ఇటీవల సోషల్ మీడియాలో పాఠశాల విద్యార్ధులు రోల్ కాల్ సమయంలో జై శ్రీరామ్ అనే చెప్పే వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే గుజరాత్ ప్రభుత్వం స్కూల్ విద్యార్ధులు చేత రోల్ కాల్ సమయంలో ప్రజెంట్ సార్/ యస్ సార్‌కి బదులుగా జై శ్రీరామ్ అని చెప్పించాలని అక్కడి పాఠశాలలని ఆదేశించింది అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: గుజరాత్ ప్రభుత్వం స్కూల్ విద్యార్ధులు చేత రోల్ కాల్ సమయంలో ప్రజెంట్ సార్‌కి బదులుగా జై శ్రీరామ్ అని చెప్పించాలని అక్కడి పాఠశాలలని ఆదేశించింది.
ఫాక్ట్ (నిజం): గుజరాత్ ప్రభుత్వం రోల్ కాల్ సమయంలో ప్రజెంట్ సార్‌కి బదులుగా జై శ్రీరామ్ అని చెప్పాలని అక్కడి పాఠశాలలను ఆదేశించినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదు. గుజరాత్ ప్రభుత్య విద్యాశాఖ వెబ్‌సైట్‌లో కూడా ఈ అంశానికి సంబంధించి ఎలాంటి సమచారం లభించలేదు. అయితే 2019 నుండి అన్ని పాఠశాలల్లో విద్యార్థులు రోల్ కాల్ సమయంలో ‘యస్ సర్’ లేదా ‘యస్ మేడమ్’కి బదులుగా ‘జై హింద్’ లేదా ‘జై భారత్’ అని చెప్పడం తప్పనిసరి చేస్తూ గుజరాత్ విద్యాశాఖ సర్క్యులర్ జారీ చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
తగిన కీవర్డ్స్ ఉపయోగించి వైరల్ క్లెయిమ్ గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఉత్తర గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలోని పాఠశాలలో విద్యార్ధులు రోల్ కాల్ సమయంలో ప్రజెంట్ సార్/ ఎస్ సార్ కి బదులుగా జై శ్రీరామ్ అని చెప్తున్న రిపోర్ట్స్ లభించాయి (ఇక్కడ & ఇక్కడ). ఈ పాఠశాల రోల్ కాల్ వీడియోనే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పాఠశాల ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజెంట్ సార్‌కి బదులుగా జై శ్రీరామ్ అని నినాదం చేయించినట్లు మీడియా రిపోర్ట్స్ ఎక్కడా పేర్కొనలేదు.

తదుపరి గుజరాత్ ప్రభుత్వం స్కూల్ విద్యార్ధులు చేత రోల్ కాల్ సమయంలో ప్రజెంట్ సార్/ ఎస్ సార్ కి బదులుగా జై శ్రీరామ్ అని చెప్పించాలని అక్కడి పాఠశాలలని ఆదేశించిందా అని ఇంటర్నెట్‌లో వెతకగా ఎలాంటి ఆధారాలు లభించలేదు, గుజరాత్ ప్రభుత్య విద్యాశాఖ వెబ్‌సైట్‌లో పరిశీలించగా, అక్కడ కూడా ఈ అంశానికి సంబంధించిన ఎలాంటి సమచారం లభించలేదు. ఒకవేళ గుజరాత్ ప్రభుత్వం అలాంటి నిర్ణయం ప్రకటిస్తే, దీనికి సంబంధించి అనేక రిపోర్ట్స్ లభించేవి. దీన్ని బట్టి ఇది కేవలం ఈ ఒక్క పాఠశాల తీసుకొన్న వ్యక్తిగత నిర్ణయంగా నిర్ధారించవొచ్చు.
అయితే, గతంలో గుజరాత్ ప్రభుత్వం విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే దేశభక్తిని పెంపొందించాలి అనే లక్ష్యంతో 01 జనవరి 2019 నుండి గుజరాత్‌లోని అన్ని పాఠశాలలో విద్యార్థులు రోల్ కాల్ సమయంలో ‘యస్ సర్’ లేదా ‘యస్ మేడమ్’కి బదులుగా ‘జై హింద్’ లేదా ‘జై భారత్’ అని చెప్పడం తప్పనిసరి చేస్తూ సర్క్యులర్ జారీ చేసింది అని పలు వార్తసంస్థల కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ).

చివరగా, గుజరాత్ ప్రభుత్వం రోల్ కాల్ సమయంలో ప్రజెంట్ సార్‌కి బదులుగా జై శ్రీరామ్ అని చెప్పాలని అక్కడి పాఠశాలలను ఆదేశించలేదు.