ఈ నెల (సెప్టెంబర్) 14న ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్‌లో నలుగురు వ్యక్తుల చేతిలో 19 ఏళ్ళ అమ్మాయి అత్యాచారానికి గురైనట్టు, ఆ వ్యక్తులు కొట్టిన దెబ్బలకు తను 29న ఆసుపత్రి లో చనిపోయిందని బాధితురాలి గురించి పోస్ట్ చేస్తూ, చాలా మంది ఒక అమ్మాయి ఫోటోని ఒక హాష్ టాగ్ తో షేర్ చేస్తున్నారు. ఆ ఫోటో హత్రాస్ అత్యాచార బాధితురాలిదో కాదో చూద్దాం.
ముఖ్య సమాచారం: రేప్ మొదలగు తీవ్రమయిన కేసుల్లో బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేసే పేరు లేదా ఇతర సమాచారాన్ని ముద్రించడం లేదా ప్రచురించడం ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 228 (A) ప్రకారం నేరం. అంతే కాదు, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా మొదలైన వాటిలో ఏ వ్యక్తి అయినా బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేసే పేరు లేదా ఇంకే విషయాలు ముద్రించడం లేదా ప్రచురించడం నేరం అని సుప్రీంకోర్టు 2018 లో ఇచ్చిన తీర్పులో పేర్కొంది.
క్లెయిమ్: తాజాగా హత్రాస్ (ఉత్తరప్రదేశ్) లో అత్యాచారానికి గురైన బాధితురాలి ఫోటో.
ఫాక్ట్ (నిజం): ఫోటోలో ఉన్నది హత్రాస్ అత్యాచార బాధితురాలు కాదు. ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు మనీషా. తను 2018 లోనే చనిపోయింది. డాక్టర్ల నిర్లక్షం వల్ల చనిపోయిందని 2018 లో ‘Justice For Manisha’ అనే హాష్ టాగ్ తో కొందరు ఇదే ఫోటోని పోస్ట్ చేసారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లో పెట్టిన హాష్ టాగ్ తో టైం ఫిల్టర్ పెట్టి వెతకగా, ఇదే ఫోటోని కొందరు 2018 లోనే ఫేస్బుక్ లో పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఫోటోలో ఉన్నది మనీషా అని, డాక్టర్ల నిర్లక్షం వల్ల తను 2018 లోనే చనిపోయిందని చెప్తూ కొందరు 2018 లో పెట్టిన పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. అప్పుడు పోస్ట్ చేసిన వారే, ఇప్పుడు మళ్ళీ ఆ ఫోటోలో ఉన్నది హత్రాస్ అత్యాచార బాధితురాలు కాదని పోస్ట్ చేసినట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.
ఫోటోలో ఉన్నది తన చెల్లెలు అని, తను 2018 లోనే చండీగఢ్ లో మృతి చెందిందని చెప్తూ అజయ్ పెట్టిన పోస్ట్ ని ఇక్కడ చదవొచ్చు. 2018 లో అజయ్ పెట్టిన పోస్ట్ ని ఇక్కడ చూడవొచ్చు. 2018 లో ఆ ఘటన పై ‘టైమ్స్ అఫ్ ఇండియా’ మరియు ‘దైనిక్ భాస్కర్’ వారు ప్రచురించిన వార్తలను ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.
అంతేకాదు, హత్రాస్ అత్యాచార బాధితురాలి అన్నతో ‘ఇండియా టుడే’ వారు మాట్లాడగా, పోస్ట్ లోని ఫోటోలో ఉన్నది తన చెల్లెలు కాదు అని తెలిపాడు. హత్రాస్ అత్యాచార కేసుకి సంబంధించి నిందితులను ఆరెస్ట్ చేసినట్టు హత్రాస్ పోలీసులు ట్వీట్ చేసారు.
చివరగా, ఫోటోలో ఉన్నది హత్రాస్ అత్యాచార బాధితురాలు కాదు. ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు మనీషా. తను 2018 లోనే డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చనిపోయింది.