Fake News, Telugu
 

ప్రభుత్వ ఉద్యోగులపై దాడులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరుతో షేర్ అవుతున్న ఈ హెచ్చరిక ఫేక్

0

ఇటీవల, విధులు నిర్వహిస్తున్న ఆర్‌టీసీ మొదలైన ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు జరిగిన ఘటనలు రిపోర్ట్ అయిన నేపథ్యంలో ఇలాంటి దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరుతో ఒక హెచ్చరిక సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ‘ఉద్యోగుల పట్ల ఎవరైనా ఇబ్బందుల పాలు చేసినా, అసభ్యకరంగా మాట్లాడినా, దురుసుగా ప్రవర్తించినా, ఉద్యోగి విధులకు అటంకం కలిగించినా, ఉద్యోగులపై చేయి చేసుకున్నా వివిధ IPC సెక్షన్ల క్రింద చట్టపరమైన శిక్ష విధించబడుతుందని,’ ఈ సర్కులర్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెచ్చరించినట్టు ఉంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తెలంగాణ ఉద్యోగుల విధి నిర్వహణకు అటంకం కలిగించినా/దాడులు చేసినా వివిధ IPC సెక్షన్ల క్రింద చట్టపరమైన శిక్ష విధించబడుతుంది – రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెచ్చరిక

ఫాక్ట్(నిజం): తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరుతో షేర్ అవుతున్న ఈ సర్కులర్‌ ఫేక్. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ సర్కులర్‌ విడుదల చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అయితే, ఈ IPC సెక్షన్లు దేశ వ్యాప్తంగా ఇప్పటికే అమలులో ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణకు అడ్డంకులు కలిగిస్తే ఈ సెక్షన్ల కింద శిక్షార్హులే. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇటీవల తెలంగాణలో ఆర్‌టీసీ మొదలైన ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు జరిగిన ఘటనలు రిపోర్ట్ అయిన నేపథ్యంలో ఈ సర్కులర్‌ విస్తృతంగా షేర్ అవుతోంది. ఐతే నిజానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ హెచ్చరిక జారీ చేయలేదు. ఈ సర్కులర్‌ వైరల్ అవడంతో ప్రభుత్వానికి సంబంధించిన జి.ఎ.డి అధికారులు దీనిని ఖండించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెచ్చరించినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని జి.ఎ.డి అధికారులు వివరణ ఇచ్చారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్టులో ప్రస్తావించిన IPC సెక్షన్లు అన్నీ ప్రభుత్వ ఉద్యోగి ఎలాంటి ఇబ్బంది లేకుండా తన సేవలను నిర్వహించేందుకు/విధి నిర్వహణ సమయంలో వారిపై దాడులు జరగకుండా  ప్రోత్సహించేవే. ఈ సెక్షన్ల ఉల్లంఘిస్తే ఫైన్/రెండు- పది సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ).

ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ IPC సెక్షన్లు దేశ వ్యాప్తంగా ఇప్పటికే అమలులో ఉన్నాయి, ఏ ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణకు అడ్డంకులు కలిగించినా ఈ సెక్షన్ల కింద శిక్షార్హులే. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ చట్టాలు అమలులో ఉన్నాయి. ఐతే ప్రత్యేకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక సర్కులర్‌ ద్వారా వీటిని అమలు చేయడం అంటూ ఉండదు. అంతే కాదు, ఇవి ఈ మధ్య కొత్తగా తీసుకొచ్చిన సెక్షన్లు కాదు.

చివరగా, ప్రభుత్వ ఉద్యోగులపై దాడులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరుతో షేర్ అవుతున్న ఈ  హెచ్చరిక ఫేక్.

Share.

About Author

Comments are closed.

scroll