గోవులను అక్రమ రవాణా చేసే వారిని ఎన్‌కౌంటర్ చేయమని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తన రాష్ట్ర పోలీసులకు ఆదేశాలిచ్చినట్టు సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: గోవులను అక్రమ రవాణా చేసే వారిని ఎన్‌కౌంటర్ చేయమని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తన రాష్ట్ర పోలీసులకు ఆదేశాలిచ్చారు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటోలో కనిపిస్తున్నది అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బనంద సోనోవాల్, ప్రస్తుత అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కాదు. 10 మే 2021 నాడు అస్సాం ముఖ్యమంత్రి పదవి చేపట్టిన హిమంత బిస్వా శర్మ, గోవులను అక్రమ రవాణా, డ్రగ్స్ స్మగ్లింగ్‌ని అరికట్టేందుకు పోలీసులకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. కాని, గోవులను అక్రమ రవాణా చేసే వారిని ఎన్ కౌంటర్ చేయమని హేమంత్ బిస్వా శర్మ బహిరంగ ప్రకటన ఎక్కడ చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కు సంబంధించిన వివరాల కోసం గూగుల్‌లో వెతికితే, 10 మే 2021 నాడు అస్సాం ముఖ్యమంత్రి పదవి చేపట్టిన హిమంత బిస్వా శర్మ, అస్సాం రాష్ట్రంలో గోవుల అక్రమ రవాణా, డ్రగ్స్ స్మగ్లింగ్ ని అరికట్టేందుకు తమ రాష్ట్ర పోలీసులని ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించినట్టు తెలిసింది. ఈ విషయంలో పోలీసులు దోషులపై ‘జీరో-టాలరెన్స్ పాలసీ’ అమలుపరచాలని హిమంత బిస్వా శర్మ జూన్ 2021లో ఆదేశాలిచ్చారు.
హిమంత బిస్వా శర్మ ఆదేశాలని అనుసరిస్తూ అస్సాం రాష్ట్ర పోలీసులు 24 కోట్ల విలువైన డ్రగ్స్‌ని సీజ్ చేసి 500 మంది దోషులని అరెస్ట్ చేసినట్టు ‘India TV’ న్యూస్ వెబ్సైటు 10 జూన్ 2021 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసింది. అయితే, ఈ క్రమంలో అస్సాం పోలీసులు 12 మంది అనుమానిత నేరస్థులని కాల్చి చంపేసినట్టు తెలిసింది. పోలీసులకు విచ్చలవిడిగా అధికరలిస్తూ నేరస్థులని ఎన్‌కౌంటర్ చేసేలా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రేరేపిస్తున్నారంటూ అస్సాం ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.
05 జూలై 2021 నాడు అస్సాం పోలీసు అధికారులతో జరిగిన సమవేశంలో హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ, “ఒక అత్యాచార కేసులోని నేరస్థుడు పోలీసుల ఆయుధాలని లాక్కోని పారిపోతుంటే, పోలీసులు ఆ నేరస్థుడిని కాల్చ వలిసి వస్తుంది. అలాంటి నేరస్థుడిని చాతిపై కాల్చలేకపోయిన, కాలుపై కాల్చే హక్కు న్యాయస్థానం పోలీసులు కల్పించింది” అని తెలిపారు. అంతేకాదు, అస్సాం రాష్ట్రంలో పశువుల అక్రమ రవాణా చేసే వారిని ఉపేక్షించేది లేదని హిమంత బిస్వా శర్మ ఈ సమావేశంలో తెలిపారు. కానీ, గోవుల అక్రమ రవాణా చేసే నేరస్థులని ఎన్‌కౌంటర్ చేయమని హిమంత బిస్వా శర్మ బహిరంగ ప్రకటన ఎక్కడా చేయలేదు.
అస్సాం రాష్ట్రంలో గోవుల పరిరక్షణకు సంబంధించి హేమంత్ బిస్వా శర్మ ప్రభుత్వం 12 జూలై 2021 నాడు ‘Assam Cattle Preservation Bill, 2021’ అనే కొత్త చట్టాన్ని తమ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అస్సాం ప్రభుత్వం ఈ కొత్త చట్టం ద్వారా అస్సాం రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకి గోవులను రవాణా చేయడం చట్టవిరుద్ధం చేసింది. అలాగే, ఇతర రాష్ట్రాల నుండి అస్సాం రాష్ట్రానికి గోవుల అక్రమ రవాణాని బ్యాన్ చేసింది. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం అస్సాం రాష్ట్రంలో కేవలం వ్యవసాయం లేదా పశుసంవర్ధకం కోసం మాత్రమే గోవులను రవాణా చేసుకోవొచ్చు. అంతేకాదు, హిందువులు నివసించే ప్రదేశంలో, హిందూ దేవాలయాల సమీపంలో గోమాంస విక్రయాలని ఈ చట్టం నిషేదించింది. ఈ పశు సంరక్షణ చట్టంలోని నిబంధలను ఉల్లంఘించిన వారికి అస్సాం ప్రభుత్వం 3 నుండి 8 సంవత్సరాల జైలు శిక్ష, 3 నుండి 5 లక్షల జరిమానా విధించనుంది. గోవులను అక్రమ రవాణా చేసే వారిని ఎన్‌కౌంటర్ లేదా మరణశిక్ష విధించాలనే నిబంధన ఈ చట్టంలో లేదు.
అసలు పోస్ట్ చేసిన ఫోటోలో కనిపిస్తున్నది అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బనంద సోనోవాల్, ప్రస్తుత అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కాదు.
చివరగా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గోవులను అక్రమ రవాణా చేసే నేరస్థులని ఎన్‌కౌంటర్ చేయమని ఆ రాష్ట్ర పోలీసులకు ఆదేశాలివ్వలేదు.