోబర్ 2022న ట్వీట్ చేశారు.
చివరిగా, ఉత్తరప్రదేశ్‌లోని ఒక కోర్టు ఆవరణలో ఇద్దరు మహిళా న్యాయవాదులు గొడవ పడుతున్న వీడియోను మహారాష్ట్రకు చెందినట్టు షేర్ చేస్తున్నారు.