బంగ్లాదేశ్‌లో భారీ స్థాయిలో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఐతే ఈ ఆందోళనలలో అక్కడి ముస్లింలు హిందువుల దేవాలయాలను తగపెడుతున్నారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది. ప్రస్తతం షేర్ అవుతున్న ఈ వీడియోలో ఒక భవనం మంటల్లో కాలుతుండడం చూడొచ్చు (ఇక్కడ & ఇక్కడ). ఐతే ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: బంగ్లాదేశ్ ఆందోళనల్లో నిరసనకారులు హిందూ దేవాలయాన్నీ తగలపెట్టిన వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్నది బంగ్లాదేశ్‌లోని సత్ఖిరా పట్టణంలో ‘రాజ్ ప్యాలెస్’ అనే ఒక రెస్టారెంట్. ప్రస్తుత నిరసనల్లో భాగంగా ఆందోళనకారులు ఈ రెస్టారెంట్‌కు నిప్పంటించారు. అక్కడి లోకల్ వార్తా సంస్థ కూడా ఇదే విషయాన్ని తెలిపింది. కాగా ప్రస్తుత నిరసనల్లో హిందూ దేవాలయాలపై దాడులు జరిగినట్టు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. ఐతే ప్రస్తుత వీడియోలో కనిపిస్తున్నది మాత్రం హిందూ దేవాలయం కాదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
పలు రిపోర్ట్స్ ప్రకారం, ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లలో కొన్ని చోట్ల నిరసనకారులు మైనారిటీలు, ముఖ్యంగా హిందువుల ఇళ్లు మరియు వ్యాపారాలపై దాడి చేసి వారి విలువైన వస్తువులను దోచుకున్నారని తెలుస్తుంది. అలాగే హిందువుల ఇళ్లను, దేవాలయాలను ధ్వంసం చేయడం, తగులబెట్టడం వంటి సంఘటనలు జరుగుతున్నట్లు మరికొన్ని రిపోర్ట్స్ పేర్కొన్నాయి. (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).
ఐతే ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోలో మంటల్లో కాలుతున్నది హిందూ దేవాలయం కాదు. అది బంగ్లాదేశ్‌లోని సత్ఖిరా పట్టణంలో ఉన్న ఒక రెస్టారెంట్. ఈ వీడియో స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ విడియోలోనిది హిందూ దేవాలయం కాదని, సత్ఖిరాలో ఉన్న ‘రాజ్ ప్యాలెస్’ అనే కాఫీ షాప్ అని తెలిపిన ఒక సోషల్ మీడియా పోస్ట్ మాకు కనిపించింది.
ఈ పోస్ట్‌లోని సమాచారం ఆధారంగా యూట్యూబ్‌లో వెతకగా ఈ కాఫీ షాప్‌కు సంబంధించిన ఒక ప్రమోషనల్ వీడియో మాకు కనిపించింది. ఈ వీడియోలో ఆ షాప్ లోపలి భాగం మొత్తం చూపించారు. ఈ వీడియో ప్రకారం ఇది ఒక రెస్టారెంట్ అని స్పష్టంగా తెలుసుతుంది. ఈ బిల్డింగ్ లోపల ఎలాంటి హిందూ దేవుళ్ళ విగ్రహాలు లేవు. గూగుల్ మ్యాప్స్ ప్రకారం సత్ఖిరాలో నిర్మాణంలో ఉన్న రెస్టారెంట్ ఫోటోలు ఇక్కడ చూడొచ్చు.
కాగా ఈ వీడియోకు సంబంధించి మరింత సమాచారం వెతికే క్రమంలో ఈ వీడియోను రిపోర్ట్ చేసిన ఒక బంగ్లాదేశీ వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం కూడా ఈ వీడియోలో కాలుతున్న భవనం సత్ఖిరాలోని ‘రాజ్ ప్యాలెస్’ అనే రెస్టారెంట్ అని, హిందూ దేవాలయం కాదని స్పష్టం చేసింది. సత్ఖిరాలోని లోకల్ జర్నలిస్ట్ లతో మాట్లాడగా ఈ రెస్టారెంట్ ‘కాజీ అసదుజ్జమాన్ షాజాదర్’ అనే వ్యక్తికి చెందిందని తెలిపినట్టు ఈ కథనంలో పేర్కొన్నారు. ఈ సమాచారం ఆధారంగా ఈ వీడియోలో మంటల్లో కాలుతూ కనిపించేది హిందూ దేవాలయం కాదని స్పష్టమవుతుంది.
చివరగా, బాంగ్లాదేశ్ ఆందోళనలకు సంబంధించి ఈ వీడియోలో కనిపిస్తున్నది మంటల్లో కాలుతున్న ఒక రెస్టారెంట్, హిందూ దేవాలయం కాదు.