Fake News, Telugu
 

ఈ వీడియోలో అయ్యప్ప భక్తులు దాడి చేసింది భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేష్‌పై కాదు

0

భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేష్ ఇటీవల అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు పరిగెత్తించి కొట్టారు అని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేష్‌ను అయ్యప్ప భక్తులు కొడుతున్న వీడియో.

ఫాక్ట్: ఈ వీడియోలో దాడికి గురి అయినది బైరి నరేష్ కాదు. డిసెంబర్ 30న కోస్గిలో జరిగిన ఈ దాడిలో గాయ పడింది బొర్రా బాలరాజు అనే వ్యక్తి. కోస్గిలోని శివాజీ చౌక్ దగ్గర నరేష్‌కు వ్యతిరేకంగా అయ్యప్ప స్వాములు ధర్నా చేస్తున్న సమయంలో, కొందరు వ్యక్తులు అక్కడే ఉన్న బాలరాజును నరేష్ వర్గీయుడని భావించి దాడి చేశారు. అయితే తాను నరేష్ వర్గంతో తిరగనని బాలరాజు చెప్పాడు. ఈ ఘటన పైన కోస్గి పోలీస్ స్టేషన్లో బాలరాజు ఫిర్యాదు ఇవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.  

ముందుగా, ఇదే విషయం గురించి ఇంటర్నెట్లో వెతకగా వికారాబాద్ ఎస్పీ కోటి రెడ్డి డిసెంబర్ 30న TV9 తో మాట్లాడుతూ, కోస్గి పట్టణంలో దాడి జరిగింది నరేష్ పైన కాదు అని, నరేష్ ఆచూకీ కోసం ఇంకా గాలిస్తున్నాం అని స్పష్టం చేశారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు అనగా 31 డిసెంబర్ 2022న వరంగల్‌లో నరేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక దాడిలో గాయపడిన వ్యక్తి పేరు ‘బాలరాజు’ అని పలు వార్తా కథనాలు తెలిపాయి. కోస్గిలోని శివాజీ చౌక్ దగ్గర నరేష్‌కు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న అయ్యప్ప భక్తులు బాలరాజును నరేష్ వర్గీయుడుగా భావించి అతను ధర్నా వీడియోలు తీశాడు అని అతని పైన దాడి చేశారు. అయితే పోలీసులు బాలరాజును రక్షించి పోలిసే స్టేషన్‌కు తరలించారు. తాను నరేష్ వర్గంతో తిరగను అని, వీడియో తీయలేదు అని నరేష్ చెప్పినట్లు వివిధ వార్తా పత్రికలు పేర్కొన్నాయి. వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఇక తన పైన కొందరు వ్యక్తులు దాడి చేసి దుర్భాషలాడారని చెప్తూ కోస్గి పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చాడు. FIR కాపీని ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, కోస్గిలో అయ్యప్ప భక్తులు దాడి చేసింది భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేష్ పైన కాదు.  

Share.

About Author

Comments are closed.

scroll