Fake News, Telugu
 

కొత్తగా ప్రవేశపెట్టిన BH సిరీస్ ద్వారా రవాణా శాఖను కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకుంటుందన్న వాదన కరెక్ట్ కాదు

0

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన BH సిరీస్ నెంబర్ ప్లేట్ ఉన్న కార్ ఫోటోను షేర్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వం ‘వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్’ ద్వారా రాష్ట్ర రవాణా శాఖను తన పరిధిలోకి తీసుకుందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా పోస్టులో చెప్తున్న విషయానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: కేంద్ర ప్రభుత్వం ‘వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్’ ద్వారా రాష్ట్ర రవాణా శాఖను తన పరిధిలోకి తీసుకుంటుంది.

ఫాక్ట్ (నిజం): రాష్ట్రాల మధ్య వ్యక్తిగత వాహనాల బదిలీ ప్రక్రియను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా భారత్​ సిరీస్​ (BH-series) ఒక కొత్త రిజిస్ట్రేషన్ మార్క్​ను​ ప్రవేశపెట్టింది. ఐతే ప్రస్తుతం ఈ సిరీస్ కేవలం కొందరికి మాత్రమే అందుబాటులో ఉంది. అలాగే ఈ కొత్త సిరీస్ రిజిస్ట్రేషన్ ద్వారా చెల్లించే రోడ్ టాక్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకే చెందుతుంది. ఐతే  కేంద్ర ప్రభుత్వం BH సిరీస్‌కు సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్‌లో రాష్ట్ర అధికారాలను తమ పరిధిలోకి తీసుకునే అంశమేది లేదు. కేవలం ఇంతకు ముందు క్లిష్టంగా ఉన్న పద్దతిని ఈ కొత్త సిరీస్ ద్వారా సరళతరం చేస్తున్నారు. కాబట్టి ఈ కొత్త సిరీస్ ద్వారా రవాణా శాఖ కేంద్ర పరిధిలోకి వెళ్తుందని చేస్తున్న వాదన కరెక్ట్ కాదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

రాష్ట్రాల మధ్య వ్యక్తిగత వాహనాల బదిలీ ప్రక్రియను సులభతరం చేసేందుకు గత సంవత్సరం ఆగస్ట్‌లో కేంద్ర ప్రభుత్వం భారత్​ సిరీస్​ (BH-series) ఒక కొత్త రిజిస్ట్రేషన్ మార్క్​ను​ ప్రవేశపెడుతూ ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ BH సిరీస్ ద్వారా ఇతర రాష్ట్రాలకు తమ వాహనాలను తరలించినప్పుడు మళ్లీ ఆ రాష్ట్రంలో వాహనాన్ని తిరిగి రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉండదు.

సాధారణంగా ఒక రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనాన్ని గరిష్ఠంగా 12 నెలల వరకు మాత్రమే వేరే రాష్ట్రంలో ఉపయోగించేందుకు వీలుంటుంది. అంతకంటే ఎక్కువ కాలం పాటు ఆ రాష్ట్రంలో వాహనం నడపాలంటే ఆ వాహనాన్ని మళ్లీ ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ చేయించాల్సి ఉంటుంది.

వాహనం రిజిస్టర్ అయిన రాష్ట్రం నుండి నో- అబ్జక్షన్ సర్టిఫికేట్ పొందాలి, అంతే కాకుండా వాహన యజమాని కొత్త రాష్ట్రంలో వాహనానికి మళ్లీ రోడ్డు పన్ను చెల్లించాలి. ఇంతకుముందు రిజిస్టర్ అయిన రాష్ట్రంలో చెల్లించిన రోడ్డు పన్ను రీయింబర్స్‌మెంట్ కోసం ఆ రాష్ట్రంలో దరఖాస్తు చేసుకోవాలి.

ఐతే ఇకపై రాష్ట్రం మారినా వాహన రిజిస్ట్రేషన్ మార్చాల్సిన అవసరం లేకుండా కేంద్రం ఈ BH సిరీస్‌ను ప్రవేశపెట్టింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ BH సిరీస్‌కు సంబంధించిన కొన్ని అంశాలు కింద చూడొచ్చు.

BH రిజిస్ట్రేషన్ వెహికల్ నంబర్ :

సాధారణంగా BH సిరీస్‌ మార్క్ కింద రిజిస్ట్రేషన్ చేయించిన వాహనాలకు “YY BH #### XX” ఫార్మాట్‌లో నంబర్ కేటాయిస్తారు. ఇందులో YY వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించిన సంవత్సరాన్ని సూచిస్తుంది, BH అనేది భారత్ సిరీస్ కోడ్ కాగా, #### అనేది ర్యాండమ్‌గా జనరేట్ చేసిన నాలుగు అంకెల వాహన నంబర్, చివరగా XX అంటే ఒకటి లేదా రెండు ఆంగ్ల అక్షరాలు.

BH రిజిస్ట్రేషన్ పొందిన వాహనాలు చెల్లించాల్సిన రోడ్ టాక్స్ :

రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని రోడ్ టాక్స్ కు సంబంధించి, ఈ BH సిరీస్ రిజిస్ట్రేషన్ పొందిన వాహనాలు 2 ఏళ్ల రోడ్డు పన్ను కట్టాలి. రిజిస్ట్రేషన్ చేసి 14 ఏళ్లు అయిన తర్వాత, ప్రతి ఏడాది రోడ్డు పన్ను కట్టాల్సి ఉంటుంది. వాహన ధర బట్టి రోడ్డు పన్ను ఉంటుంది. ఏ ధరకు ఎంత రోడ్డు పన్ను కట్టాలన్న వివరాలు కింది టేబుల్‌లో చూడొచ్చు.  

BH సిరీస్‌ను ఎవరు పొందవచ్చు :

ఐతే ప్రస్తుతానికి ఈ సదుపాయం అందరికి అందుబాటులో లేదు. కేవలం కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు, రక్షణ రంగ ఉద్యోగులకు ఈ BH రిజిస్ట్రేషన్ సిరీస్ స్వచ్ఛందంగా అందుబాటులో ఉంటుంది.  ప్రైవేట్ సెక్టార్ విషయానికి వస్తే, నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో తమ కార్యాలయాలను కలిగి ఉన్న కంపెనీలు/సంస్థల ఉద్యోగులకు మాత్రమే ఈ కొత్త రిజిస్ట్రేషన్ మార్క్‌ అందుబాటులో ఉంటుంది.

ఐతే పైన తెలిపినట్టు ఈ BH సిరీస్ రిజిస్ట్రేషన్ అందరికి తప్పనిసరి కాదు. ప్రస్తుతం ఈ BH సిరీస్ రిజిస్ట్రేషన్ కొందరికి మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్నవారికి కూడా ఇది తప్పనిసరి కాదు. అలాగే ఈ రిజిస్ట్రేషన్ ద్వారా వసూలు చేసే రోడ్ టాక్స్ కూడా రాష్ట్రాలకే చెల్లుతుంది. కేంద్ర ప్రభుత్వం BH సిరీస్‌కు సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్‌లో రాష్ట్ర అధికారాలను తమ పరిధిలోకి తీసుకునే అంశమేది లేదు. కేవలం ఇంతకు ముందు క్లిష్టంగా ఉన్న పద్దతిని ఈ కొత్త సిరీస్ ద్వారా సరళతరం చేస్తున్నారు. కాబట్టి పోస్టులో ఆరోపిస్తున్నట్టు ఈ కొత్త సిరీస్ ద్వారా రవాణా శాఖ కేంద్ర పరిధిలోకి వెల్తుందన్న వాదన కరెక్ట్ కాదు.

చివరగా, కొత్తగా ప్రవేశపెట్టిన BH సిరీస్ ద్వారా రవాణా శాఖను కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకుంటుందన్న వాదన కరెక్ట్ కాదు.

Share.

About Author

Comments are closed.

scroll