Fake News, Telugu
 

ఈ వీడియోలో సికింద్రాబాద్ గణపతి ఆలయ పూజారి దాడికి గురైన వ్యక్తి క్రైస్తవుడు కాదు

0

హిందూ దేవాలయంలో క్రైస్తవ మత ప్రచారం చేస్తున్న వ్యక్తిని ఆలయ పూజారి కొడుతున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: హిందూ దేవాలయంలో క్రైస్తవ మత ప్రచారం చేస్తున్న వ్యక్తిని ఆలయ పూజారి కొడుతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ ఘటన ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రసిద్ద గణపతి దేవాలయంలో చోటుచేసుకుంది. అనుమతి లేకుండా దేవాలయంలోని ఉప ఆలయాలను దర్శించుకున్నాడనే కారణంతో గణపతి దేవాలయ పూజారి ప్రభాకర్ శర్మ, వాల్మికి రావు అనే భక్తుడితో వాగ్వాదానికి దిగి అతనిపై చేయిచేసుకున్నాడు. తనపై జరిగిన దాడి గురించి భక్తుడు సికింద్రాబాదులోని గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు. దాడి చేసిన వ్యక్తి క్రైస్తవుడు కాదని గోపాలపురం పోలీస్ స్టేషన్ SHO సాయి ఈశ్వర్ గౌడ్ స్పష్టం చేసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘ETV Telangana’ న్యూస్ ఛానల్ 06 మర్చి 2022 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. సికింద్రాబాద్ గణపతి ఆలయానికి దైవదర్శనం కోసం వచ్చిన భక్తుడిపై పూజారి దాడి చేసిన దృశ్యాలని ఈ వీడియోలో రిపోర్ట్ చేసారు. ఉప్పల్‌కు చెందిన ఒక భక్తుడు ప్రధాన ఆలయంలోని ఉప ఆలయాలను దర్శించుకుంటున్న సమయంలో, అనుమతి లేకుండా గుడిలో ఎలా ప్రవేశించావంటూ ఆలయ పూజారి ప్రభాకర్ శర్మ ఆ భక్తుడితో వాగ్వాదానికి దిగి అతనిపై చేయిచేసుకున్నట్టు ఈ వీడియోలో రిపోర్ట్ చేసారు.

ఈ ఘటనకు సంబంధించి పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ అలాగే, వీడియోలని పబ్లిష్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. భక్తుడు తనపై జరిగిన దాడి గురించి సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.  ఈ న్యూస్ రిపోర్టులలో ప్రభాకర్ శర్మ దాడికి గురైన భక్తుడి పేరు వాల్మికి రావు అని పేర్కొన్నారు. పోలీసులు పూజారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది.  

దాడికి గురైన వ్యక్తి క్రైస్తవు మతానికి చెందిన వాడా లేదా అని తెలుసుకోవడానికి గోపాలపురం పోలీస్ SHO సాయి ఈశ్వర్ గౌడ్‌ ని FACTLY సంప్రదించింది. గణపతి దేవాలయంలో పూజారి దాడి చేసిన వ్యక్తి మున్నూరు కాపు కులానికి చెందిన వాడని, క్రైస్తవ మతస్తుడు కాదని సాయి ఈశ్వర్ గౌడ్ స్పష్టం చేసారు. ఈ ఘటనకు సంబంధించి ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ తెలంగాణ పోలీస్ వెబ్సైటులో ప్రస్తుతం చూపించడం లేదు. ఎఫ్ఐఆర్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ఈ ఆర్టికల్‌ని అప్డేట్ చేస్తాము.

చివరగా, ఈ వీడియోలో సికింద్రాబాద్ గణపతి ఆలయ పూజారి దాడికి గురైన వ్యక్తి క్రైస్తవుడు కాదు.

Share.

About Author

Comments are closed.

scroll