“సీపీఎం జాతీయ నాయకురాలు సుభాషిణి అలీ మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పొగుడుతూ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని విమర్శించారు” అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలోఉన్న మహిళ “భారతదేశాన్ని, రాజకీయాలను రాహుల్ గాంధీ అర్థం చేసుకోలేదని, ఆయన దేశాన్ని ముందుకు తీసుకెళ్లలేడని, ప్రస్తుతం ప్రపంచం మొత్తం సంక్షోభంలో ప్రయాణిస్తోందని.. పరిస్థితిని బట్టి దేశాన్ని నడిపించడంలో ప్రధాని మోదీ సమర్థుడు” అని చెప్పడం మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: CPI(M) జాతీయ నాయకురాలు సుభాషిణి అలీ మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పొగుడుతూ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని విమర్శించిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో ఉన్న మహిళ CPI(M) నాయకురాలు సుభాషిణి అలీ కాదు. ఈ వైరల్ వీడియోపై సుభాషిణి అలీ X(ట్విట్టర్)లో స్పందిస్తూ, వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి తాను కాదని, వీడియోలోని వ్యాఖ్యలు తనకు తప్పుగా ఆపాదించబడ్డాయని స్పష్టం చేసింది. వైరల్ వీడియోలో ఉన్న మహిళతో సుభాషిణి అలీ ఫోటోను పోల్చి చూస్తే వైరల్ వీడియోలో ఉంది సుభాషిణి అలీ కాదని స్పష్టం అవుతోంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ వీడియోలో కనిపిస్తున్న మైక్రోఫోన్‌పై “99 Khabar”(99 ఖబర్) అనే లోగో ఉండటం మనం గమనించవచ్చు. దీని ఆధారంగా తగిన కీవర్డ్స్ ఉపయోగించి యూట్యూబ్‌లో వెతకగా, “99 Khabar” అనే యూట్యూబ్ ఛానల్ ఒకటి కనిపించింది. ఈ ఛానల్ లో వెతకగా, ఈ వైరల్ వీడియో క్లిప్ యొక్క అధిక నిడివి గల వీడియో ఒకటి లభించింది. ఈ వీడియోను 01 డిసెంబర్ 2023న “మోదీ పాలనలో మహిళల బట్టలు తొలగించబడుతున్నాయా? ఒక 65-సంవత్సరాల మహిళ విమర్శకుల నోరుమూయించింది” అనే శీర్షికతో షేర్ చేశారు (హిందీ నుండి తెలుగులోకి అనువదించగా ). ఈ వీడియో యొక్క వివరణ ప్రకారం, ఈ వీడియో 2024 లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ గురించి ప్రజల నుండి అభిప్రాయాలు సేకరణకు సంబంధించినదిగా తెలుస్తుంది. అలాగే, ఈ వీడియోలో వివరణలో ఎక్కడా మాట్లాడుతున్న మహిళ CPI(M) జాతీయ నాయకురాలు సుభాషిణి అలీ అని పేర్కొన్నలేదు. కేవలం 65-సంవత్సరాల మహిళ అని మాత్రమే పేర్కొన్నారు. అయితే, కాన్పూర్‌లో 29 డిసెంబర్ 1947లో జన్మించిన సుభాషిణి అలీ వయస్సు ప్రస్తుతం 76 సంవత్సరాలు (ఇక్కడ).
అలాగే, మేము తరువాత సుభాషిణి ఆలీ యొక్క పలు వీడియోలు మరియు ఫోటోలను పరిశీలించగా, సుభాషిణి ఆలీ యొక్క ఆకారము, మాట్లాడే తీరు, మరియు వాయిస్ (స్వరము) అన్నీ వైరల్ వీడియోలో కనిపిస్తున్న మహిళ నుండి భిన్నంగా ఉండటం గమినించాం (ఇక్కడ & ఇక్కడ). వైరల్ వీడియోలో ఉన్న మహిళతో సుభాషిణి అలీ ఫోటోను పోల్చి చూడగా, వైరల్ వీడియోలో ఉంది సుభాషిణి అలీ కాదని స్పష్టం అవుతోంది. దీన్ని బట్టి వైరల్ వీడియోలో ఉన్న మహిళ CPI(M) నాయకురాలు సుభాషిణి అలీ కాదని మనం నిర్ధారించవచ్చు.
తదుపరి మేము CPI(M) నాయకురాలు సుభాషిణి అలీ ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు. ఒక వేళ ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, ఖచ్చితంగా పలు మీడియా సంస్థలు ఈ విషయాన్ని రిపోర్టు చేసి ఉండేవి. అలాగే మేము సుభాషిణి అలీ సోషల్ మీడియా ఖాతాలను (ఇక్కడ & ఇక్కడ) పరిశీలించగా, ప్రధాని మోదీ మరియు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు కనిపించలేదు. పైగా ఈ వైరల్ వీడియోపై సుభాషిణి అలీ ట్విట్టర్‌లో స్పందిస్తూ, వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి తాను కాదని మరియు వ్యాఖ్యలు తనకు తప్పుగా ఆపాదించబడ్డాయని స్పష్టం చేసింది. అలాగే, ఈ వైరల్ వీడియో గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె పోస్టులో పేర్కొన్నారు.
చివరగా, ఈ వీడియోలో ప్రధాని మోదీని పొగుడుతూ, రాహుల్ గాంధీని విమర్శిస్తున్న మహిళ CPI(M) నాయకురాలు సుభాషిణి అలీ కాదు.