Fake News, Telugu
 

ఇండియా సర్వీస్ మెడల్ పై ముద్రించింది అఖండ భారత్ మ్యాప్ కాదు, కేవలం బ్రిటిష్ నియంత్రణలో ఉన్న భూభాగం మాత్రమే

0

బ్రిటిష్ వారి హయాంలో పాకిస్తాన్‌తో కూడిన అఖండ భారత మ్యాప్‌ని ముద్రించిన ఒక పతకం ఆధారంగా బ్రిటిష్ ప్రభుత్వం కూడా అఖండ భారతాన్ని గుర్తించిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: పాకిస్తాన్‌తో కూడిన అఖండ భారత మ్యాప్‌ని ముద్రించిన బ్రిటిష్ పతకం.

ఫాక్ట్(నిజం): ఇది ఇండియా సర్వీస్ మెడల్, 1939-45 మధ్య జరిగిన రెండోవ ప్రపంచ యుద్ద సమయంలో భారత్‌లో గాని లేక ఇతర ప్రాంతాలలో గాని నాన్-ఆపరేషనల్ విభాగాలలో సేవలందించిన భారత సైనికులకు దీనిని అందించారు. ఐతే బ్రిటిష్ ప్రభుత్వం కేవలం బ్రిటిష్ నియంత్రణలో ఉన్న భూభాగాన్ని సూచించడానికి చిహ్నంగా మాత్రమే పతకంపై ఈ మ్యాప్‌ని ముద్రించిందే తప్ప అఖండ భారతాన్ని గుర్తిస్తూ కాదు. సాధారణంగా ఆర్‌ఎస్‌ఎస్ (RSS), దాని అనుబంధ సంస్థలు క్లెయిమ్ చేసే అఖండ భారత మ్యాప్‌లో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌, టిబెట్ మరియు మయన్మార్‌లను కలిపి ఒకే భూభాగంగా (అఖండ భారత్) చూపిస్తుంటారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇది ఇండియా సర్వీస్ మెడల్, 1939-45 మధ్య జరిగిన రెండోవ ప్రపంచ యుద్ద సమయంలో భారత్‌లో గాని లేక ఇతర ప్రాంతాలలో నాన్-ఆపరేషనల్ విభాగాలలో సేవలందించిన భారత సైనికులకు ఈ మెడల్‌ని అందించారు. ఈ పతకంపై ఒక వైపు కిరీటాన్ని ధరించిన కింగ్ జార్జ్ VI ముఖం ముద్రించి, చుట్టూ ‘GEORGIVS VI D : G :BR : OMN : REX ET INDIAE IMP’ అని రాసి ఉంటుంది. మరోవైపు పాకిస్తాన్‌తో కూడిన భారత మ్యాప్ ముద్రించి, పైన INDIA అని కింద 1939 – 45 అని రాసి ఉంటుంది. ఈ పతకానికి సంబంధించిన సమాచారం ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఐతే బ్రిటిష్ ప్రభుత్వం కేవలం బ్రిటిష్ నియంత్రణలో ఉన్న భూభాగాన్ని సూచించడానికి చిహ్నంగా మాత్రమే పతకంపై ఈ మ్యాప్‌ని ముద్రించిందే తప్ప అఖండ భారతాన్ని గుర్తిస్తూ కాదు. పైగా అప్పటికింకా దేశ విభజన జరగలేదు, అందుకే పాకిస్తాన్‌ని ఇదే మ్యాప్‌లో చూపించారు.

పైగా ఆర్‌ఎస్‌ఎస్ (RSS), దాని అనుబంధ సంస్థలు క్లెయిమ్ చేసే అఖండ భారత మ్యాప్‌కి పోస్టులోని మ్యాప్‌కి చాలా వ్యత్యాసం ఉంది. సాధారణంగా ఈ సంస్థలు ప్రచురించే అఖండ భారత మ్యాప్‌లో  భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌, టిబెట్ మరియు మయన్మార్‌లను కలిపి ఒకే భూభాగంగా (అఖండ భారత్) చూపిస్తుంటారు. నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న అఖండ భారత మ్యాప్‌లో కూడా ఇదే విధంగా ఉంటుందని ఈ కథనాల (ఇక్కడ మరియు ఇక్కడ) ద్వారా తెలుస్తుంది.

ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నడిచే సురుచి ప్రకాశన్ అనే ప్రచురణ సంస్థ ‘పుణ్యభూమి భారత్’ అనే మ్యాప్‌ని విడుదల చేసింది. హిమాలయాలకు దక్షిణాన మరియు హిందూ మహాసముద్రానికి ఉత్తరాన ఉన్నదంతా భారత దేశమేనని ఈ మ్యాప్ ద్వారా స్పష్టం చేసారు. ఈ మ్యాప్‌లో కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌, టిబెట్ మరియు మయన్మార్ లని కలిపి ఒకే భూభాగంగా చూపించారు.

పైగా ఈ మ్యాప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ‘ఉపగనాథన్’, కాబూల్‌ను ‘కుభా నగర్’, పెషావర్‌ను ‘పురుషపూర్’, ముల్తాన్‌ను ‘మూల్స్తాన్’, టిబెట్ ను ‘త్రివిష్టప్’, శ్రీలంకను ‘సింగల్‌వీప్’ మరియు మయన్మార్‌ను ‘బ్రహ్మదేశ్’ అని సంభోదించారు. ఇటీవల ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి అయిన పుష్కర్ సింగ్ ధామి అఖండ భారత్ పేరుతో షేర్ చేసిన ఒక మ్యాప్‌పై వివాదం చెలరేగింది, ఈ మ్యాప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ నుండి మయన్మార్, చాలా వరకు చైనా భూభాగాన్ని కూడా అఖండ భారత్‌గానే పరిగణించారు. వీటన్నిటి ఆధారంగా వైరల్ అయిన పతకంపై ఉన్న మ్యాప్ అఖండ భారతానిది కాదని, రెండింటికి చాలా వ్యత్యాసం ఉందని స్పష్టమవుతుంది.

చివరగా, ఇండియా సర్వీస్ మెడల్ పై ముద్రించింది అఖండ భారత్ మ్యాప్ కాదు, కేవలం బ్రిటిష్ నియంత్రణలో ఉన్న భూభాగం మాత్రమే.

Share.

About Author

Comments are closed.

scroll