Fake News, Telugu
 

రాష్ట్రపతి భవన్‌లో ఉన్న ‘మొఘల్ గార్డెన్స్’ పేరుని ‘రాజేంద్ర ప్రసాద్ గార్డెన్స్’ గా భారత ప్రభుత్వం మార్చలేదు

0

Update (30 January 2023):

28 జనవరి 2023న రాష్ట్రపతి భవన్ జారీ చేసిన ప్రెస్ రిలీజ్ ప్రకారం, రాష్ట్రపతి భవన్‌లో ఉన్న మొఘల్ గార్డెన్స్ (ఈస్ట్ లాన్, సెంట్రల్ లాన్, లాంగ్ గార్డెన్ మరియు సర్క్యులర్ గార్డెన్), హెర్బల్ గార్డెన్, బోన్సాయి గార్డెన్ తదితర తోటలన్నిటినీ కలిపి ‘అమృత్ ఉద్యాన్’ అనే పేరుతో పిలవాలని రాష్ట్రపతి ద్రౌపది ప్రతిపాదించారు. అయితే, రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్‌సైట్లో కూడా వీటిని ‘అమృత్ ఉద్యాన్’ అనే పేరుతో పిలుస్తున్నారు. అలాగే, ఈ నిర్ణయం తరువాత ‘మొఘల్ గార్డెన్స్’ అని ఉన్న బోర్డులను ‘అమృత్ ఉద్యాన్’ గా మార్చారు

Published (14 October 2022):

రాష్ట్రపతి భవన్‌లో ఉన్న ‘మొఘల్ గార్డెన్స్’ పేరుని ‘రాజేంద్ర ప్రసాద్ గార్డెన్స్’ గా  భారత ప్రభుత్వం మార్చింది అని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: రాష్ట్రపతి భవన్‌లో ఉన్న ‘మొఘల్ గార్డెన్స్’ పేరుని ‘రాజేంద్ర ప్రసాద్ గార్డెన్స్’ గా భారత ప్రభుత్వం మార్చింది.

ఫాక్ట్: ‘మొఘల్ గార్డెన్స్’ పేరుని మారుస్తున్నట్లు ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. ఇది రిపోర్ట్ చేసిన వార్తా కథనాలు కూడా లభించలేదు. ఇదే ప్రచారం 2020లో కూడా జరిగినప్పుడు PIB వారు ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకోలేదు అని, ఇది తప్పుడు ప్రచారం అని స్పష్టం చేశారు. అంతే కాదు, రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్‌సైటులో ‘మొఘల్ గార్డెన్స్’ అనే పేరుతోనే ప్రస్తావిస్తున్నారు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు

ముందుగా ఈ విషయం గురించి ఇంటర్నెట్లో వెతకగా ఎక్కడా కూడా సంబంధిత వార్తా కథనాలు లభించలేదు. రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్‌సైటులో కూడా పేరు మార్పు గురించి ఎటువంటి సమాచారం లేదు. పైగా, ఈ వెబ్‌సైటులో దీనిని ‘మొఘల్ గార్డెన్స్’ అనే పేరుతోనే ప్రస్తావిస్తున్నారు.

మొఘల్ గార్డెన్స్ పేరు మారిందనే పుకార్లు 2020 నుంచి వ్యాప్తి చెందుతున్నాయి. అయితే, అప్పుడు Press Information Bureau (PIB) వారు ఈ ప్రచారంలో ఎంత మాత్రము నిజం లేదని, ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకోలేదు అని స్పష్టం చేశారు.

అయితే, ‘Times Of India’ కథనం ప్రకారం 2019లో హిందూ మహాసభకు చెందిన స్వామి చక్రపాణి ‘మొఘల్ గార్డెన్స్’ పేరును ‘ రాజేంద్ర ప్రసాద్ గార్డెన్స్’ గా మార్చాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

చివరిగా, రాష్ట్రపతి భవన్‌లో ఉన్న ‘మొఘల్ గార్డెన్స్’ పేరుని ‘రాజేంద్ర ప్రసాద్ గార్డెన్స్’ గా భారత ప్రభుత్వం మార్చలేదు; ఇది అసత్య ప్రచారం.

Share.

About Author

Comments are closed.

scroll