Fake News, Telugu
 

ఒక వ్యక్తి పెట్రోల్ పంపుకు నిప్పంటిస్తున్న ఈ వీడియోలోని ఘటన భారతదేశానికి సంబంధించింది కాదు

0

పెరుగుతున్న పెట్రోల్ ధరలపై కోపంతో హర్యానా రాష్ట్రంలో ఒక వ్యక్తి పెట్రోల్ పంపుకు నిప్పంటించాడని చెప్తూ, ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: పెరుగుతున్న పెట్రోల్ ధరలపై కోపంతో హర్యానా రాష్ట్రంలో ఒక వ్యక్తి పెట్రోల్ పంపుకు నిప్పంటిస్తున్న వీడియో.

ఫాక్ట్: వీడియోలోని ఘటన భారతదేశానికి సంబంధించింది కాదు. అది ఇరాన్ దేశంలో జరిగిన ఘటన. పెట్రోల్ పంపుకు చెందిన వారితో వ్యక్తిగత గొడవ వల్ల వీడియోలోని వ్యక్తి పెట్రోల్ పంపుకు నిప్పంటించాడని తెలిసింది. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లోని వీడియో యొక్క స్క్రీన్‌షాట్స్‌ని రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేసి వెతకగా, ఆ వీడియో యొక్క మెరుగైన వెర్షన్ సెర్చ్ రిజల్ట్స్‌లో వస్తుంది. పోస్ట్‌లోని వీడియో తిప్పి ఉన్నట్టు తెలుస్తుంది. సెర్చ్ రిజల్ట్స్‌లో వచ్చిన వీడియోలో కార్లు రోడ్డుకి కుడి వైపు డ్రైవ్ చేస్తూ వెళ్తున్నట్టు చూడవొచ్చు. కానీ, భారత దేశంలో రోడ్డుకి ఎడమ వైపు డ్రైవ్ చేస్తారు. అంతేకాదు, వీడియోలో ఒక బోర్డుపై వేరే ఏదో బాషలో రాసి ఉన్నట్టు గమనించవొచ్చు.    

రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేసినప్పుడు సెర్చ్ రిజల్ట్స్‌లో కొన్ని పెర్షియన్ వెబ్‌సైట్ల లింక్స్ వచ్చాయి. పెర్షియన్ బాష ముఖ్యంగా ఇరాన్ దేశంలో వాడతారు. వీడియోలోని బైక్ నెంబర్ ప్లేట్ కూడా ఇరాన్ దేశంలో బైక్లకు ఉండే నెంబర్ ప్లేట్ డిజైన్‌లానే ఉంది.

వేరే ఏదో బాషతో రాసి ఉన్న బోర్డు గురించి ఇరాన్‌కి చెందిన ఒక ఫ్యాక్ట్-చెకింగ్ సంస్థతో ‘బూమ్ లైవ్ ’ వారు మాట్లాడగా, దాని మీద ఇరాన్‌లోని రాఫ్సంజన్ ప్రాంతానికి చెందిన ఒక కార్పెట్ కంపెనీ పేరు ఉందని వారు తెలిపినట్టు తెలిసింది. రాఫ్సంజన్‌లోని ఒక పెట్రోల్ పంపుకీ, వీడియోలోని పెట్రోల్ పంపుకు చాలా పోలికలు (లోగో డిజైన్, పిల్లర్ డిజైన్) ఉన్నట్టు కింద ఫోటోలో చూడవొచ్చు.

అంతేకాదు, రాఫ్సంజన్‌ మరియు ఇతర పెర్షియన్ పదాలతో ఇంటర్నెట్‌లో వెతకగా, వీడియోలోని ఘటన రాఫ్సంజన్‌లో జరిగినట్టు చెప్తూ ఒక పెర్షియన్ వార్తాసంస్థ ప్రచురించిన న్యూస్ అర్టికల్ సెర్చ్ రిజల్ట్స్‌లో వస్తుంది. పెట్రోల్ పంపుకు చెందిన వారితో వ్యక్తిగత గొడవ వల్ల వీడియోలోని వ్యక్తి పెట్రోల్ పంపుకు నిప్పంటించాడని తెలిసింది.

చివరగా, ఒక వ్యక్తి పెట్రోల్ పంపుకు నిప్పంటిస్తున్న ఈ వీడియోలోని ఘటన భారతదేశానికి సంబంధించింది కాదు; అది ఇరాన్ దేశంలో జరిగిన ఘటన.

Share.

About Author

Comments are closed.

scroll