Fake News, Telugu
 

రెండు కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వారిని ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా గుర్తించేలా కేంద్ర ప్రభుత్వం చట్టం తెస్తున్నట్టు ఎటువంటి సమాచారం లేదు

0

‘రెండు పెళ్ళిళ్ళ కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా పరిగణించే విధంగా’, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్టు కేంద్ర మంత్రి స్మ్రితి ఇరానీ ప్రకటించినట్టు చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ విషయానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: రెండు పెళ్లిళ్ల కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా పరిగణించే విధంగా బిల్లు తీసుకురాబోతున్నాం – స్మ్రితి ఇరానీ.

ఫాక్ట్(నిజం): రెండు కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా గుర్తించేలా కేంద్ర మంత్రి స్మ్రితి ఇరానీ వ్యాఖ్యానించినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. ఒకవేళ ఆమె నిజంగానే ఇలా వ్యాఖ్యానించి ఉంటే, మీడియా సంస్థలు రిపోర్ట్ చేసి ఉండేవి, కానీ ఇలాంటి వార్తా కథనాలేవి మాకు లభించలేదు. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల ఎన్నికలలో (పంచాయతీ తదితర) ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలు ఉన్నవారిని ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా గుర్తించే చట్టాలు చేసాయి. కాని పెళ్లిళ్లను ఎన్నికలకు ముడిపెడుతూ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టాలు చేయలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

స్మ్రితి ఇరానీ ఈ వ్యాఖ్యలు చేసిందా?

రెండు కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా గుర్తించేలా కేంద్ర మంత్రి స్మ్రితి ఇరానీ వ్యాఖ్యానించినట్టు ఎటువంటి కథనాలు లేవు. ఒకవేళ ఆమె నిజంగానే ఇలా వ్యాఖ్యానించి ఉంటే మీడియా సంస్థలు రిపోర్ట్ చేసి ఉండేవి, కానీ ఇలాంటి వార్తా కథనాలేవి మాకు లభించలేదు.

ప్రస్తుత చట్టాలు ఎం చెప్తున్నాయి:

సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేయడం అనేది రాజ్యాంగం ద్వారా దేశ పౌరులకు సంక్రమించించిన హక్కు. ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చు. ఐతే పోస్టులో చెప్తున్నట్టు ఈ హక్కుకు కొన్ని షరతులు నిర్దేశించాలంటే ముందుగా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. కాని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై రాజ్యంగ సవరణ చేయబోతున్నట్టు ఎటువంటి సమాచారం లేదు, పైగా ఈ అంశంపై రాజకీయంగా చర్చలు జరుగుతున్నట్టు కూడా ఎటువంటి కథనాలు లేవు.

ఎన్నికలకు సంబంధించి రూపొందించిన Representation of People Act, 1951లోని  సెక్షన్ 8 (3) ప్రకారం, ఒక వ్యక్తి ఏదైనా నేరానికి పాల్పడి, 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష అనుభవించినట్లయితే, ఆ వ్యక్తి ఆరు సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు.

భారత చట్టాల ప్రకారం రెండో పెళ్లిళ్లు చేసుకోవడం క్రిమినల్ నేరం, ఇలా చేయడం ద్వారా ఏడు సంవత్సరాల శిక్ష కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి  పైన చెప్పినట్టు (RPI, 1951) రెండో పెళ్లి నేరం రుజువై జైలు శిక్ష అనుభవించిన వారు సహజంగానే ఆరు సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటి చేయడానికి అనర్హులు.

ఐతే మొదటి వివాహం నుండి న్యాయపరంగా (విడాకులు) బయటికి వచ్చేసిన వారు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, అది న్యాయపరంగా చెల్లుతుంది. అలాంటప్పుడు వారు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, వారికీ ఎలాంటి అభ్యంతరం లేదు.

ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా గుర్తించే పలు రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు :

సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేసే పంచాయతీరాజ్ చట్టాలలో ఎన్నికల్లో పోటీ చేసే వారికి సంబంధించి కొన్ని అర్హతలను నిర్దేశించి, ఆ అర్హతలు లేనివారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించకుండా చట్టాలను రూపొందిస్తారు. ఇద్దరికి మించి పిల్లల్లు ఉన్నా, కనీస విద్యార్హతలు లేకున్నా మొదలైన షరతులను రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీరాజ్ చట్టాలలో పేర్కొంటారు.

ఉదాహారణకు తెలంగాణ ప్రభుత్వం 2018లో తీసుకొచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టంలో ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలున్న వారిని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా గుర్తించింది. జనాభా నియంత్రణ ఉద్దేశంతో మాత్రమే ఈ నిబంధనను తీసుకోస్తారే తప్ప వేరే ఉద్దేశమేమి ఉండదు.

ఐతే పెళ్లిళ్లను ఎన్నికల్లో పోటీకి ముడిపెడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసినట్టు కూడా ఎటువంటి సమాచారం లేదు.

చివరగా, రెండు కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వారిని ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా గుర్తించేలా కేంద్ర ప్రభుత్వం చట్టం తెస్తున్నట్టు ఎటువంటి సమాచారం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll