అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించబోతున్న సీతారాముల వారి విగ్రహాలు, ఈ విగ్రహాలను రూపొందించినది మైసూరుకు చెడిన అరుణ్ యోగిరాజ్ అంటూ ఒక ఫోటోను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోకు సంబంధించిన నిజమేంటో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: ఈ ఫోటోలో ఉన్నవి అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించబోతున్న సీతారాముల వారి విగ్రహాలు
ఫాక్ట్(నిజం): సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సీతారాముల శిల్పాలను అరుణ్ తన సోషల్ మీడియాలో 2019లో పోస్టు చేశారు. అరుణ్ భార్య, అయోధ్యలో స్థాపింపబడే రాముడి శిల్పం అయిదేళ్ళ బాలుడి శిల్పంలా ఉంటుందని స్పష్టత ఇచ్చారు. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పెట్టించే విధంగా ఉంది.
ఈ క్లెయిమ్ గురించి కీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో వెతికితే, ఇటీవల మీడియా అదే చిత్రాన్ని ప్రచురిస్తూ, అయోధ్యలోని రామమందిరంలో కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు అని ప్రచురించాయి (ఇక్కడ మరియు ఇక్కడ).
ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సర్చ్ ద్వారా పరిశీలిస్తే, ఇదే శిల్పాన్ని 2019లో డెక్కన్ హెరాల్డ్ వార్తా పత్రిక “Sculptors mapping Mysuru” అనే శీర్షికతో ప్రచురించడం గమనించం. అంతే కాకుండా ఈ శిల్పాన్ని అరుణ్ తన సోషల్ మీడియాలో 2019లో పోస్టు చేశారు.
అయితే, అయోధ్యలో బాల రాముడి విగ్రహం గురించి తప్పుడు సమాచారం ప్రచారం చేయబడుతుందని విగ్రహ శిల్పి అరుణ్ భార్య చెప్తూ, సోషల్ మీడియాలో షేర్ చేయబడుతున్న ఫోటో అరుణ్ కొన్ని సంవత్సరాల క్రితం ఒక కస్టమర్ కోసం చేసింది అని, అయోధ్యలో స్థాపింపబడే రాముడి శిల్పం అయిదేళ్ళ బాలుడి శిల్పంలా ఉంటుందని స్పష్టత ఇచ్చారు. అంతే కాకుండా ప్రోటోకాల్ ప్రకారం దీని గురించి ఎక్కువ వివరాలు బయటికి చెప్పరాదు అని అరుణ్ అన్నయ్య కూడా మీడియాకు తెలిపారు.
చివరిగా, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సీతా రాముల విగ్రహాలు అరుణ్ యోగిరాజ్ చెక్కినవే కానీ అవి అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించబోతున్న విగ్రహాలు కాదు.