Fake News, Telugu
 

2019లో జరిగిన వీధి నాటకాన్ని అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్‌లు అక్కడి పౌరులను చంపుతున్న వీడియో అని అంటున్నారు

0

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్‌లు అక్కడి పౌరులను ఈ విధంగా చంపుతున్నారని చెబుతూ ఒక వీడియోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్‌లు అక్కడి పౌరులను చంపుతున్న వీడియో.

ఫాక్ట్: అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్‌లు అక్కడి పౌరులను చంపుతున్న ఈ వీడియో 2019లో చేసిన ఒక వీధి నాటకం, నిజంగా జరిగింది కాదు. మైదాన్ వార్డక్ ప్రావిన్స్‌లోని జల్రిజ్‌లో తాలిబాన్ల దురాగతాలపై అవగాహన పెంచడానికి కళాకారుల బృందం కాబుల్‌లో నిరహించిన వీధి నాటకం ఇది. అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్‌లు అక్కడి పౌరులను హింసిస్తున్నారని చాలా న్యూస్ రిపోర్ట్స్ ఉన్నాయి, కానీ ఈ వీడియో ఇప్పుడిది కాదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వీడియోను పరిశీలించినట్లయితే వీడియో యొక్క ఎగువ-ఎడమ భాగంలో ఒక లోగో చూడొచ్చు. ఆ లోగోను ఇంగ్లీషులోకి అనువదిస్తే ‘Afghan International’ అని మనకు తెలుస్తుంది. ‘Afghan International’ అని యూట్యూబ్‌లో వేతకగా, అదే విజువల్స్‌తో వారు 25 సెప్టెంబర్ 2019న అప్లోడ్ చేసిన వీడియో చూడొచ్చు. యూట్యూబ్‌లోని వీడియోను 1:20 టైం స్టాంప్ దెగ్గర క్లిప్ చేసి, పోస్ట్ ద్వారా వైరల్ చేస్తున్నట్టు చూడొచ్చు.

యూట్యూబ్‌లోని వీడియో యొక్క వివరణలో, (ఇంగ్లీష్ అనువాదం) ‘How the Taliban group closes the passengers in Jalriz! See more of the allegory of artists being beaten by the Taliban in Jalriz in the video.’ తాలిబాన్ జల్రిజ్‌లో ఇలా చేసి ఉండేదని ఒక నాటకంలా చూపించారని వివరణ ద్వారా తెలుస్తుంది.

వీడియోలో కెమెరాలు, కళాకారులు మైక్‌లను ఉపయోగించడాన్ని గమనించవచ్చు, దీని ద్వారా అది నిజమైన సంఘటన కాదని స్పష్టం అవుతుంది.

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, వీడియోలోని ఒక స్క్రీన్‌షాట్‌తో ఉన్న ఆర్టికల్ లభించింది. అఫ్గానిస్తాన్‌లోని మైదాన్ వార్డక్ ప్రావిన్స్‌లోని జల్రిజ్‌లో తాలిబాన్ల దురాగతాలపై అవగాహన పెంచడానికి కళాకారుల బృందం కాబుల్‌లో వీధి నాటకం నిర్వహించింది. ఇది ఒక ‘symbolic movement’ అని ఫోటో కాప్షన్‌గా ఉన్నట్టు ఆర్టికల్‌లో చూడొచ్చు.

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్‌లు అక్కడి పౌరులను హింసిస్తున్నారని చాలా న్యూస్ రిపోర్ట్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి న్యూస్ ఆర్టికల్స్ ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. కానీ, వీడియోలో చూపిస్తున్నది వీధి నాటకం మాత్రమే, నిజంగా జరిగింది కాదు.

చివరగా, 2019లో జరిగిన వీధి నాటకాన్ని పట్టుకొని అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్‌లు అక్కడి పౌరులను చంపుతున్న వీడియో అని అంటున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll