భారత్ రాష్ట్ర సమితికి (BRS) ఉన్న జాతీయ పార్టీ హోదాను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల తొలగించిందంటూ సోషల్ మీడియాలో NTV వార్తా సంస్థ పబ్లిష్ చేసిన వీడియో ఒకటి షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: భారత్ రాష్ట్ర సమితికి ఉన్న జాతీయ పార్టీ గుర్తింపు హోదాను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల తొలగించింది.
ఫాక్ట్ (నిజం): కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి జాతీయ పార్టీ హోదా ఇవ్వలేదు. జాతీయ పార్టీ గుర్తింపు పొందడానికి ఎన్నికల సంఘం నిర్దేశించిన అర్హతలేవీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు సాధించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్) పార్టీకి ఉన్న రాష్ట్ర పార్టీ హోదాను కేంద్ర ఎన్నికల సంఘం 2023 ఏప్రిల్ నెలలో తొలగించిన విషయాన్ని ఈ NTV వార్తా వీడియో రిపోర్ట్ చేసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, ఈ వీడియోని NTV వార్తా సంస్థ 10 ఏప్రిల్ 2023 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న రాష్ట్ర పార్టీ హోదాను కేంద్ర ఎన్నికల సంఘం తొలగించిన విషయాన్ని ఈ వీడియో రిపోర్ట్ చేస్తుంది. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు 2023 ఏప్రిల్ నెలలో ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి.
ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు బీఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్) ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర పార్టీ గుర్తింపు హోదా కలిగి ఉంది. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014, 2019లలో నిర్వహించిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పోటీ చేయని కారణంగానే ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర పార్టీ హోదాను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్‌కు ఉన్న రాష్ట్ర పార్టీ గుర్తింపు హోదాను రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటనను ఇక్కడ చూడవచ్చు. బీఆర్ఎస్ పార్టీ కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రాష్ట్ర పార్టీ హోదా కలిగి ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది.
రాజకీయ పార్టీలు జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఎన్నికల సంఘం నిర్దేశించిన కొన్ని అర్హతలను అందుకోవాలి. జాతీయ పార్టీ గుర్తింపు హోదా కోసం కేంద్ర ఎన్నికల సంఘం విధించిన షరతులను బీఆర్ఎస్ పార్టీ సాధించని నేపథ్యంలో, ఎన్నికల సంఘం బీఆర్ఎస్ పార్టీకి ఇంతవరకు జాతీయ పార్టీ గుర్తింపు హోదా కల్పివలేదు.
చివరగా, కేంద్ర ఎన్నికల సంఘం బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటి వరకు జాతీయ పార్టీ గుర్తింపు హోదా ఇవ్వలేదు; ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్‌కు ఉన్న రాష్ట్ర పార్టీ హోదాను మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది.