హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వరదలు భీభత్సం సృష్టిస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వరదలు భీభత్సం సృష్టిస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో జపాన్ దేశంలో ఇటీవల కొండచరియలు విరిగిపడిన ఘటనకు సంబంధించింది. ఈ ఘటన 03 జూలై 2021 నాడు జపాన్ దేశంలోని అటమి నగరంలో చోటుచేసుకుంది. అటమి నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతూ ఇలా ఆ నగరంలో భీభత్సం సృష్టించాయి. ఈ వీడియోకి హిమాచల్ ప్రదేశ్ వరదలకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Al Jazeera English’ న్యూస్ ఛానల్ 03 జూలై 2021 నాడు తమ యూట్యూబ్ ఛానల్లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. జపాన్ దేశంలో కొండచరియలు విరిగిపడి విధ్వంసం సృష్టిస్తున్న దృశ్యాలని ఈ వీడియోలో రిపోర్ట్ చేసారు. ఈ ఘటన 03 జూలై 2021 నాడు చోటుచేసుకున్నట్టు వివరణలో తెలిపారు. జూలై మొదటి వారంలో అటమి నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతూ ఆ నగరంలో విధ్వంసం సృష్టించినట్టు ఈ వీడియోలో తెలిపారు. ఇదే విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ‘CNN’ న్యూస్ సంస్థ కూడా ఈ వీడియోని తమ వెబ్సైటులో పబ్లిష్ చేసారు.
అటమి నగరంలో కొండచరియలు విరిగిపడిన ఘటనకు సంబంధించి ‘BBC’ న్యూస్ సంస్థ 03 జూలై 2021 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయినట్టు అలాగే, 27 మంది తప్పిపోయినట్టు ‘Reuters’ తమ ఆర్టికల్ లో రిపోర్ట్ చేసింది. ఈ ఘటనకి సంబంధించి పబ్లిష్ అయిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్ మరియు వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో హిమాచల్ ప్రదేశ్ వరదలకి సంబంధించింది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రా జిల్లలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా 12 జూలై 2021 నాడు పర్యాటక ప్రాంతం ధర్మశాలలో వరదలు భీభత్సం సృష్టించాయి. ధర్మశాలలో వచ్చిన ఈ ఆకస్మిక వరదలలో వాహనాలు కొట్టుకుపోతున్న వీడియోలని పలు న్యూస్ చానెల్స్ వారు పబ్లిష్ చేసారు. హిమాచల్ ప్రదేశ్ వరదలకు సంబంధించి పబ్లిష్ అయిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్ మరియు వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
చివరగా, జపాన్ దేశంలో కొండచరియలు విరిగిపడిన దృశ్యాలని హిమాచల్ ప్రదేశ్ వరద భీభత్సం దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు.