Fake News, Telugu
 

ఈ ఫోటోలలో కనిపిస్తున్న JNU విద్యార్ధులు శ్రీ రామ నవమి నాడు జరిగిన ఘర్షణలో నిజంగానే గాయపడ్డారు

0

శ్రీ రామ నవమి నాడు జవహర్‌లాల్ నెహ్రు విశ్వవిద్యాలయంలో (JNU) జరిగిన ఘర్షణలో వామపక్ష భావజాల విద్యార్ధులు గాయపడిన బాధితులుగా నటిస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో రెండు ఫోటోలతో కూడిన ఒక పోస్టు షేర్ అవుతుంది. JNU కావేరి హాస్టల్లో శ్రీ రామనవమి రోజున మాంసాహార భోజనం తయారు చేయడానికి సంబంధించి, రామనవమి పుజకు ఆటంకం కలిగించారని చెప్తూ ABVP, వామపక్ష విద్యార్ధుల మధ్య వాగ్వాదం చెలరేగి గొడవకు దారితీసింది. ఈ ఘర్షణలో 15 మందికి పైగా విద్యార్ధులు గాయపడిన నేపథ్యంలో, ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.    

క్లెయిమ్: శ్రీ రామనవమి నాడు జరిగిన ఘర్షణలో JNU విద్యార్ధులు గాయాలైనట్టు నటిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ రెండు ఫోటోల మధ్య ఆరు నిమిషాల వ్యవధి ఉంది. నీలిరంగు దుస్తులు ధరించిన మహిళ అపస్మారక స్థితిలో పడి ఉన్న ఫోటోని రాత్రి 8:15 గంటలకు తీసారు. ఆ తరువాత జరిగిన రాళ్ల దాడిలో గాయాలపాలైన మరొక మహిళ ఫోటోని రాత్రి 8:21 గంటలకు తీసారు. సోషల్ మీడియాలో తన ఫోటోల గురించి జరుగుతున్న అసత్య ప్రచారాల గురించి మధురిమ కుండు ట్వీట్ ద్వారా స్పష్టత కూడా ఇచ్చింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో షేర్ చేసిన ఫోటోలని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలతో పోలి ఉన్న ఫోటోలని షేర్ చేస్తూ ‘ది వైర్’ వార్తా సంస్థ 11 ఏప్రిల్ 2022 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. జవహర్‌లాల్ నెహ్రు విశ్వవిద్యాలయంలో శ్రీ రామనవమి పండగ రోజు మాంసాహార భోజనం తయారుచేయడానికి సంబంధించి ABVP, వామపక్ష విద్యార్ధుల మధ్య గొడవ జరిగినట్టు ఈ ఆర్టికల్‌లో తెలిపారు. ఈ ఘర్షణకు సంబంధించి ఢిల్లీ పోలీసులు కొందరు ABVP విద్యార్ధుల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్టు తెలిసింది. అయితే, యూనివర్సిటీలో చదువుకుంటున్న వామపక్ష భావజాల విద్యార్ధులు, రామనవమి పుజకు ఆటంకం కలిగించారని ABVP విద్యార్ధులు కూడా ఆరోపించారు.

‘NDTV’ వార్తా సంస్థ రిపోర్ట్ ప్రకారం ఈ ఫోటోలలో రక్తమోడుతున్న మహిళ పేరు ‘అఖ్తరిస్తా అన్సారి’ అని తెలిపారు. అఖ్తరిస్తా అన్సారి తను ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు 11 ఏప్రిల్ 2022 నాడు ట్వీట్ పెట్టింది. సిపిఐ (ఎంఎల్) నాయకురాలు కవితా కృష్ణన్ ట్వీట్ ఆధారంగా ఈ ఫోటోలలో నీలి రంగు దుస్తులు ధరించిన మహిళ పేరు మధురిమ కుండు అని తెలుసుకోగలిగాము.

JNUలో ఘర్షణ జరుగుతున్న సమయంలో తీసిన తమ ఫోటోలని సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని మధురిమ కుండు 11 ఏప్రిల్ 2022 నాడు ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న తమ రెండు ఫోటోలు ఆరు నిమిషాల వ్యవధిలో తీసినట్టు మధురిమ స్పష్టం చేసింది. “గాయపడిన తరువాత వెంటనే నేను స్పృహ కోల్పోయాను. నేను వెంటనే కోలుకొని బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అఖ్తరిస్తాకు ఒక పెద్ద రాయి తగిలింది.”, అని మధురిమ కుండు తన ట్వీట్లో స్పష్టం చేసింది. ఈ ఫొటోలకి సంబంధించిన మెటా డేటా ప్రకారం కూడా ఈ ఫోటోలు ఏ సమయంలో తీశారు అన్నది స్పష్టమయింది.

చివరగా, ఈ ఫోటోలలో కనిపిస్తున్న JNU విద్యార్ధులు శ్రీ రామ నవమి రోజు జరిగిన ఘర్షణలో నిజంగానే గాయపడ్డారు; ఇవి నకిలీ గాయాలు కాదు.

Share.

About Author

Comments are closed.

scroll