బంగ్లాదేశ్‌లో భారీ స్థాయిలో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి హిందువులపై దాడులు జరిగినట్టు పలు రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఐతే ఈ క్రమంలోనే ఒక మహిళ చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ అతికించి రోడ్డుపై కూర్చున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది. వీడియోలో అమ్మాయి బంగ్లాదేశీ హిందూ అని, ప్రస్తుతం జరుగుతున్న ఆందోనళలో ఆమెను అక్కిడి ముస్లింలు ఇలా హింసిస్తున్నారు అంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు (ఇక్కడ & ఇక్కడ). ఐతే ఈ కథనం ద్వారా ఆ వాదనకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: బంగ్లాదేశ్ ఆందోళనల నేపథ్యంలో హిందూ అమ్మాయిని చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ అతికించి రోడ్డుపై వదిలేసి హింసిస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోలోని దృశ్యాలకు ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అల్లర్లకు ఎటువంటి సంబంధం లేదు. మార్చ్ 2024లో బంగ్లాదేశ్‌లోని జగన్నాథ్ యూనివర్సిటీలో ఒక విద్యార్థి ఆత్మహత్య జరగగా, ఆ సంఘటన గురుంచి జరిగిన నిరసనలకు సంబంధించింది ఈ వీడియో. యూనివర్సిటీ యాజమాన్యానికి వ్యతిరేకంగా కొందరు విద్యార్థులు వీడియోలో చూపిస్తున్నట్టు చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ అతికించుకొని మౌనంగా నిరసన తెలిపారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. పలు రిపోర్ట్స్ ప్రకారం, ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లలో కొన్ని చోట్ల నిరసనకారులు మైనారిటీలు, ముఖ్యంగా హిందువుల ఇళ్లు మరియు వ్యాపారాలపై దాడి చేసి వారి విలువైన వస్తువులను దోచుకున్నారని తెలుస్తుంది. అలాగే హిందువుల ఇళ్లను, దేవాలయాలను ధ్వంసం చేయడం, తగులబెట్టడం, మహిళలపై దాడి చేయడం వంటి సంఘటనలు జరుగుతున్నట్లు మరికొన్ని రిపోర్ట్స్ పేర్కొన్నాయి (ఇక్కడ & ఇక్కడ).
ఐతే ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోను ఈ ఆందోళనలకు ముడిపెడుతు షేర్ చేస్తున్నప్పటికీ, ఈ వీడియోకు ప్రస్తుత అల్లర్లకు ఎలాంటి సంబంధం లేదు. అలాగే ఈ వీడియోలోని ఘటనలో ఎలాంటి మతపరమైన కోణం లేదు. ఈ వీడియో స్క్రీన్ షాట్స్ మరియు కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా ఇదే వీడియోలోని దృశ్యాలను మార్చ్ 2024లో రిపోర్ట్ చేసిన ఒక బంగ్లాదేశీ వార్తా కథనం మాకు కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి వేరే కోణంలో తీసిన ఫోటోలను ఈ కథనంలో రిపోర్ట్ చేసారు.
ఐతే ఈ కథనం ప్రకారం బంగ్లాదేశ్‌లోని జగన్నాథ్ యూనివర్సిటీలో జరిగిన ఆత్మహత్యకు సంబంధించి యూనివర్సిటీ విద్యార్థులు యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగానే కొందరు విద్యార్థులు చేతులు కట్టేసుకొని, నోటికి ప్లాస్టర్ వేసుకొని నిరసన తెలిపారు. ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో ఈ నిరసనలకు సంబంధించిందే. ఈ కథనంలో చెప్తున్నది ధృవీకరించే విధంగా ఆ టైంలో ఈ ఆత్మహత్యకు సంబంధించి విద్యార్థులు చేసిన నిరసనలను రిపోర్ట్ చేసిన మరికొన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. మార్చ్ 2024లో ఈ నిరసనలకు సంబంధించి స్థానిక ఛానల్స్ ప్రసారం చేసిన కథనం ఇక్కడ చూడొచ్చు . దీంట్లో కూడా వైరల్ వీడియోలో దృశ్యాలు మనం చూడొచ్చు .
కాగా మరింత వెతికే క్రమంలో జగన్నాథ్ యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించిన ఒక ఫేస్‌బుక్ పేజీ ఈ వీడియోకు సంబంధించి ఇచ్చిన వివరణ మాకు కనిపించింది. ఈ వివరణలో వీడియోలోని దృశ్యాలు పైన చెప్పినట్టు గతంలో యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి జరిగిన నిరసనలకు సంబంధించిందని స్పష్టం చేసారు. ఐతే ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఆందోనళకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారని, కానీ దాంట్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు.
అలాగే రూమర్ స్కానర్ అనే ఒక బంగ్లాదేశీ ఫాక్ట్-చెకింగ్ సంస్థ లోకల్ జర్నలిస్టులు మరియు వీడియోలోని విద్యార్థితో మాట్లాడి వీడియోకు ప్రస్తుతం జరుగుతున్న ఆందోనళకు ఎటువంటి సంబంధం లేదని ధ్రువీకరించింది.
చివరగా, గతంలో ఒక విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి జరిగిన నిరసనల వీడియోను ప్రస్తుత బంగ్లాదేశ్ ఆందోళనల్లో హిందూ మహిళలపై దాడి అంటూ షేర్ చేస్తున్నారు.