దుబాయ్‌లోని మసీదులో మహిళలు రామ భజన చేస్తున్నారంటూ, కొందరు ముస్లిం మహిళలు రామ భజన చేస్తున్నట్టు ఉన్న వీడియోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఐతే ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించి నిజమేంటో తెలుసుకుందాం.
క్లెయిమ్: దుబాయ్‌లోని మసీదులో మహిళలు రామ భజన చేస్తున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియో పుట్టపర్తిలోని శ్రీ సత్య సాయి ఆశ్రమమైన ప్రశాంతి నిలయంలో జరిగిన భజన కార్యక్రమానికి సంబంధించింది, దుబాయ్‌లోని మసీదులో జరిగింది కాదు. ఈ కార్యక్రమంలో బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, టర్కీ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
పోస్టులోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా యూట్యూబ్‌లో అచ్చం ఇలాంటిదే ఎక్కువ నిడివి గల ఒక వీడియో మాకు కనిపించింది. మిడిల్ ఈస్ట్ నుండి వచ్చిన సత్య సాయి బాబా యొక్క అరబ్ భక్తులు, బాబా భజన చేస్తున్నారన్న వివరణతో యూట్యూబ్‌లో ఈ వీడియో అప్లోడ్ చేసారు.
పైన తెలిపిన యూట్యూబ్ వీడియో వివరణ ఆధారంగా గూగుల్‌లో వెతకగా ఇదే ఫుటేజ్ శ్రీ సత్య సాయి అధికారిక యూట్యూబ్‌లో ఛానల్‌లో అప్లోడ్ చేసిన ఒక వీడియోలో కనిపించింది. ప్రశాంతి నిలయంలో జరిగిన కార్యక్రమంలో బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారని ఈ వీడియోకి సంబంధించిన వివరణలో పేర్కొన్నారు.
ఐతే ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో ఉన్న శ్రీ సత్య సాయి ప్రధాన ఆశ్రమాన్ని ప్రశాంతి నిలయం అని పిలుస్తారు. దీన్నిబట్టి పోస్టులోని వీడియో పుట్టపర్తిలో జరిగిన భజన కార్యక్రమానిదని స్పష్టంగా అర్ధమవుతుంది. పైగా ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాల్‌లో ఈ భజన జరిగినట్టు కుల్వంత్ హాల్ ఫోటోలు (ఇక్కడ మరియు ఇక్కడ) చుస్తే అర్ధమవుతుంది.
2018లో కూడా ఈ వీడియో ఇదే క్లెయిమ్‌తో వైరల్ అయినప్పుడు, ఈ వీడియోలో ఉన్న వారిలో కొందరు మాత్రమే ముస్లింలు లేదా అరబ్బులని, అందరూ కాదని ది క్వింట్ అనే ఫాక్ట్- చేక్కింగ్ సంస్థతో మాట్లాడుతూ సత్యసాయి బాబా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వారు స్పష్టం చేసారు.
చివరగా, ఈ వీడియో పుట్టపర్తిలో జరిగిన భజన కార్యక్రమానికి సంబంధించింది, దుబాయ్‌లో జరిగింది కాదు.