Fake News, Telugu
 

గుజరాత్‌లో ఒక ఆదివాసీ ఉపాధ్యాయుడు తాగిన మత్తులో సరస్వతి చిత్రపటాన్ని కాలితో తన్నిన వీడియోని మతపరమైన కథనంతో షేర్ చేస్తున్నారు

0

గుజరాత్ రాష్ట్రంలో ఒక ముస్లిం ఉపాధ్యాయుడు సరస్వతి మాత చిత్రపటాన్ని కాలితో తన్నుతున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ఈ వీడియోలో సరస్వతి చిత్రపటాన్ని తన్నింది క్రైస్తవుడని మరికొందరు షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

క్లెయిమ్: గుజరాత్ రాష్ట్రంలో ముస్లిం ఉపాధ్యాయుడు సరస్వతి మాత చిత్రపటాన్ని కాలితో తన్నుతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): వీడియోలోని ఘటన గుజరాత్ రాష్ట్రం ఛోటా ఉదేపూర్ జిల్లా క్వాంట్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. యోగేష్‌భాయ్ విష్ణుభాయ్ ర‌థ్వా అనే ఉపాధ్యాయుడు తాగిన మత్తులో క్వాంట్ ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులను దూషిస్తూ అక్కడే ఉన్న సరస్వతి మాత చిత్రపటాన్ని కాలితో తన్నిన దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. యోగేష్‌, ర‌థ్వా ఆదివాసీ జాతికి చెందిన వాడని, ముస్లిం లేదా క్రైస్తవ మతానికి చెందిన వాడు కాదని క్వాంట్ పోలీసు అధికారులు స్పష్టం చేశారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘ABP’ వార్తా సంస్థ 31 డిసెంబర్ 2022 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. గుజరాత్ రాష్ట్రంలోని ఛోటా ఉదేపూర్ జిల్లాలో ఒక ఉపాధ్యాయుడు తాగిన మైకంలో సరస్వతి చిత్రపటాన్ని కాలితో తన్నుతున్న దృశ్యాలని ఈ వీడియోలో తెలిపారు.  

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తెలుపుతూ ‘ఆజ్ తక్’ వార్తా సంస్థ ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఛోటా ఉదేపూర్ జిల్లా క్వాంట్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో యోగేష్ అనే ఉపాధ్యాయుడు తాగిన మత్తులో తోటి ఉపాధ్యాయులని దూషిస్తూ అక్కడే ఉన్న సరస్వతి చిత్రపటాన్ని కాలితో తన్నినట్టు ఈ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. ఈ ఘటనకు సంబంధించి పాఠశాల ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్టు తెలిపారు .

వీడియోలో సరస్వతి చిత్రపటాన్ని కాలితో తన్నిన ఉపాధ్యాయుడు, ర‌థ్వా అనే ఆదివాసీ తెగకు చెందిన యోగేష్‌భాయ్ విష్ణుభాయ్ ర‌థ్వా అని, అతను ముస్లిం లేదా క్రైస్తవ మతానికి చెందిన వాడు కాదని క్వాంట్ పోలీస్ స్టేషన్ అధికారులు మాకు స్పష్టం చేశారు. తాగిన మత్తులో యోగేష్‌ ర‌థ్వా ఈ చర్యకు పాల్పడినట్టు క్వాంట్ పోలీస్ అధికారులు తెలిపారు. సరస్వతి చిత్రపటాన్ని కాలితో తన్నిన వ్యక్తి ముస్లిం కాదని ఛోటా ఉదేపూర్ ఎస్పి ధర్మేంద్ర శర్మ కూడా స్పష్టం చేశారు. యోగేష్‌భాయ్ విష్ణుభాయ్ ర‌థ్వాపై క్వాంట్ పోలీస్ స్టేషన్లో ఫైల్ అయిన FIR కాపీని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, గుజరాత్‌లో ర‌థ్వా ఆదివాసీ తెగకు చెందిన ఉపాధ్యాయుడు తాగిన మత్తులో సరస్వతి చిత్రపటాన్ని కాలితో తన్నిన వీడియోని మతపరమైన కథనంతో షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll