Fake News, Telugu
 

నాలుక వ్యాయామం అల్జీమర్స్‌ను నియంత్రించడంలో, నిరోధించడంలో సహాయపడుతుందని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

0

నాలుకను 10 సార్లు కుడివైపుకు, ఆపై ఎడమవైపుకు సాగదీయడం ద్వారా అల్జీమర్స్ రాకుండా మనలని మనం రక్షించుకోవచ్చు, అల్జీమర్స్‌ను నియంత్రించవచ్చు అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా నాలుక వ్యాయామం చేయడం వలన శరీర బరువు, హైపర్‌ టెన్షన్, మెదడులో రక్తం గడ్డకట్టడం, ఉబ్బసం, దూరదృష్టి, గొంతు ఇన్‌ఫెక్షన్, భుజం/మెడ ఇన్‌ఫెక్షన్, నిద్రలేమిని కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: నాలుక వ్యాయామం అల్జీమర్స్‌ను నియంత్రించడంలో, నిరోధించడంలో సహాయపడుతుంది.

ఫాక్ట్(నిజం): నాలుక వ్యాయామం అల్జీమర్స్‌ను నియంత్రించడంలో, నిరోధించడంలో సహాయపడుతుంది అని చెప్పే ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే, క్రమం తప్పకుండా శారీరక  వ్యాయామం చేయటం, సమతుల్య ఆహారం తీసుకుంటుండటం, శరీరపు బరువును అదుపులో ఉంచటం, ధూమపానానికి దూరంగా ఉండటం వంటి ఆరోగ్యకమైన జీవనవిధానం మెదడును ఆరోగ్యంగా ఉంచటానికి తోడ్పడుతుంది. కానీ, ఈ చర్యలు కూడా అల్జీమర్స్, డిమెన్షియా పూర్తిగా నిరోధించగలవని బలమైన ఆధారాలు లేవు. 2015లో ఫోర్బ్స్ తమ వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఒక రిపోర్ట్ ప్రకారం “తీవ్రమైన గాయాలు, లేదా వ్యాధుల తర్వాత మందగించిన మెదడు పనితీరు మెరుగుపరచడానికి, న్యూరల్ రీట్రైనింగ్ మరియు మెదడును ప్రేరేపించడానికి నాలుక ఒక మార్గం అని, మెదడు, నాలుక మధ్య  గొప్ప నరాల సంబంధం ఉందని కొన్ని వైద్య వెబ్‌సైట్‌లు పేర్కొన్నాయి.” అని తెలిపింది. అయితే, ఇది అల్జీమర్స్ వ్యాధికి ఎంతమేర పనిచేస్తుందని తెలియజేయలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా వైరల్ క్లెయిమ్‌ గురించి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, నాలుక వ్యాయామం అల్జీమర్స్‌ను నియంత్రించడంలో, నిరోధించడంలో సహాయపడుతుంది అని చెప్పే ఎలాంటి శాస్త్రీయమైన రిపోర్ట్స్ లభించలేదు.

ఈ క్రమంలోనే  మాకు ఫోర్బ్స్ 2015లో న్యూరోసైన్స్ పురోగతికి మీ నాలుక కీలకమా? అనే శీర్షికతో ప్రచురించిన ఒక రిపోర్ట్ లభించింది. ఈ రిపోర్ట్ ప్రకారం “తీవ్రమైన గాయాలు, లేదా వ్యాధుల తర్వాత మందగించిన మెదడు పనితీరు మెరుగుపరచడానికి, న్యూరల్ రీట్రైనింగ్ మరియు మెదడును ప్రేరేపించడానికి నాలుక ఒక మార్గం అని, మెదడు, నాలుక మధ్య  గొప్ప నరాల సంబంధం ఉందని కొన్ని వైద్య వెబ్‌సైట్‌లు పేర్కొన్నాయి.” అని తెలిపింది. అయితే ఇది అల్జీమర్స్ వ్యాధికి ఎంతమేర పనిచేస్తుందని తెలియజేయలేదు.

అల్జీమర్స్‌ అంటే ఏమిటి:

అమెరికాకి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ & హ్యూమన్ సైన్సెస్ ప్రకారం, అల్జీమర్స్ వ్యాధి అనేది కోలుకోలేని, క్రమంగా తీవ్రమయ్యే మెదడు రుగ్మత. ఇది నెమ్మదిగా జ్ఞాపకశక్తిని, ఆలోచనా నైపుణ్యాలను నాశనం చేస్తుంది. చివరికి సరళమైన పనులను చేయగల సామర్థ్యాన్ని కూడా మెదడుకు లేకుండా నాశనం చేస్తుంది.

అల్జీమర్స్‌ వ్యాధికి  కారణాలు: అమెరికాకి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ & హ్యూమన్ సైన్సెస్ ప్రకారం, శాస్త్రవేత్తలు చాలా మందిలో అల్జీమర్స్ వ్యాధికి కారణలు ఏమిటో ఇంకా పూర్తి స్థాయిలో కనుగొనలేదు. బహుశా జన్యు, పర్యావరణ, జీవనశైలి కారకాలతో పాటు మెదడులో వచ్చే వయస్సు-సంబంధిత మార్పుల కలయిక వలన వచ్చే అవకాశం ఉంది. అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని పెంచడంలో లేదా తగ్గించడంలో ఈ కారకాల్లో ఏదైనా ఒకదాని యొక్క ప్రాముఖ్యత వ్యక్తికి వ్యక్తికి భిన్నంగా ఉండవచ్చు అని పేర్కొన్నారు. వృద్ధాప్యం అల్జీమర్స్‌కు కారణం కాదు, అయితే ఇది వ్యాధికి అత్యంత ముఖ్యమైన ప్రమాద కారకం. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య 65 ఏళ్లు దాటిన ప్రతి 5 సంవత్సరాలకు రెట్టింపు అవుతుంది. 85 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులలో మూడింట ఒక వంతు మందికి అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, చాలా మంది వ్యక్తులు తమ 90 ఏళ్లు మరియు అంతకు మించి వయస్సులో కూడా అల్జీమర్స్  లేదా డిమెన్షియా (మెదడు పనితీరు పూర్తిగా మందగించడం) లేకుండా జీవిస్తున్నారు.

అల్జీమర్స్‌ వ్యాధి యొక్క లక్షణాలు:

మేయో క్లినిక్ రిపోర్ట్ ప్రకారం, జ్ఞాపకశక్తి కోల్పోవడం అల్జీమర్స్ వ్యాధికి ప్రధాన లక్షణం. ప్రారంభ దశలో ఇటీవలి సంఘటనలు లేదా సంభాషణలను గుర్తుంచుకోవడం కష్టంగా మారుతాయి. క్రమంగా జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. వ్యాధి అభివృద్ధి చెందుతున్నప్పుడు ఇతర లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. అల్జీమర్స్ వ్యాధి వలన బాధ పడే వ్యక్తి యొక్క జ్ఞాపకశక్తి క్రమంగా క్షీణిస్తు రోజువారీ చేసే పనులలో కూడా ప్రభావితం చేస్తుంది, ఉదాహరణకు పదే పదే ఒకే మాటలను పునరావృతం చేయడం, సంభాషణలు, అపాయింట్‌మెంట్‌లు లేదా ఈవెంట్‌లను మర్చిపోవడం, బాగా తెలిసిన ప్రదేశాలలో కూడా తప్పిపోవడం, వారి భావాలను వ్యక్తపరచడంలో మరియు ఇతరులతో మాట్లాడంలో కూడా ఇబ్బంది పడుతారు. చివరికి కుటుంబ సభ్యుల పేర్లను, రోజు ఉపయోగించే నిత్యావసర వస్తువుల పేర్లను కూడా మర్చిపోతారు. అల్జీమర్స్ వ్యాధి వలన రోజువారి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యం తగిపోతుంది. చివరికి, క్రమంగా అల్జీమర్స్ వ్యాధి చివరి దశలో ఉన్నవారు దుస్తులు ధరించడం, స్నానం చేయడం వంటి ప్రాథమిక పనులను ఎలా చేయాలో కూడా మర్చిపోతారు. డిప్రెషన్ , రోజువారి కార్యకలాపాలపై ఆసక్తి కోల్పోవడం, మానసిక కల్లోలం, ఇతరులపై అపనమ్మకం, కోపం లేదా దూకుడు స్వభావం కలిగి ఉండటం, నిద్ర అలవాట్లలో మార్పులు మొదలైనవి అల్జీమర్స్‌ వ్యాధి కొన్ని లక్షణాలు.

అల్జీమర్స్‌ వ్యాధికి చికిత్స:

అల్జీమర్స్‌కు ప్రస్తుతం ఎటువంటి చికిత్స లేనప్పటికీ, అల్జీమర్స్‌ ఉన్న వ్యక్తులో సాధారణంగా కనిపించే ఇతర జబ్బులైన నిద్రలేమి, నిరాశ, ఆందోళన, ఇతర ప్రవర్తన, మానసిక లక్షణాలలో తేడాలకు యాంటిడిప్రెసెంట్స్, యాంటిసైకోటిక్స్ మరియు యాంటీ-యాంగ్జైటీ డ్రగ్స్ ఉపయోగించి చికత్స అందించవచ్చు. తద్వారా అల్జీమర్స్ ఉన్నవారికి కొంత ఉపశమనం లభిస్తుంది, వారి సంరక్షకులకు కూడా సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. కొంతమంది వ్యక్తులలో జ్ఞాపకశక్తి, ఆలోచనా నైపుణ్యాలను తాత్కాలికంగా మెరుగుపరచడం లేదా స్థిరీకరించడం  కోసం సహాయపడే మందులు కూడా ఉన్నాయి అని పలు పరిశోధనలు తెలుపుతున్నాయి. వ్యాధి ప్రారంభంలో గుర్తించినపుడు మందులు, కుటుంబసభ్యుల సేవలు సహకారం వల్ల అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు పెరగటాన్ని, జీవననాణ్యత దిగజారిపోవటాన్ని అదుపుచేయవచ్చు. ఈ వ్యాధికి సంబంధించి ప్రస్తుతం రెండు రకాల మందులు అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. కోలినెట్రేస్ ఇనిహిబిటర్స్, మెమంటైన్ అనే ఈ రెండు జనరిక్ మందులకు అమెరికా లోని ఎఫ్.డి.ఎ. ఆమోదం  లభించింది. జ్ఞాపకశక్తి క్షీణించటం, తికమకపడటం, హేతుబద్దంగా ఆలోచించలేకపోవటం వంటి అల్జీమర్స్ వ్యాధి లక్షణాలలో కొన్నింటిని అదుపుచేసేందుకు వీటిని సిఫార్సు చేస్తున్నారు. అల్జీమర్స్ వ్యాధిని తగ్గించే చికిత్సలేవీ ప్రస్తుతం అందుబాటులోకి రాలేదు.

అయితే క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయటం, సమతుల్య ఆహారం తీసుకుంటుండటం, శరీరపు బరువును అదుపులో ఉంచటం, ధూమపానానికి దూరంగా ఉండటం వంటి ఆరోగ్యకమైన జీవనవిధానం మెదడును ఆరోగ్యంగా ఉంచటానికి తోడ్పడుతుంది. అల్జీమర్స్  వ్యాధితో సంబంధం పెంచుకుంటాయని భావిస్తున్న గుండె జబ్బులు, డయాబెటిస్ రాకుండా సాయపడుతుంది. చురుకైన సామాజిక సంబంధాలు కొనసాగించటంవల్ల  మెదడులోని నాడీకణాల మధ్య సంబంధాలను బలపడి మెదడు చురుకుగా పనిచేస్తుంటుంది. ఇది వ్యక్తి ఆలోచనా శక్తి దెబ్బదినకుండా ఉండటానికి తోడ్పడుతుంది. కానీ, ఈ చర్యలు కూడా అల్జీమర్స్, డిమెన్షియా పూర్తిగా నిరోధించగలవని చెప్పడానికి బలమైన ఆధారాలు లేవు. అయినప్పటికీ, మనము ఆరోగ్యవంతమైన జీవిత విధానాలు అవలంబించడం, శారీరకంగా మరియు మానసిక వ్యాయామాలను అభ్యసించడం ఉత్తమం. అల్జీమర్స్ వ్యాధికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

చివరగా, నాలుక వ్యాయామం అల్జీమర్స్‌ను నియంత్రించడంలో, నిరోధించడంలో సహాయపడుతుంది అని చెప్పే ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll