ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు టాటా మరియు డిఫెన్సు రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సంస్థలు నీటితో నడిచే బస్సుని తయారు చేస్తున్నారు, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. నరేంద్ర మోదీ సంకల్పం మేరకు DRDO మరియు టాటా సంస్థలు నీటి నుండి హైడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేసి, ఆ ఇంధనం వలన నడిచే వాహనాలను తయారుచేస్తున్నారని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. నీటి నుంచి తయారు చేస్తున్నందున ఈ ఇంధనం చాలా చవకగా దొరుకుతుందని, కాలుష్యం కూడా ఉండదని ఈ పోస్టులో తెలుపుతున్నారు. 2025 కల్లా దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ వాడకం ఉండకూడదనే లక్ష్యంతో, హైడ్రోజన్ ఇంధనాన్ని తయారుచేయటానికి మోదీ ప్రభుత్వం ఇప్పటికే బ్లూప్రింట్ తయారుచేసిందని, 2030 నాటికి 50 లక్షల మెట్రీక్ టన్నుల హైడ్రోజన్ ఇందనాన్ని తయారుచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఈ పోస్టులో తీలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు టాటా మరియు డిఫెన్సు రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సంస్థలు నీటితో నడిచే బస్సుని తయారు చేస్తున్నాయి.
ఫాక్ట్ (నిజం): హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాలు హైడ్రోజన్ మరియు గాలిని ఉపయోగించి వాహనానికి కావాలిసిన విద్యుత్తుని ఉత్పత్తి చేస్తాయి. ఈ వాహనాలలో ఫ్యూయల్ సెల్స్‌కి అందించే హైడ్రోజన్ ఇంధనాన్ని న్యాచురల్ గ్యాస్ రెఫార్మింగ్, ఎలెక్ట్రోలైసిస్, బయోమాస్ ఫేరమెంటేషన్ మరియు రెన్యువబుల్ లిక్విడ్ రీఫార్మింగ్ పద్దతులలో ఉత్పత్తి చేస్తారు. రెన్యువబుల్ విద్యుత్తు (సోలార్ లేదా విండ్ మిల్స్ ద్వారా రూపొందించే విద్యుత్తు), నీరు, మరియు ఆక్సిజన్‌ను ఉపయోగించి ఎలెక్ట్రోలైసిస్ పద్దతిలో ఉత్పత్తి చేసే హైడ్రోజన్ ఇంధనాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. 04 జనవరి 2023 నాడు కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా 2030 నాటికి 5 మిల్లియన్ల (50,00,000) మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేయడం లక్ష్యమని తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగించి రూపొందించిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనమేది టాటా మరియు డీఆర్‌డీవో సంస్థలు ఇప్పటివరకు విడుదల చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాలు ఎలా పనిచేస్తాయి:
ఫ్యూయల్ సెల్ ఎలెక్ట్రిక్ వాహనాలు (FCEV) ఫ్యూయల్ సెల్ ఉత్పత్తి చేసే విధ్యుత్తుని ఉపయోగించి పనిచేస్తాయి. ఈ వాహనాలలో అమర్చిన ప్రత్యేక ట్యాంకులోని హైడ్రోజన్ ఇంధనాన్ని, చుట్టుపక్కల గాలి నుండి లభించే డయాక్సిజన్ (O2) వాయువు ఫ్యూయల్ సెల్‌కి సరఫరా అవుతుంది. ఫ్యూయల్ సెల్‌లో ఈ రెండు వాయువుల మధ్య ఎలెక్ట్రోకెమికల్ రియాక్షన్ జరిగి వాహనం పనిచేయడానికి కావాలిసిన విధ్యుత్తుని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలెక్ట్రోకెమికల్ రియాక్షన్ ద్వారా ఉత్పత్తి అయ్యే నీరు ఆవిరిని (H2O) వాహనం కింద ఒక ఎమిషన్ పైప్ ద్వారా బయటకి వదులుతుంది.
హైడ్రోజన్ ఉత్పత్తి చేసే పద్దతి:
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాలలో ఫ్యూయల్ సెల్స్‌కి అందించే హైడ్రోజన్ ఇంధనాన్ని న్యాచురల్ గ్యాస్ రీఫార్మింగ్, ఎలెక్ట్రోలైసిస్, బైయోమాస్ ఫేరమెంటేషన్ మరియు రెన్యువబుల్ లిక్విడ్ రీఫార్మింగ్ పద్దతులలో ఉత్పత్తి చేస్తారు. ప్రస్తుతం చాలా వరకు హైడ్రోజన్ వాహనాలు గ్యాస్ రూపంలో ఉన్న హైడ్రోజన్ ఇంధనాన్ని కంప్రెసర్ ట్యాంకులలో స్టోర్ చేసి ఉపయోగిస్తున్నారు. ఎలెక్ట్రోలైసిస్ పద్దతిలో విద్యుత్తు, నీరు మరియు ఆక్సిజన్ ఉపయోగించి హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేయవచ్చు. కానీ, ప్రస్తుతం హైడ్రోజన్ ఉత్పత్తి కోసం న్యాచురల్ గ్యాస్ రీఫార్మింగ్ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారని పలు రిసెర్చ్ స్టడీస్ తెలిపాయి.
నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్:
రెన్యువబుల్ విద్యుత్తు (సోలార్ లేదా విండ్ మిల్స్ ద్వారా రూపొందించే విద్యుత్తు), నీరు, మరియు ఆక్సిజన్‌ను ఉపయోగించి ఎలెక్ట్రోలైసిస్ పద్దతిలో ఉత్పత్తి చేసే హైడ్రోజన్‌ని ఇంధనాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. 04 జనవరి 2023 నాడు కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా 2030 నాటికి 5 మిల్లియన్ల (50,00,000) మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేయడం లక్ష్యమని తెలిపారు. విద్యుత్ ఇంధన మిశ్రమంలో ఎంత ఎక్కువ రెన్యువబుల్ ఎనర్జీ ఉంటే అంతా ఎక్కువ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి జరుగుతుంది. కేవలం, నీరుని ఉపయోగించి మాత్రమే ఈ హైడ్రోజన్ ఇంధనాన్ని తయారుచేయారు.
నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా టాటా మరియు DRDO కలిసి గ్రీన్ హైడ్రోజన్ వాహనాలను తయారుచేసినట్టు ఎక్కడా రిపోర్ట్ కాలేదు. ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)తో కలిసి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సులను నిర్మించడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు టాటా మోటార్స్ ఒక ప్రెస్ రిలీజ్‌లో తెలిపింది. టాటా మోటార్స్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాలకు సంబంధించి తాము ప్రభుత్వంతో కూడా పనిచేస్తున్నట్టు టాటా మోటార్స్ తెలిపింది. 2022 ఏప్రిల్ నెలలో టాటా మోటార్స్ రూపొందించిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాల రోడ్ ట్రాయిల్స్‌కు ప్రభుత్వం అంగీకారం కూడా తెలిపింది. గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగించి రూపొందించిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనమేది టాటా మరియు DRDO సంస్థలు ఇప్పటివరకు విడుదల చేయలేదు.
2022 ఆగస్టు నెలలో KPIT-CSIR రూపొందించిన మొట్టమొదట పూర్తి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సుని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వ హయాంలో టాటా మోటార్స్, ఇస్రోతో కలిసి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాన్ని రూపొందించారు.
అంతే కాదు, 2025 కల్లా పెట్రోల్, డీజిల్ వాడకమే ఉండకూడదని ‘నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్’ లో ఎక్కడా లేదు.
చివరగా, గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగించి రూపొందించిన ఫ్యూయల్ సెల్ ఎలెక్ట్రిక్ వాహనమేది టాటా మరియు DRDO సంస్థలు విడుదల చేయలేదు.